Begin typing your search above and press return to search.

ఫ్లాయిడ్‌ను హత్య చేసిన ఆ పోలీసు అధికారికి 270 నెలల జైలు శిక్ష !

By:  Tupaki Desk   |   26 Jun 2021 6:30 AM GMT
ఫ్లాయిడ్‌ను హత్య చేసిన ఆ  పోలీసు అధికారికి 270 నెలల జైలు శిక్ష !
X
అమెరికాతో పాటుగా యావత్ ప్రపంచం మొత్తం సంచలనం సృష్టించిన జార్డ్ ఫ్లాయిడ్‌ ఉదంతంలో మిన్నియా పోలిస్ అధికారి డెరెక్ చౌవిన్‌ ను అమెరికా కోర్టు దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. తాజాగా అత‌డికి కోర్టు శిక్ష విధించింది. ఆఫ్రికన్- అమెరికన్‌ జార్జ్ ఫ్లాయిడ్‌ను హత్య చేసినందుకు గానూ పోలీసు అధికారి డెరెక్ చౌవిన్‌కు 270 నెల‌లు జైలు శిక్ష విధిస్తూ అమెరికా కోర్టు తుది తీర్పు ఇచ్చింది. భార‌త‌ కాల‌మానం ప్ర‌కారం శుక్ర‌వారం అర్థ‌రాత్రి ఈ తీర్పును వెల్ల‌డించింది. చౌవిన్ సత్ప్రవర్తనను కనబరిస్తే 15 ఏళ్ల జైలు శిక్ష తర్వాత అతనికి పెరోల్‌ కు అనుమతించవచ్చని స్పష్టం చేసింది. ప్రతిపాదిత మార్గదర్శకాల్లో ఉన్నట్టు ఎక్కువ కాలం జైలు శిక్ష విధించాలన్న ప్రాసిక్యూటర్ విజ్ఞప్తికి స్పందిస్తూ.. ఈ విధంగా తీర్పునిచ్చింది.

గత ఏడాది మే 25న.. నకిలీ కరెన్సీ ఉపయోగించాడనే ఆరోపణలతో నల్లజాతీయుడైన జార్డ్ ఫ్లాయిడ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో బాధితుడిని రోడ్డుపై మోకాలితో తొక్కి పట్టారు. దాదాపు తొమ్మిది నిమిషాలు ఫ్లాయిడ్ మెడపై డెరెక్ చౌవిన్‌ అనే శ్వేతజాతి పోలీసు అధికారి మోకాలితో బలంగా నొక్కి పెట్టాడు. తనకు ఊపిరి ఆడట్లేదని బాధితుడు చెప్పినా వినిపించుకోలేదు. దీంతో ఫ్లాయిడ్ కొన్ని నిమిషాల్లోనే కన్నుమూశాడు. గత ఏడాది మే 25న జరిగిన ఈ దారుణమైన ఘటనపై అమెరికాలోని నల్లజాతీయులు తీవ్రంగా స్పందించారు. ఈ కేసుపై విచారణ జరుగుతున్న స‌మ‌యంలో కొన్ని వందల మంది నల్లజాతీయులు కోర్టు వద్దకు వ‌చ్చారు. నిందితుడు హత్యకు పాల్పడ్డట్లు తీర్పు వచ్చిన తరువాత వీరంతా హర్షం వ్యక్తం చేశారు. చప్పట్లు కొడుతూ, కార్ల హారన్లు మోగిస్తూ నినాదాలు చేశారు.