Begin typing your search above and press return to search.

అరెస్ట్ చేయడం కోసం విమానాన్ని మళ్లించారు.. అంతర్జాతీయ స్థాయిలో ఫైర్!

By:  Tupaki Desk   |   25 May 2021 2:30 AM GMT
అరెస్ట్ చేయడం కోసం విమానాన్ని మళ్లించారు.. అంతర్జాతీయ స్థాయిలో ఫైర్!
X
దాదాపు పన్నెండు దేశాలకు చెందిన 170 మంది ప్రయాణికులతో రియాన్ ఎయిర్ 4978 గ్రీస్ నుంచి లిథువేనియాకు బయల్దేరింది. మార్గం మధ్యలో ఫ్లైట్ ఒక్కసారిగా బెలారస్ వైపుగా మళ్లింది. ఏం జరుగుతుందోననే అయోమయంలో పడ్డారు ప్రయాణికులు. అంతలోనే ఓ యుద్ధ విమానం వెంబడిస్తున్నట్లుగా కనిపించింది. ఇదంతా ఏంటా? అనే ఆలోచన నుంచి తేరుకునే లోపే బెలారస్ రాజధాని మింక్ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. అయితే ఇదంతా ఎందుకు జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. విమానం ఒక్కసారిగా ఎందుకు రూటు మార్చిందో తెలియలేదు. కానీ ఇదంతా ఓ వ్యక్తి కోసం అని కొన్ని క్షణాల తర్వాత ప్రయాణికులకు అర్థమైంది. ఇంతకీ ఆ యువకుడు ఎవరు? అతడి కోసం విమానాన్ని ఎందుకు ఆపారు? యుద్ధ విమానం ఎందుకు రంగంలోకి దిగింది? పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మింక్ విమానాశ్రయంలో 26 ఏళ్ల యువకుడిని ఆ దేశ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ యువకుడే రోమన్ ప్రోటాసెవిక్. నెక్స్ టా గ్రూపు మాజీ ఎడిటర్. ఆ జర్నలిస్టు గతంలో బెలారస్ లో జరిగిన ఆందోళనలపై వరుస కథనాలను ప్రచురించారు. ఈ క్రమంలో అతడిపై ఎన్నో అభియోగాలు నమోదయ్యాయి. రోమన్ ను అరెస్ట్ చేయాలని ఆ దేశ ప్రభుత్వం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నట్లుగా తెలుస్తోంది. కొంతకాలంగా అతడు పోలాండ్ లో ఉంటున్నారు. ఆదివారం నాడు లిథువేనియాకు వెళ్తున్నక్రమంలో బెలారస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రన్ వే మీద ఉన్న విమానాన్ని ఒక్కసారిగా మళ్లించారు. అందుకు వాళ్లు చెప్పిన కారణం అంతర్జాతీయ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. బాంబు బెదిరింపులు ఉన్నాయనే కారణంతో లిథువేనియాకు వెళ్లే విమానాన్ని అత్యవసరంగా మింక్ విమానాశ్రయంలో ల్యాండ్ చేయాలని బెలారస్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఓ యుద్ధ విమానం ఎస్కార్టుగా వచ్చింది. విమానాశ్రయంలో తనిఖీలు నిర్వహించి రోమన్ తో పాటు మరో మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని బెలారస్ అధికార మీడియా అధికారికంగా ప్రకటించింది. బాంబు బెదిరింపుల నేపథ్యంలోనే విమానం ఆపాలని ఆ దేశ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో ఆదేశించినట్లు వెల్లడించింది.

ఈ వ్యవహారంపై అంతర్జాతీయ స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఓ జర్నలిస్టును అదుపులోకి తీసుకోవడం కోసం ఇంతటి సాహసానికి ఒడిగడతారా? అంటూ వివిధ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బాంబు బెదిరింపులు ఉంటే విమానం మింక్ కన్నా లిథువేనియా విల్ నూయుస్ కే సమీపంలో ఉందని... మింక్ లోనే ఎందుకు ల్యాండ్ అయిందనే ప్రశ్నలు గుప్పిస్తున్నారు. రోమన్ కోసమే ఉద్దేశపూర్వకంగానే మళ్లించినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రయాణికులకు ఇబ్బంది పెట్టే ఈ చర్యకు పాల్పడిన బెలారస్ పై ఆంక్షలు విధించాలంటూ అంతర్జాతీయంగా డిమాండ్లు వస్తున్నాయి. బలవంతంగా విమానాన్ని ల్యాండ్ చేయించడం అంటే చికాగో కన్వెన్షన్ నిబంధనలు ఉల్లంఘించడమేనని ఐరాస విమానయాన విభాగం ఆగ్రహం వ్యక్తం చేసింది. గగనతల, విమానాల సురక్షిత ప్రయాణాల కోసం ఆ ఒప్పందంలో కొన్ని నిబంధనలు ఉన్నాయని గుర్తు చేసింది. సాధారణ ప్రయాణికులతో వెళ్తున్న విమానాన్ని బలవంతంగా ఆపడమంటే హైజాక్ చేసినట్లేనని పోలాండ్ ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ పౌరులకు వ్యతిరేకంగా బెలారస్ ప్రభుత్వం వ్యవహరించిందని ఆ దేశంలోని అమెరికా రాయబారి అభిప్రాయపడ్డారు. అరెస్ట్ కోసం ఇలా చేయడం సరికాదని ట్వీట్ చేశారు.

బెలారస్ గగనతలాన్ని అసురక్షిత గగనతలంగా గుర్తించాలని లాటివియా, లిథువేనియా కోరడం గమనార్హం. ఓ ప్రత్యర్థిని పట్టుకోవడం కోసం ఇంతటి సాహసం చేయడం సరికాదని వివిధ దేశాలు అంటున్నాయి. ఈ అంతర్జాతీయ వివాదంపై అమెరికా, యూరోపియన్ దేశాలు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే విమానం ఆపేయగానే రోమన్ కళ్లలో భయం కనిపించిందని తోటి ప్రయాణికులు తెలిపారు. తనకు మరణ శిక్ష ఖాయమని అన్నారని... అప్పుడు తమకేం అర్థం కాలేదని మీడియాకు తెలిపారు. రోమన్ ఎక్కడంటూ ఆయన మద్దతు దారులు ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు.