Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ లో రేవంత్ ను తొక్కేసే ప్లాన్

By:  Tupaki Desk   |   14 Feb 2021 1:30 PM GMT
కాంగ్రెస్ లో రేవంత్ ను తొక్కేసే ప్లాన్
X
తెలంగాణ కాంగ్రెస్ లో ఇంకా ఆ కుమ్ములాటలు, ఆధిపత్య పోరులూ సమసిపోవడం లేదు. తెలంగాణను ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. దాదాపు 6 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉన్నా ఆ పార్టీ నేతలు మారడం లేదు. పదవులు, పీఠాల కోసం ఇంకా కొట్టుకుంటూనే ఉంటున్నారు. వేరే నేతలను ఎదగనీయని పరిస్థితి ఉందని రాజకీయ విశ్లేషకులు విమర్శలు గుప్పిస్తున్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ ను నిలబెట్టాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి నడుం బిగించారు. పీసీసీ రేసులో బలంగా ఉన్న రేవంత్ రెడ్డి తాజాగా రైతు సమస్యలపై అచ్చంపేట నుంచి హైదరాబాద్ కు పాదయాత్ర ప్రారంభించారు. ఆ జోష్ తో కాంగ్రెస్ లో ఉత్సాహం వచ్చేసింది.

కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం దీన్ని నీరుగార్చే ప్రయత్నాలకు తెరతీశారని ప్రచారం సాగుతోంది. తాజాగా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క రైతు భరోసా యాత్ర నిర్వహించడం విశేషం. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం ప్రాజెక్టులపై యాత్ర చేపడుతున్నారు. దీంతో రేవంత్ ను తొక్కేసే ప్లాన్ లో భాగంగానే ఇదంతా చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా కోమటిరెడ్డి తన నియోజకవర్గంలోని ఎస్ఎల్ బీసీ నుంచి హైదరాబాద్ కు ప్రాజెక్ట్ యాత్ర రేవంత్ రెడ్డికి పోటీగానే అంటున్నారు. పీసీసీ పీఠం కోసం ప్రధానంగా రేవంత్, కోమటిరెడ్డి మధ్య పోటీ నెలకొంది. అందుకే రేవంత్ కు పేరు రాకుండా.. ఆయన పోరాటాన్ని తక్కువ చేసేలా కాంగ్రెస్ నేతలు ఇలా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. మొత్తంగా కాంగ్రెస్ కు కాంగ్రెస్ నేతలే శత్రువులు అన్న మాటను సార్థకం చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.