Begin typing your search above and press return to search.

85 ఏళ్ల తర్వాత వెలుగులోకి భగత్ సింగ్ వాడిన పిస్టల్.. ఇప్పుడెక్కడుందో తెలుసా..

By:  Tupaki Desk   |   15 Aug 2020 5:00 AM GMT
85 ఏళ్ల తర్వాత వెలుగులోకి భగత్ సింగ్  వాడిన పిస్టల్.. ఇప్పుడెక్కడుందో తెలుసా..
X
భగత్ సింగ్.. దేశ స్వాతంత్రం కోసం ఆంగ్లేయులతో పోరాడి నేలకొరిగిన వీరుడు. 1931లో ఆయన ఆంగ్లేయ అధికారి శాండర్స్ ని కాల్చి చంపాడు. దీంతో అతడిని ఆంగ్లేయులు ఉరి తీశారు. భగత్ సింగ్ అమెరికా లో తయారైన సెమీ ఆటోమేటిక్ పిస్టల్ తో ఆంగ్లేయ అధికారి శాండర్స్ ని కాల్చి చంపారు. ఆ తర్వాత ఆ పిస్టల్ ఏమై పోయిందో ఎవరికీ తెలియకుండా పోయింది. ఓ జర్నలిస్ట్ చేసిన అన్వేషణ ఫలించి అదెక్కడ ఉందో గుర్తించారు. ఆ పిస్టల్ ను చూసేందుకు ప్రస్తుతం జనం రోజూ భారీగా తరలి వస్తున్నారు. భగత్ సింగ్ జీవిత కథ రాస్తున్న జర్నలిస్టు జుపేందర్ సింగ్ కు అప్పట్లో భగత్ సింగ్ ఉపయోగించిన పిస్టల్ ఏమైందనే ఆలోచన వచ్చింది. అది ఎక్కడుందో తెలుసుకోవడం కోసం ఆయన 2016లో అన్వేషణ మొదలు పెట్టాడు.

ఆ ప్రయత్నంలో అదే ఏడాది భగత్ సింగ్ వాడిన పిస్టల్ నెంబర్ 168896గా తెలుసుకున్నాడు. 1931లో ఆ పిస్టల్ ను పంజాబ్లోని పెలోర్ పోలీస్ ట్రైనింగ్ అకాడమీకి పంపాలని లాహోర్ హైకోర్టు ఆదేశించినట్లు తెలిసింది. అయితే ఆ పిస్టల్ పెలోర్ కు చేరుకోవడానికి 13 ఏళ్ల సమయం పట్టింది. 1944లో భగత్ సింగ్ వాడిన పిస్టల్ ని పెలోర్ కు తీసుకొచ్చారు. అది ఇప్పుడు ఎక్కడుందనే విషయమై జుపేందర్ సింగ్ అధికారుల సహాయంతో వెతుకులాట ప్రారంభించారు. లాహోర్ నుంచి వచ్చిన ఎనిమిది ఆయుధాలను మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ లో ఉన్న బీఎస్ఎఫ్ సెంట్రల్ స్కూల్ ఫర్ అండ్ టాప్ టిక్స్ కు పంపినట్లు తెలుసుకున్నారు. ఇండోర్లో బీఎస్ఎఫ్ పెట్టినప్పుడు రాష్ట్రపతి అన్ని రాష్ట్రాలకు లేఖ రాశారు..తమ వద్ద ఉన్న ఆయుధాలను అకాడమీలో శిక్షణ కోసం పంపాలని కోరారు. అలా పంజాబ్ నుంచి ఇండోర్ కి వచ్చిన 8 ఆయుధాల్లో భగత్ సింగ్ ఉపయోగించిన పిస్టల్ కూడా ఉంది.

బీఎస్ ఎఫ్ ఐజీ ని కలిసిన జుపేందర్ సింగ్ 1944లో పంజాబ్ నుంచి వచ్చిన ఆయుధాల లిస్టు తీసుకున్నారు. ఆయుధాలను బయటికి తీసుకొచ్చి వాటికున్న పెయింట్ గీకి చూడగా, అందులో ఓ పిస్టల్ పై ఉన్న నెంబర్ భగత్ సింగ్ వాడిన వాడిన పిస్టల్ నెంబర్ తో మ్యాచ్ అయ్యింది. అలా జుపేందర్ సింగ్ అన్వేషణ ఫలించి భగత్ సింగ్ వాడిన పిస్టల్ వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఆ పిస్టల్ ని పంజాబ్లోని హుస్సేనివాలా మ్యూజియంలో భద్రపరిచారు. దాన్ని చూసేందుకు రోజు పెద్ద సంఖ్యలో జనం తరలి వస్తున్నారు. ఆంగ్లేయ అధికారి సాండర్స్ ని హత్య చేసేందుకు భగత్ సింగ్ కు పిస్టల్ ఎవరు తెచ్చిచ్చారు అనే విషయమై మాత్రం ఇప్పటికి కూడా ఆధారాలు లభించలేదు.