Begin typing your search above and press return to search.

శవం నుంచి శబ్దాలు విన్న ఫోటోగ్రాఫర్.. ఏం చేశాడంటే?

By:  Tupaki Desk   |   15 July 2020 9:00 AM GMT
శవం నుంచి శబ్దాలు విన్న ఫోటోగ్రాఫర్.. ఏం చేశాడంటే?
X
అనుమానాస్పద రీతిలో మరణించాడో వ్యక్తి. అతని కుటుంబ సభ్యుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు వెళ్లారు. విచారణలో భాగంగా శవానికి ఫోటోలు తీయాల్సి వచ్చింది. అందుకో ఫోటోగ్రాఫర్ కు కబురు చేశారు. అతడొచ్చి.. శవానికి దగ్గర గా ఫోటోలు తీస్తున్న వేళ.. అతనికి ఎప్పుడూ ఎదురుకాని చిత్రమైన పరిస్థితి ఎదురైంది. ఈ విచిత్రమైన ఉదంతం కేరళ రాష్ట్రంలో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే..

ఏర్నాకుళానికి చెందిన సదాశివం అనుమానాస్పద రీతిలో మరణించాడు. అతడు మరణించిన విషయాన్ని కుటుంబ సభ్యులు చెబుతూ.. త్వరగా రావాలని పోలీసుల్ని కోరారు. వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. అప్పటికే మరణించినట్లుగా కుటుంబ సభ్యులు చెప్పటం తో.. విచారణ షురూ చేశారు. ఆధారాల సేకరణలో భాగంగా శవాన్నిఫోటోలు తీసేందుకు ఫోటోగ్రాఫర్ కు సమాచారం ఇవ్వటం.. అతనొచ్చి ఫోటోలు తీసుకోవటం మొదలు పెట్టాడు.

ఫోటోలు తీసే క్రమంలో శవం నుంచి శబ్ధం వినిపించటంతో ఫోటోగ్రాఫర్ షాక్ తిన్నాడు. తొలుత తాను భ్రమపడినట్లుగా భావించాడు. శవానికి మరింత దగ్గరగా వెళ్లాడు. శవం నుంచి మూలుగులు వస్తున్నట్లు గుర్తించాడు. మొదట తీవ్రంగా భయపడినా.. తర్వాత సదరు వ్యక్తి చనిపోలేదన్న విషయాన్ని గుర్తించాడు. వెంటనే.. అక్కడున్న పోలీసు అధికారి వద్ద కు వెళ్లి.. తనకు ఎదురైన పరిస్థితిని వివరించాడు.

దీంతో.. గాయపడిన ఆ వ్యక్తిని పోలీసులు పరీక్షించగా ప్రాణం పోలేదని.. స్పృహ తప్పి పడి ఉన్నట్లు గుర్తించాడు. అయితే.. అతను మరణించినట్లుగా కుటుంబ సభ్యులు భావించటంతో ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. దీంతో.. హుటాహుటిన అంబులెన్సును తెప్పించి ఆసుపత్రికి తరలించారు. తలకు గాయం తగిలిన వైనంపై పోలీసులు విచారణ చేస్తున్నారు.ఆసుపత్రిలో సదాశివం కోలుకుంటున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ప్రమాదవశాత్తు సదాశివానికి గాయం తగిలిందా? లేదంటే హత్యాయత్నం జరిగిందా? అన్నది విచారణలో తేలాల్సి ఉంది. సదాశివం స్పృహలోకి వస్తే మరింత స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.