Begin typing your search above and press return to search.

మోడీ ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తున్న ఫోటో

By:  Tupaki Desk   |   7 May 2018 8:10 AM GMT
మోడీ ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తున్న ఫోటో
X
అబ‌ద్ధం చెప్పినా అతికేట‌ట్లు ఉండాలన్న క‌నీస విష‌యం కూడా బీజేపీ నేత‌ల‌కు ఒక ప‌ట్టాన అర్థం కావ‌టం లేదు. త‌మ నాయ‌కుడు క‌మ్ ప్ర‌ధానిని ఆకాశానికి ఎత్తేసేలా చేస్తున్న ప్ర‌య‌త్నాలు కొన్ని శృతి మించి రాగాన ప‌డ‌ట‌మే కాదు.. మోడీ ఇమేజ్ ను భారీగా దెబ్బ ప‌డేలా చేస్తున్నాయి. తాజాగా సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోతో త‌మ రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌పై విరుచుకుప‌డ‌టం షురూ చేశారు మోడీ బ్యాచ్‌.

అయితే.. ఈ ప్ర‌చారాన్ని ధీటుగా తిప్పి కొట్టే అవ‌కాశాన్ని కాంగ్రెస్ నేత‌ల‌కు ఇస్తున్న‌ది మ‌రెవ‌రో కాదు.. బీజేపీ నేత‌లే. తాజాగా త‌మ నాయ‌కుడు మోడీ ఎంత సింఫుల్ గా ఉంటారంటూ గొప్ప‌లు చెప్పుకుంటూ ఇప్ప‌టికి మోడీ త‌ల్లి ఆటోల్లోనే తిరుగుతారంటూ విష ప్ర‌చారాన్ని షురూ చేశారు.

గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ చిన్న‌త‌నంలో మోడీ టీ అమ్మారంటూ చేసిన ప్ర‌చారానికి.. ఒక టీ అమ్మే కుర్రాడు భార‌త ప్ర‌ధాని ఎందుకు కాకూడ‌ద‌న్న ప్ర‌శ్న‌.. అదేస‌మ‌యంలో కాంగ్రెస్ నేత‌లు మ‌ణిశంక‌ర్ అయ్య‌ర్ లాంటోళ్లు వ్యంగ్యంగా చేసిన వ్యాఖ్య‌లు మోడీకి లాభంగా మార‌గా.. కాంగ్రెస్‌కు శాపం అయ్యాయి.

ఇదిలా ఉంటే.. ఆత్మ‌విశ్వాసం శ్రుతి మించుతున్న బీజేపీ నేత‌లు తాము పంపే ఫోటోలు ఏమిట‌న్న క‌నీస విష‌యాల్ని కూడా చెక్ చేసుకోవ‌టం లేదా? అన్న సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. తాజాగా మోడీ త‌ల్లి బ‌య‌ట‌కు వెళ్లే స‌మ‌యంలో ఆటోలో ప్ర‌యాణిస్తున్నారంటూ బీజేపీ నేత ఒక‌రు ఫోటోను పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌లో మోడీ త‌ల్లి ఆటోలో ఎక్కుతున్న వైనం ఉంది. ఎంత సింఫుల్.. మ‌రెంత సింఫుల్ అంటూ మోడీ ఫ్యామిలీని కీర్తించేస్తున్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. మోడీ త‌ల్లి ఇంత సాదాసీదాగా వ్య‌వ‌హ‌రిస్తుంటే.. రాహుల్ త‌ల్లి మాత్రం ప్ర‌పంచంలో అత్యంత సంప‌న్నుల్లో ఒక‌రంటూ ఎట‌కారం చేయటం మొద‌లు పెట్టారు. బీజేపీ నేత‌ల అత్యుత్సాహం ఏమో కానీ.. ఆ పార్టీ నేత‌లు పోస్ట్ చేసిన మోడీ త‌ల్లి ఆటో ఫోటోలో.. ఆమె భుజాన్ని మ‌రో చేయి ప‌ట్టుకున్న‌ట్లుగా ఉండ‌టంతో అది మార్ఫింగ్ ఫోటోగా తేలిపోయింది.

దీంతో.. సింఫుల్ అంటూ పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తుతున్న బీజేపీ నేత‌ల గొంతుల‌కు ప‌చ్చి వెల‌క్కాయ ప‌డిన‌ట్లైంది. మార్ఫింగ్ ఫోటోలు పెట్టి దొంగ ప్రచారం చేసుకుంటారా? అంటూ తీవ్ర‌స్థాయిలో మండిప‌డుతున్నారు. కాంగ్రెస్ నేతల్ని టార్గెట్ చేసే క్ర‌మంలో అత్యుత్సాహంతో స‌రిగా చూసుకోకుండా పోస్ట్ చేసిన ఫోటో.. మోడీతో పాటు.. బీజేపీ నేత‌ల తీరును నెటిజ‌న్లు తీవ్ర‌స్థాయిలో మండిప‌డుతుండ‌టం గ‌మ‌నార్హం.