Begin typing your search above and press return to search.

సెల్ ఫోన్ పోయిందా? తెలంగాణ ప్రజలు ఇది తెలుసుకోవాలి

By:  Tupaki Desk   |   15 Dec 2022 3:50 AM GMT
సెల్ ఫోన్ పోయిందా? తెలంగాణ ప్రజలు ఇది తెలుసుకోవాలి
X
సెల్ ఫోన్.. ఇప్పుడు జీవితంలో ఒక భాగంగా మారటమే కాదు.. శరీరంలో అవయువం కాని అవయువంగా మారిందన్నది తెలిసిందే. ఇవాల్టి రోజున సెల్ ఫోన్.. అందులో డేటా.. దాన్లో వాట్సాప్.. గూగుల్ పే.. పేటీఎం.. ఫోన్ పే లాంటి యాప్ లు లేని జీవితాన్ని ఊహించగలమా? నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు అనుక్షణం సెల్ చుట్టూ తిరిగే ఈ రోజుల్లో ఆ ఫోన్ కానీ పోతే కలిగే నష్టం.. కష్టం అంతా ఇంతా కాదు. ఇలాంటి బాధలో ఉన్నప్పుడు తక్షణమే గుర్తుకు వచ్చేది పోలీస్ స్టేషన్.

అలాంటి పోలీస్ స్టేషన్ కు వెళ్లి.. సెల్ ఫోన్ పోయింది.. కాస్త వెతికి పెట్టండి అన్న రిక్వెస్టు చేసినంతనే.. వారో నిబంధనల చిట్టా ఓపెన్ చేసి.. వివరాలు చెప్పటం మొదలు పెడితే ఎలా ఉంటుంది? కాలిపోదు. అవును.. అలా కాలిపోయేలా తెలంగాణ ప్రభుత్వం సరికొత్త విధానాల్ని అమల్లోకి తీసుకొచ్చింది.

గతంలో మాదిరి సెల్ పోతే పోలీస్ స్టేషన్ కు వెళ్లి.. ఫిర్యాదు రాసి.. వారి నుంచి రశీదు తీసుకుంటే సరిపోయేది. కానీ..ఇకపై అలాంటి పప్పులు ఉడకవ్. కారణం.. సెల్ ఫోన్లు పోగొట్టుకునే వారి సంఖ్య భారీగా పెరిగిపోయి.. నిత్యం ఆయా పోలీస్ స్టేషన్లకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో.. దానికో తిర'కాసు' ప్రొసీజర్ ను తెర మీదకు తీసుకొచ్చింది. దాని ప్రకారం చూస్తే.. సెల్ ఫోన్ బాధకు కొత్త విధానానికి సంబంధించిన పెయిన్ మరింత ఎక్కువ చేస్తుందన్న మాట వినిపిస్తోంది.

ఈ కొత్త విధానంలో పోయిన ఫోన్ దొరుకుతుందన్న గ్యారెంటీ లేదు. కానీ.. ఫోన్ పోగొట్టుకున్న బాధితులు మాత్రం..తొలుత మీ సేవా కేంద్రానికి వెళలాలి. అక్కడ రూ.200 చొప్పున చలానా కట్టాలి. ఆ కట్టిన మొత్తంలో రూ.145 ప్రభుత్వ ఖాతాకు వెళితే.. మిగిలిన మొత్తం మీ సేవా కేంద్రానికి వెళుతుంది. ఈ చలానా లెక్క ఎందుకు తీసుకొచ్చారంటే.. సెల్ ఫోన్ పోయిన కేసుల సంఖ్య అంతకంతకూ ఎక్కువ అవుతుందని.. అందుకే వాటికి సంబంధించిన పని చేయటానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి.. ఈ సర్ ఛార్జ్ ను తీసుకొస్తున్నట్లు చెబుతున్నారు.

తెలంగాణలో ఇలాంటి పరిస్థితి ఉంటే.. ఏపీలో మాత్రం ఆన్ లైన్ ద్వారా పోయిన ఫోన్ కు సంబంధించిన కంప్లైంట్ ఇచ్చే సౌకర్యం ఉంది. నిజానికి ఒక్క ఏపీలోనే కాదు.. చాలా రాష్ట్రాల్లో ఇదే విధానాన్ని అమలు చేస్తున్నారు. అందుకు భిన్నంగా కేసీఆర్ సర్కారు మాత్రం మీ సేవలో చలానా కట్టిన తర్వాత పోయిన సెల్ ఫోన్ గురించి కంప్లైంట్ చేయొచ్చన్న కొత్త రూల్ ఇబ్బందికరంగానే కాదు.. బాధితులకు ఉన్న బాధను మరింత పెంచేలా చేస్తుందంటున్నారు. మరి.. ఈ విషయంలో కేసీఆర్ సర్కారు పునరాలోచన చేస్తే బాగుంటుందన్న మాట వినిపిస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.