Begin typing your search above and press return to search.

సీబీఐ వాదనలో పస ఉందా ?

By:  Tupaki Desk   |   7 Dec 2021 7:35 AM GMT
సీబీఐ వాదనలో పస ఉందా ?
X
అక్రమాస్తుల కేసుల్లో జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత మినహాయింపు విషయంలో తెలంగాణ హైకోర్టులో విచారణ పూర్తయ్యింది. కేసుల విచారణ సందర్భంగా తనకు వ్యక్తిగత మినహాయింపు కావాలని జగన్ అడిగారు. ఎట్టి పరిస్థితుల్లోను జగన్ కు వ్యక్తిగత మినహాయింపు ఇవ్వకూడదని సీబీఐ వాదిస్తోంది.

సీబీఐ తన వాదనను ఇప్పుడే కాదు చాలా కాలంగా ఇదే వాదన వినిపిస్తోంది. సీబీఐ అభ్యంతరం ఏమిటంటే జగన్ కు మినహాయింపు ఇస్తే సాక్ష్యులను ప్రభావితం చేస్తారట.

ఇక్కడే సీబీఐ వాదనల్లోని డొల్లతనం కనిపిస్తోంది. మరీ ఇంత పసలేని వాదనలను సీబీఐ ఎలా వినిపిస్తోందో అర్ధం కావటంలేదు. సాక్ష్యులను ప్రభావితం చేయటానికి జగన్ వ్యక్తిగతంగా హాజరవ్వటానికి, మినహాయింపుకు ఎలాంటి సంబంధం లేదు.

నిజంగానే సాక్ష్యులను ప్రభావితం చేయాలని జగన్ అనుకుంటే కోర్టుకు వ్యక్తిగతంగా హాజరవ్వటం అన్నది అడ్డేకాదు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి ఏదో రూపంలో సాక్ష్యులను ప్రభావితం చేయటానికి కావాల్సినన్ని మార్గాలుంటాయి.

సాక్షులను ప్రభావితం చేయాలంటే నేరుగా సాక్షులతో జగనే మాట్లాడుతారా ? జగన్ తరపున ఎవరైనా సాక్షులతరపు ఇంకెవరితోనైనా మాట్లాడచ్చు కదా ? నిజంగానే ప్రలోభాలకు గురిచేయాలన్నా, ఒత్తిళ్ళు పెట్టాలన్నా జగన్ కు ఎన్నో మార్గాలున్నాయి.

ఈ విషయాలను సీబీఐ ఎందుకు ఆలోచించటంలేదో. జగన్ హోదా పెరిగింది కాబట్టి సాక్షులను ప్రభావితం చేయటం చాలా ఈజీ అని సీబీఐ కోర్టుకు చెప్పటమే విచిత్రంగా ఉంది. నిజంగానే సాక్షులను ప్రభావితం చేయదలచుకుంటే సీఎంగానే కాదు ప్రతిపక్ష నేత హోదాలో కూడా చేసుండచ్చు.

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ దాదాపు 12 ఏళ్ళుగా జరుగుతోంది. ఎప్పుడైనా సాక్షులను ప్రభావితం చేసినట్లు ఎవరైనా ఆరోపించారా ? పైగా జగన్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న అనేకమంది పారిశ్రామికవేత్తలు, ఉన్నతాధికారుల విషయంలో సీబీఐ సాక్ష్యాలను సరిగా చూపలేకపోతోందని కోర్టే ఎన్నోసార్లు కామెంట్ చేసింది.

జగన్ కంపెనీల్లో తమ పెట్టుబడులంతా తమిష్ట ప్రకారమే జరిగిందని పెట్టుబడిదారులు గట్టిగా వాదిస్తున్నారు. తమ పెట్టుబడులకు లాభాలొచ్చినట్లు కూడా చెబుతున్నారు. దాంతో పారిశ్రామికవేత్తల వాదనలను తిప్పికొట్టడంలో సీబీఐ నానా అవస్తలు పడుతోంది.

సాక్షులను ప్రభావితం చేస్తారని వాదనలు కాకుండా నిజంగానే జగన్ ఎక్కడైనా అక్రమాలకు, అవినీతికి పాల్పడినట్లు సాక్ష్యాలుంటే చూపాలి. జగన్+పారిశ్రామికవేత్తల వాదనల్లోని డొల్లతనాన్ని సీబీఐ ఎత్తిచూపి తప్పుచేసిన వాళ్ళందరికీ జైలుశిక్ష పడేట్లు సీబీఐ చూడాలి.