Begin typing your search above and press return to search.

ఆమంచికి ఉన్న ఆప్ష‌న్.. ఆ పార్టీనేనా..?

By:  Tupaki Desk   |   23 Dec 2022 4:22 AM GMT
ఆమంచికి ఉన్న ఆప్ష‌న్.. ఆ పార్టీనేనా..?
X
రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుంద‌నేది ఎవ‌రూ చెప్ప‌లేరు. నిన్న ఓడ‌లు అనుకున్న నాయ‌కులు రేపు బ‌ళ్లు కావొచ్చు. ఇప్పుడు ఆమంచి కృష్ణ‌మోహ‌న్ ప‌రిస్థితి కూడా ఇలానే ఉంది. చీరాల మాజీ ఎమ్మెల్యే గానే కాదు.. ఫైర్ బ్రాండ్ నాయ‌కుడిగా.. తిరుగులేని నేత‌గా.. ఆయ‌న గుర్తింపు పొందారు. 2014-19 మ‌ధ్య చీరాల అంటే ఆమంచి.. ఆమంచి అంటే చీరాల అన్న‌ట్టుగా రాజ‌కీయాలు సాగాయి.

అయితే, రోజులు అన్నీ ఒక ర‌కంగానే ఉండ‌వ‌న్న‌ట్టు ప‌రిస్థితి కూడా మారిపోయింది. ప్ర‌స్తుతం ఆమంచి వైసీపీలో ఉన్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయినా.. తన దూకుడు తాను కొన‌సాగిస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో జ‌రిగిన చీరాల మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లోనూ త‌న వ‌ర్గం వారికి టికెట్లు రాక‌పోయినా.. 11 మందిని గెలిపించుకున్నారు. అదేవిధంగా పార్టీ త‌ర‌ఫున కూడా ప‌నిచేస్తున్నారు.

కానీ, వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ విష‌యం ఇప్పుడు పెద్ద స‌మ‌స్య‌గా మారిపోయింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆమంచి కృష్ణమోహన్ ను.. ప‌రుచూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయించాల‌ని సీఎం జ‌గ‌న్‌ భావిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌ను అక్క‌డ ఇంచార్జ్‌గా నియ‌మించారు. నిజానికి ఆయనను చాలా రోజుల నుంచి పర్చూరుకు పంపాలని అనుకున్నారు. కానీ ఆమంచి మాత్రం ఆలోచిస్తూ వస్తున్నారు.

ఇక‌, ఇప్పుడు వెళ్లాల్సిందేన‌ని తేల్చి చెప్పిన‌ట్టు ఆమంచి వ‌ర్గం చెబుతోంది. అయితే.. పర్చూరు నియోజకవర్గం సామాజికవర్గ పరంగా ఆమంచికి సెట్ కాదు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ జగన్ గాలిలోనూ గెలిచింది. ఏలూరు సాంబశివరావు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. దీంతో ఆమంచి అక్క‌డ పోటీ చేసినా.. ప్ర‌యోజ‌నం లేద‌ని.. జగన్ త‌మ నేత‌ రాజకీయ భవిష్యత్ ను సమాధి చేస్తున్నారని ఆమంచి వ‌ర్గం పేర్కొంటోంది.

ఈ క్ర‌మంలోనే.. ఆమంచి పార్టీ మార్పుపై ఇప్పుడు చీరాల రాజ‌కీయాల్లో హాట్ టాపిక్ నడుస్తోంది. మ‌రోసా రి.. పార్టీ అధిష్టానాన్ని క‌లిసి త‌న ప‌రిస్థితిని వివ‌రించాల‌ని.. లేక‌పోతే.. త‌న నిర్ణ‌యం త‌ను తీసుకోవాల‌ని.. ఆమంచి నిర్ణ‌యించుకున్న‌ట్టు స‌మాచారం. అంటే.. ఆయ‌న జ‌న‌సేన వైపు వెళ్లే అవ‌కాశం ఉంటుంద‌ని తెలుస్తోంది. టీడీపీ నుంచి బ‌య‌ట‌కు రావ‌డం.. వైసీపీ త‌న‌కు ఇబ్బంది క‌లిగించ‌డం.. మ‌రో పార్టీ ప్ర‌త్యామ్నాయం లేక‌పోవ‌డంతో ఇప్పుడు.. జ‌న‌సేన ఒక్క‌టే ఆప్ష‌న్ గా ఉంద‌ని.. అంటున్నారు. లేక‌పోతే.. మ‌ళ్లీ ఇండిపెండెంట్‌గా అయినా.. పోటీ చేస్తార‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందోచూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.