Begin typing your search above and press return to search.

జనసేనలో ఒకే ఒక్కడు... వైసీపీకి కంట్లో నలుసుగా

By:  Tupaki Desk   |   23 April 2023 6:00 PM GMT
జనసేనలో ఒకే ఒక్కడు... వైసీపీకి కంట్లో నలుసుగా
X
జనసేన పార్టీ బలమేంటి ఆ పార్టీ సంగతేంటి అని ఎవరైనా ఎద్దేవా చేయవచ్చు కానీ కొంతమంది పార్టీకి కట్టుబడిపోయారు. వారు లోతైన విమర్శలు చేస్తారు. ఆ దెబ్బకు తట్టుకోలేక అబ్బా అనే వారే ఎక్కువ. విశాఖ సాగరతీరం నుంచి జనసేన తరఫున గెలిచిన మూర్తి యాదవ్ అనే కార్పోరేటర్ జీవీఎంసీలో అధికార పార్టీ వైసీపీకి చుక్కలు చూపిస్తునే ఉన్నారు.

మేయర్ హరి వెంకట కుమారి డమ్మీ అని ఆమె భర్త షాడో మేయర్ గా అధికారాన్ని చలాయిస్తున్నారు అంటూ ఈ మధ్యనే మూర్తి యాదవ్ చేసిన ఆరోపణలు మంట పుట్టించాయి. జీవీఎంసీలో అవినీతి మీద ఆయన చేస్తున్న విమర్శలు కూడా వేడి పుట్టించే స్థాయిలోనే ఉంటున్నాయి. ఈ మధ్యనే జరిగిన జీ 20 సదస్సులో జీవీఎంసీ నుచి వంద కోట్లకు పైగా ఖర్చు చేస్తే అందులో అవినీతి వాటా ఎంత అని ఆయన ప్రశ్నించి వైసీపీ నేతలను ఇరకాటంలో పడేశారు.

లేటెస్ట్ గా ఒక ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలో వైసీపీకి చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పెట్టుబడులు పెట్టారని ఆయన ఆరోపించి మంటలే రేపారు. దీని మీద బాలినేని ఖండించారు. ఇక విశాఖలో ఆ మాజీ మంత్రి వియ్యంకుడు భూ దందాలు చేస్తున్నరని ఎ మధ్యనే మరో ఆరోపణ చేశారు ఈ జనసేన కార్పోరేటర్.

ఆయన దాదాపుగా ప్రతీ రోజూ మీడియా ముందుకు వస్తారు. వైసీపీ మీదనే గురి పెట్టి మరీ విమర్శలు చేస్తారు. రుషికొండను గుండు కొట్టేశారు అని మొదట ఆరోపించింది కూడా మూర్తీ యాదవ్ నే. దాంతో తెలుగుదేశం ఇతర ప్రతిపక్షాలు తోడు కావడంతో అది ఎంత పెద్ద ఇష్యూ అయిందో అందరికీ తెలిసిందే.

మూర్తీ యాదవ్ రాజకీయ నేపధ్యం చూస్తే ఆయన మొదట వైసీపీలోనే ఉండేవారు. లోకల్ లీడర్స్ తో ఆయనకు విభేదాలు రావడంతో 2019 ఎన్నికల ముందే ఆయన పార్టీ మారారు. జనసేనలో చేరారు. విశాఖ తూర్పు నియోజకవర్గానికి చెందిన మూర్తి యాదవ్ వైసీపీ అధికార బలాన్ని తట్టుకుని మరీ 2021లో కార్పోరేటర్ గా జనసేన తరఫున గెలిచారు.

ఆయన వైసీపీ అధినాయకత్వం నుంచి లోకల్ లీడర్స్ దాకా ఎవరికీ వదిలి పెట్టకుండా విమర్శలు చేస్తూనే ఉన్నారు. జిల్లాకు చెందిన మంత్రి గుడివాడ అమరనాధ్ ని సైతం వదలడంలేదు. ఆయన చేసిన ఆరోపణలతో వైసీపీ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. పవన్ ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని నిరాధార ఆరోపణలు చేస్తున్నారు అని వైసీపీ నేతలు అంటున్నారు.

అయితే ఆయన విశాఖలో జనసేన జెండాను ముందుకు తీసుకుపోతున్నారు కాబట్టి పవన్ సైతం ఆయన్ని ప్రోత్సహిస్తున్నారు అని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో పొత్తులు కనుక లేకపోతే విశాఖ తూర్పు నుంచి జనసేన తరఫున ఎమ్మెల్యేగా పోటీకి ఆయన రెడీగా ఉన్నారని అంటున్నారు. పొత్తులు ఉంటే కనుక ఈ సీట్లో హ్యాట్రిక్ ఎమ్మెల్యే వెలగపూడి రామ క్రిష్ణబాబు మళ్లీ పోటీ చేయడం ఖాయం. మొత్తానికి మూర్తీ యాదవ్ మాత్రం అలుపెరగని పోరాటమే చేస్తున్నారు. జనసేనలో చాలా మంది లీడర్లు ఉన్నా ఈయన మాత్రం దూసుకుపోతున్నారు. పవన్ కళ్యాణ్ 2024లో మూర్తి యాదవ్ సేవలను ఎలా ఉపయోగించుకుంటారో చూడాలని అంటున్నారు.