Begin typing your search above and press return to search.

మోడీ విశాఖ రావాలంటే ఒకటే కండిషన్...?

By:  Tupaki Desk   |   13 Feb 2022 8:34 AM GMT
మోడీ విశాఖ రావాలంటే ఒకటే కండిషన్...?
X
నరేంద్ర మోడీ, దేశానికి ప్రధాని, ఆయన అసేతు హిమాచలం ఎక్కడ నుంచి ఎక్కడికి అయినా వెళ్ళవచ్చు. బలమైన ప్రధాని, ఆయనకు కండిషన్ లా అంటే విశాఖ ఉక్కు ఉద్యమ కారులు మంచి వేడి మీద ఉన్నారు. కాబట్టి వారు తమ ఆవేదనను ఇలా కోపంగా వెళ్లగక్కుతున్నారు. మోడీ రావాలీ అంటే ఉక్కు కార్మికుడి వేషంలో మాత్రమే రావాలని ప్రముఖ సినీ నటుడు, ఉక్కు ఉద్యమానికి మద్దతుగా విశాఖ వచ్చిన ఆర్ నారాయణమూర్తి అన్నారు.

మోడీ ఏ ముఖం పెట్టుకుని విశాఖ వస్తున్నారు అని గట్టిగానే గర్జించారు. విశాఖ ఉక్కుని తెగనమ్ముతూంటే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. ఏడాది పాటు కార్మికులు ఉద్యమాలు చేయాలా, అయినా సరే కేంద్రం అసలు పట్టించుకోదా ఇదేనామీ విధానమంటూ బీజేపీ సర్కార్ మీద నిప్పులే చెరిగారు. మోడీ దేశంలో ఏ రాష్ట్రానికి వెళ్ళినా అక్కడ వేష భాషలకు తగినట్లుగా ఉంటారని, విశాఖ వస్తే మాత్రం కచ్చితంగా ఉక్కు కార్మికుడి వేషంలోనే రావాలని నారాయణమూర్తి షరతు విధించారు.

మోడీ అలా వస్తేనే ఉక్కు కార్మికుల బాధ ఏంటో ఆయనకు తెలుస్తుందని, అలాగే ఉక్కు కోసం వేలాది ఎకరాల‌ భూములు ఇచ్చిన నిర్వాసితుల గోడు కూడా ఆయనకు అర్ధమవుతుందని చురకలు అంటించారు. ఏ సమస్య మీద అయినా ఏళ్ల తరబడి పోరాటాలు చేయడమేంటి అని కూడా నారాయణమూర్తి మండిపడ్డారు.

కేంద్రంలోని మోడీ సర్కార్ యావత్తు ఏపీకే తీరని అన్యాయం చేస్తోందని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా అంశాన్ని ముందు పెట్టి తరువాత కేంద్ర హోం శాఖ తొలగించడమేంటని ఆయన నిలదీశారు. ఇక ఉత్తరాంధ్రా మీద పూర్తిగా కేంద్రం శీత కన్ను వేసిందని, బ్రహ్మాండమైన గంగవరం పోర్టుని తెగనమ్మేశారని, ఇపుడు ఉక్కు కర్మాగారం మీద పడ్డారని నారాయణమూర్తి అన్నారు.

కేంద్రం ఇప్పటికైనా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని చెప్పాలని, దీని మీద సానుకూలంగా స్పందించాలని ఆయన కోరారు. అదే విధంగా అన్ని రాజకీయ పార్టీలు, జెండాలు అజెండాలు పక్కన పెట్టి ఏపీ కోసం విశాఖ ఉక్కు కోసం, ఉత్తరాంధ్రా కోసం ఉద్యమించాలని ఆయన పిలుపు ఇచ్చారు. మొత్తానికి సినీ పరిశ్రమ నుంచి ఆర్ నారాయణమూర్తి నేను ఉన్నాను అంటూ విశాఖ ఉక్కు సమస్య మీద తరచూ స్పందిస్తున్నారు.

ఆయన అనేక సార్లు ఈ ఏడాదిలో విశాఖ వచ్చారు. ఉక్కు ఉద్యమకారులతో పాటు ఆయన కూడా పోరాటంలో పాలు పంచుకున్నారు. కేంద్రాన్ని హెచ్చరించారు, అలాగే ఏపీలోని రాజకీయ పార్టీలకు సలహాలు సూచనలు ఇచ్చారు. కేవలం సినిమాల్లో మాత్రమే హీరోయిజం చూపించి బయట ఏమీ కాకుండా తానుండని రెడ్ స్టార్ చెప్పడం కాదు, ఆచరణలో చూపిస్తున్నారు. కేంద్రం కూడా విశాఖ ఉక్కు కర్మాగారం విషయంలో పునరాలోచన చేయాలని అంతా కోరుతున్నారు.