Begin typing your search above and press return to search.

కేటీఆర్ అన్న ఒక్క మాట కేసీఆర్ ప‌రువు తీసేలా మారింది

By:  Tupaki Desk   |   23 April 2022 11:30 PM
కేటీఆర్ అన్న ఒక్క మాట కేసీఆర్ ప‌రువు తీసేలా మారింది
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడు, టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కూడా అయిన మంత్రి కేటీఆర్‌...త‌మ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపేందుకు చేసిన కామెంట్లు ఇప్పుడు ఆ పార్టీకే మైన‌స్‌గా మారుతున్నాయంటున్నారు. కేటీఆర్ చేసిన కామెంట్ల‌తో విపక్షాలు ఇరుకున ప‌డ‌టం సంగ‌తి దేవుడెరుగు... పార్టీ ర‌థ‌సార‌థి కేసీఆర్ నే టార్గెట్ చేసే విధంగా సాగుతున్నాయ‌ని చెప్తున్నారు.

బీజేపీ, కాంగ్రెస్‍ జాతీయ, రాష్ట్ర నేతలపైనా మంత్రి కేటీఆర్‍ ఇటీవ‌ల‌ తిట్ల పురాణం అందుకున్నారు. బేకార్, బఫూన్‍ నాయకులంటూ ఫైర్‍ అయ్యారు. "కేసీఆర్‍ లేకుంటే ఈ రోజు మొరుగుతున్న కుక్కలు, గాడిదలకు గుర్తింపు ఎక్కడిది? టీపీసీసీ, టీబీజేపీ ఎక్కడివి? ఎవడీ రేవంత్‍రెడ్డి.. ఎవడీ సంజయ్‍.? ఒక్కొక్కడు గింతుంటడు" అంటూ కేటీఆర్ మండిపడ్డారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ వాడుతున్న భాషపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫైర్ అయ్యారు.

ముఖ్యమంత్రి కొడుకునన్న అహంకారం కేటీఆర్లో పెరిగిపోయిందని, అందుకే ప్రతిపక్షాలను బూతులు తిడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమంలో తనలాంటి ఎంతోమంది పార్టీలకతీతంగా మద్దతు పలికితేనే ఇప్పుడు కేసీఆర్ కుటుంబం బాగుపడిందని అన్నారు.

కేసీఆర్ కుటుంబం తెలంగాణ సెంటిమెంట్ అడ్డుపెట్టుకుని, ప్రజలను రెచ్చగొడుతూ రాజకీయ పబ్బం గడుపుతోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ చరిత్ర అందరికీ తెలుసన్న రాజగోపాల్.. రిటైర్మెంట్కు టైం దగ్గర పడటంతోనే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని చెప్పారు.

ఇటీవ‌ల వ‌రంగ‌ల్ ప‌ర్య‌ట‌న‌లో కేటీఆర్ మాట్లాడుతూ, ఇంద్రుడు చంద్రుడు అని భావించే చంద్రబాబు నాయుడును, నూరేండ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్‍ను ఎదుర్కొని.. కేసీఆర్‍ తెలంగాణ రాష్ట్రం తెచ్చాడని కేటీఆర్ అన్నారు. 14 ఏళ్ల పాటు ఎన్నో అవమానాలకు గురిచేసినా, బంపర్‍ ఆఫర్లు ఇచ్చినా లెక్కచేయకుండా ప్రాణాలు పణంగా పెట్టి తెలంగాణ సాధించిన ఘనత కేసీఆర్‍కు దక్కుతుందన్నారు.

67 ఏండ్లలో జరగని అభివృద్ధి కేసీఆర్‍ ఆరేళ్ల‌ పాలనలో జరిగిందన్నారు. ఇలా తెలంగాణ క్రెడిట్ త‌న ఖాతాలో వేసుకోవ‌డం మ‌రోవైపు విప‌క్షాల‌ను టార్గెట్ చేయ‌డంతో ఇప్పుడు విప‌క్ష నేత‌లు ఇటు కేటీఆర్ అటు కేసీఆర్ పై దుమ్మెత్తిపోస్తున్నాయి.