Begin typing your search above and press return to search.

ప్రపంచంలోనే అత్యంత వృద్ధ కవలలు..వారు ఎక్కడున్నారంటే

By:  Tupaki Desk   |   21 Sep 2021 2:30 PM GMT
ప్రపంచంలోనే అత్యంత వృద్ధ కవలలు..వారు ఎక్కడున్నారంటే
X
ప్రపంచంలోనే అత్యంత వృద్ధ కవలలుగా ఇద్దరు అక్కాచెల్లెళ్లకు అరుదైన గౌరవం దక్కింది. వీరి వయసు 107 సంవత్సరాల 330 రోజులు. ఇటీవలే ఈ అక్కాచెల్లెళ్లకు గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ నుంచి ధ్రువీకరణ పత్రాలు కూడా అందాయి. వీరిద్దరినీ అత్యంత వృద్ధ కవలలు (మహిళల) విభాగంలో ఈ అవార్డు వరించింది. ఉమెనో సుమియామా, కోమే కొడామా అనే ఈ అక్కాచెల్లెళ్లిద్దరూ 1913 నవంబరులో జన్మించారు.

ఈ కుటుంబంలో మొత్తం 11 మంది పిల్లలు జన్మించగా వీరిలో ఈ అక్కాచెల్లెళ్లు మూడో కాన్పులో పుట్టారు. ఇంతకు ముందు కూడా ఈ రికార్డు జపాన్ కవలల పేరిటే ఉంది. అయితే వారి వయసు 107 సంవత్సరాల 175 రోజులే కావడంతో ఇప్పుడు ఆ రికార్డు ఉమెనో సుమియామా, కోమే కొడామాలకు దక్కింది. వీరు ప్రపంచంలోనే జీవించి ఉన్న కవలల్లో అత్యంత వృద్ధులని పేర్కొంది. ఇప్పటి వరకు జపాన్‌ కే చెందిన కిన్‌ నరిటా, జిన్‌ కానీ అనే కవలల పేరిట ఉన్న 107 ఏళ్ల 75 రోజుల రికార్డును ఈ సోదరీమణులు బద్దలు కొట్టారు.

జపాన్‌ లోని షొడొషిమా దీవిలో 1913 నవంబర్‌ 5వ తేదీన జన్మించిన వీరు చిన్నతనంలోనే వేరు పడిపోయారు. దాదాపు 70 ఏళ్లు వచ్చే వరకు వేర్వేరు చోట్ల గడిపారు. అనంతరం ఇద్దరూ కలిసి తీర్థయాత్రలు చేసి, 88 షికోకు ఆలయాలను సందర్శించుకున్నారు. ఎక్కువ రోజులు జీవించి, గత రికార్డులను బద్దలు కొట్టడంపై వీరిద్దరూ తరచు జోకులు వేస్తుంటారని కుటుంబసభ్యులు చెప్పారు. హాస్యచతురత, పెద్దరికం వీరిని 1990ల నుంచి పెద్ద సెలబ్రిటీలుగా మార్చేసింది. అందరూ వీరిని కిన్‌–సన్, జిన్‌–సన్‌ అని ఆప్యాయంగా పిలుచుకుంటుంటారు. ప్రస్తుతం వీరిద్దరూ వేర్వేరు చోట్ల ఆరోగ్య కేంద్రాల్లో ఉంటున్నారు. వీరి ఘనతను ప్రశంసిస్తూ గిన్నిస్‌ సంస్థ కొత్త రికార్డు సర్టిఫికెట్లను సోమవారం ‘రెస్పెక్ట్‌ ఫర్‌ ది ఏజ్‌డ్‌ డే’సందర్భంగా మెయిల్‌ ద్వారా పంపించింది. ‘రెస్పెక్ట్‌ ఫర్‌ ది ఏజ్‌డ్‌ డే’జపాన్‌లో జాతీయ సెలవుదినం. జపాన్‌ 12.5 కోట్ల జనాభాలో 29% మంది 65 ఏళ్లు, ఆపైని వారే.