Begin typing your search above and press return to search.

వృద్ధురాలిని ఇంట్లోంచి వెళ్ల‌గొట్టాడు!

By:  Tupaki Desk   |   9 May 2021 2:30 PM GMT
వృద్ధురాలిని ఇంట్లోంచి వెళ్ల‌గొట్టాడు!
X
క‌రోనా మ‌హ‌మ్మారి తెచ్చిన ఇబ్బందులు అన్నీ ఇన్నీకావు. మనుషుల ప్రాణాలు పోతున్నాయి. బంధాలు పోతున్నాయి. మాన‌వ‌త్వం పోతోంది. అన్నీ పోతున్నాయి. ఒక్క భ‌యం మాత్ర‌మే మిగిలి ఉంది. కొవిడ్ వ‌చ్చిందంటే తోటి మ‌నిషినే చూసి భ‌య‌ప‌డుతున్న జ‌నం.. చివ‌ర‌కు ర‌క్త సంబంధీకుల క‌డ‌చూపున‌కు కూడా వెళ్ల‌ట్లేదు.

ఇలాంటి ప‌రిస్థితుల్లో అద్దె ఇంట్లో నివ‌సిస్తున్నవారి జీవ‌నం మ‌రింత దుర్భ‌రంగా త‌యారైంది. కొవిడ్ వ‌చ్చింద‌ని తెలిస్తే చాలు.. వెంట‌నే ఖాళీ చేయాల‌ని ఆర్డ‌ర్ వేస్తున్నారు. ఏ మాత్రం స‌మ‌యం ఇవ్వ‌ట్లేదు. ఎక్క‌డ త‌మ‌కు సోకుతుంద‌నే భ‌య‌మే వారిని ఇలా చేయిస్తోంది. ఈ కార‌ణంతో ఇప్ప‌టి వ‌ర‌కూ ఎన్నో కుటుంబాలు అర్ధంత‌రంగా రోడ్డున ప‌డ్డాయి.

తాజాగా.. కృష్ణా జిల్లా జ‌గ్గ‌య్య‌పేట‌లో బొజ్జ సామ్రాజ్యం అనే 65 ఏళ్ల వృద్ధురాలిని అద్దె ఇంట్లోంచి వెళ్ల‌గొట్టాడు ఓన‌ర్‌. ఉన్న ఒక్క కొడుకు సొంత ఇంటిని అమ్మేసి వెళ్లిపోవ‌డంతో.. త‌న‌కు వ‌స్తున్న‌ పెన్ష‌న్ డ‌బ్బుల‌తోనే ఆమె కాలం వెళ్ల‌దీస్తోంది. ఇటీవ‌ల ఆమెకు క‌రోనా సోకింది. ఈ విష‌యం తెలుసుకున్న ఇంటి ఓన‌ర్ వెంట‌నే ఖాళీ చేయాల‌ని చెప్పాడు.

తాను ఇప్పుడు ఎక్క‌డిక‌ని వెళ్ల‌గ‌ను? ద‌య‌చేసి ఉండ‌నివ్వండ‌ని చెప్పినా వినిపించుకోలేదు. ఆమె సామాన్లు మొత్తం ఇంట్లోంచి బ‌య‌ట వేయించాడు. ఆ వృద్ధురాలిని కూడా బ‌య‌ట‌కు పంపేశాడు. ఈ విష‌యం తెలుసుకున్న అధికారులు.. ఆ వృద్ధురాలిని ఐసోలేష‌న్ కు త‌ర‌లించారు.