Begin typing your search above and press return to search.

జేసీకి బీపీ మరింత పెరిగేలా చేసిన అధికారులు

By:  Tupaki Desk   |   6 Nov 2019 7:42 AM GMT
జేసీకి బీపీ మరింత పెరిగేలా చేసిన అధికారులు
X
తాను టార్గెట్ చేయటమే తప్పించి తనను ఎవరూ టార్గెట్ చేయకూడదన్న తీరు టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిలో కాస్త ఎక్కువే. తాను చేసే తప్పుల్ని సైతం ఒప్పులుగా సమర్దించుకునే సత్తా అతగాడి సొంతం. ఆయన నడిపే దివాకర్ ట్రావెల్స్ లో అక్రమాల్ని అధికారులు ఎత్తి చూపిస్తే.. వ్యాపారం అన్నాక చిన్న చిన్న తప్పులు దొర్లకుండా ఉంటాయా? అని ఓపెన్ గా చెప్పేస్తారు.

తప్పులు చేసినప్పుడు చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది కదా అంటూ చర్యలు తీసుకుంటే.. దాన్లో పొలిటికల్ యాంగిల్ ను చూపిస్తూ ఆగమాగం చేస్తుంటారు. ఈ మధ్యనే ఆయన ట్రావెల్స్ కు చెందిన 31 బస్సుల్ని రవాణా శాఖాధికారులు సీజ్ చేయటంపై ఆయన నిప్పులు చెరుగుతున్నారు. తనను టార్గెట్ చేసినట్లు మండిపడుతున్నారు.

ఇంటర్ స్టేట్ స్టేజ్ క్యారియర్ పర్మిట్లలో అక్రమాల కారణంగానే తాము చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నా.. జేసీ వెర్షన్ మాత్రం మరోలా ఉంది. చిన్న చిన్న లోటుపాట్లు ఆర్టీసీతో సహా ఏ ట్రావెల్స్ కైనా సహజంగా ఆయన చెబుతున్నారు. పరిమితికి మించి ప్రయాణికుల్ని ఎక్కించుకోవటం.. అడ్డగోలుగా టికెట్ల ధరల్ని వసూలు చేయటం లాంటి వాటిపైనా సమర్థింపు జేసీకి మాత్రమే సాధ్యమని చెప్పాలి.

ఇదిలా ఉంటే.. తాజాగా అధికారులు చేసిన తనిఖీల్లో జేసీకి చెందిన మరో ఐదు బస్సుల్ని సీజ్ చేశారు. నిబంధనల్ని పాటించని దివాకర్ ట్రావెల్స్ బస్సుల్ని సీజ్ చేసిన వైనంతో జేసీకి బీపీ మరింత పెరగటం ఖాయమంటున్నారు. అధికారుల తీరుపై జేసీ చిందులు వేస్తుంటే.. ఫిర్యాదులు వస్తున్నప్పుడు తాము మాత్రం ఏం చేయగలమని వారు ప్రశ్నిస్తున్నారు. అధికారులు తాజాగా సీజ్ చేసిన ఐదు బస్సులతో కలిపితే.. జేసీ వారికి చెందిన 36 బస్సులపై చర్యలు తీసుకున్నట్లవుతుంది.