అగ్రరాజ్యం అమెరికాలో జాత్యహంకార దాడులు ఇటీవలి కాలంలో బాగానే పెరిగిపోయాయి. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ దాడుల పరంపర మరింతగా ఎక్కువైనందనే చెప్పక తప్పదు. ఈ తరహా దాడుల్లో ప్రధానంగా ఎన్నారైలు బాగానే నష్టపోతున్నారు. తెలుగు నేలకు చెందిన శ్రీనివాస్ కూచిభొట్ల ఈ తరహా దాడిలోనే ప్రాణాలు కోల్పోయిన వైనాన్ని మనం మది నుంచి ఇంకా చెరిగిపోలేదనే చెప్పాలి. అమెరికా పౌరులకు మరిన్ని ఉద్యోగావకాశాలు అందించడమే లక్ష్యంగా ఇతర దేశాలకు చెందిన వలసలపై నిషేదం విదిస్తున్నట్లుగా ట్రంప్ ప్రకటించిన తీరుతో ఈ తరహా దాడులు మరింతగా పెరిగిపోయాయని చెప్పక తప్పదు. ఈ క్రమంలో భారతీయులకు... ప్రత్యేకించి విద్య, ఉపాధి వెతుక్కుంటూ అమెరికాకు వెళ్లానుకునే యువకులు ఆ దేశం వైపు కన్నెత్తి చూసేందుకు జడిసిపోతున్నారు. అదే సమయంలో అప్పటిదాకా తమ డెస్టినేషన్ అమెరికానే అని ఫిక్సయిపోయిన భారతీయ యువకులు ఇప్పుడు ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారన్న వాదన కూడా ఇప్పుడు వినిపిస్తోంది. అంతేకాకుండా ఇటీవలి కాలంలో అమెరికాకు వెళ్లిన భారతీయ యువకులు క్రమంగా తిరిగి వచ్చేస్తున్న దాఖలాలు కూడా కనిపిస్తున్నాయి. ఇందుకు నిదర్శనమే అమెరికా వెళుతున్న బారతీయుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది.
ఈ ఏడాది ప్రారంభం నుంచి అమెరికా వెళ్లిన భారతీయుల గణాంకాలను బయటకు తీస్తే ఈ చేదు నిజం వెలుగులోకి వచ్చింది. అయితే తమ దేశానికి వస్తున్న భారతీయుల సంఖ్య తగ్గడానికి గల కారణాలపై తమదైన శైలి వాదనలు వినిపిస్తున్నఅమెరికా మోదీ సర్కారు అములోకి తెచ్చిన నోట్ల రద్దు - జీఎస్టీలే కారణమంటూ ఓ కొత్త వాదనను వినిపిస్తుండటం గమనార్హం. ఇక ఈ విషయానికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. ఈ ఏడాది ప్రథమార్థం నుంచి అమెరికాకు వెళ్లిన భారతీయుల సంఖ్య 13 శాతం మేర తగ్గిపోయింది. ఈ లెక్కలు భారతీయ సంస్థలు వేసినవి కావు. అమెరికా జాతీయ రవాణా, పర్యాటక శాఖ కార్యాలయం అందించిన గణాంకాలు. ఈ తరుగుదల జనవరి నుంచి మొదలైనా... మార్చి తర్వాత మరింతగా తగ్గిపోవడం ప్రారంభమైంది. ఈ తరుగుదల జనవరి నుంచి మార్చి దాకా తక్కువగానే కనిపించినా... ఏప్రిల్ నుంచి జూన్ దాకా ఉన్న త్రైమాసికంలో ఏకంగా 18.3కు పడిపోయింది. మొత్తంగా ఈ ఆరు నెలల కాలంలో అమెరికా విజిట్ కు వెళుతున్న భారతీయులు 13 శాతం మేర తగ్గిపోయారు.
గతంలో ఎన్నడూ లేని విదంగా తయారైన ఈ పరిస్థితిపై ఆ దేశం మాత్రం తనదైన కొత్త భాష్యాన్ని వినిపిస్తోంది. భారత్, ఆ దేశానికి చెందిన ప్రజలు, నరేంద్ర మోదీ ప్రభుత్వం, అమెరికాలో ఉంటున్న ఎన్నారైన సంక్షేమంపై ట్రంప్ సర్కారు చాలా స్నేహపూర్వక వైఖరితో ఉన్న కారణంగా... అమెరికాకు భారతీయ విజిట్లు తగ్గడానికి అమెరికా విధానాలు కారణం కానేకాదని బ్రాండ్ యూఎస్ ఏ ప్రెసిడెంట్ క్రిస్ థామ్సన్ చెబుతున్నారు. నరేంద్ర మోదీ సర్కారు ఇటీవలి కాలంలో అమలు చేసిన పెద్ద నోట్ల రద్దు - జీఎస్టీ పన్నుల విదానం కూడా ఈ తరుగుదలకు కారణం కావచ్చని ఆయన ఓ వింత వాదనను వినిపించారు. అయితే ఇదొక్కటే కారణమని తాను చెప్పడం లేదన్న ఆయన.. ఈ తరుగుదల అదాటుగా వచ్చినదేనని, దీని కారణంగా తామేమీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అయితే థామ్సన్ వాదన ఎలా ఉన్నా... ట్రంప్ సర్కారు వ్యవహరిస్తున్న తీరు కారణంగానే అమెరికాకు వెళ్లే భారతీయుల సంఖ్య క్రమంగా తగ్గుతోందని మాత్రం చెప్పక తప్పదు.