పెళ్లి సమయంలో ఆగలేక పోయిన వరుడు నవ వధువుకు ముద్దిచ్చాడు. దీంతో చిర్రెత్తిన వధువు పెళ్లి తంతును ఆపేసింది. పెద్దలు ఎంత నచ్చజెప్పాలని చూసినా వధువు మాత్రం ససేమిరా అనడంతో ఇక చేసేదేమీ ఇరువైపుల ఉన్న పెద్దలు పెళ్లిని క్యాన్సిల్ చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బదౌన్ జిల్లాలోని బిల్సీలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. యూపీలోని బహ్జోయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన యువతికి.. బదౌన్ జిల్లా బిల్సీకి చెందిన యువకుడితో వివాహం నిశ్చమైంది. ఈనెల 16న సామూహిక వివాహ పథకం కింద వీరి వివాహం జరిగింది. అనంతరం ఇరు కుటుంబాల అంగీకారంతో గత సోమవారం గ్రామంలో కళ్యాణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ క్రమంలోనే వధువును తీసుకెళ్లేందుకు వరుడు పెళ్లి ఊరేగింపుతో అమ్మాయి గ్రామానికి బంధువులతో కలిసి వచ్చాడు. ఇక వధువు తరుపు వారు పెళ్లి ఊరేగింపు సహా వివాహ ఆచారాలు నిర్వహించారు. అయితే వరుడు జయమాల కార్యక్రమ సమయంలో వధువు పట్ల అసభ్యంగా ప్రవర్తించడం ప్రారంభించాడు. దీంతో వధువుకు వరుడికి మధ్య ఘర్షణ జరిగింది.
వరుడి చర్యలపై పెద్దలు అభ్యంతరం వ్యక్తం చేయగా ఆ తర్వాత విషయం సద్దుమణిగింది. అయితే వరుడు మళ్లీ మళ్లీ వధువు పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో వధువు వివాహ వేడుకను నిర్వహించేందుకు నిరాకరించింది. దీంతో ఇరు కుటుంబాల మధ్య పెద్ద గొడవ జరిగింది. ఈ విషయంపై అక్కడనున్న వారు పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాల పెద్దలను పిలిపించి మాట్లాడారు. అయితే వరుడు తీరుపై ఆగ్రహించిన వధువు మాత్రం వరుడితో వెళ్లేందుకు నిరాకరించింది. దీంతో ఇరువర్గాల పెద్దలు పంచాయతీ నిర్వహించి వివాహ బంధాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో అంతా షాకయ్యారు.
ఈ విషయంపై బహ్జోయ్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ పంకజ్ లావానియా మాట్లాడుతూ పెళ్లి విషయంలో జరిగిన గొడవకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని తెలిపారు. ఇరువర్గాల పెద్దలు పరస్పర అంగీకారంతో సమస్యను పరిష్కరించుకున్నారని వెల్లడించారు.
ఏది ఏమైనా వరుడి తొందరపాటు చర్యతో తన గొయ్యిని తానే తవ్వుకున్నాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే వధువు నిర్ణయం సరైనదేనా? లేదా అనే దానిపై మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.