Begin typing your search above and press return to search.

తహసీల్దార్ విజయా రెడ్డి హత్య.. ఈ అమ్మకాలు పెరిగాయి.!

By:  Tupaki Desk   |   14 Nov 2019 7:11 AM GMT
తహసీల్దార్ విజయా రెడ్డి హత్య.. ఈ అమ్మకాలు పెరిగాయి.!
X
ఒకరి చావు మరొకరి కి ఆనందం అంటే ఏమో అనుకున్నాం.. కానీ ఇప్పుడదే నిజమైంది.తాజాగా రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ లో తహసీల్దార్ విజయారెడ్డి ని ఓ భూ వివాదంలో ఓ వ్యక్తి పెట్రోల్ పోసి కాల్చిచంపిన వైనం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించింది. ఆమె మరణం కూడా కొందరికీ సంతోషమైంది. వారికి వ్యాపార అవకాశం గా మారడం గమనార్హం. అవును... వింతగా అనిపిస్తున్నా ఇది అక్షర సత్యం.. తెలుగు రాష్ట్రాల్లో పెప్పర్ స్ర్పే అమ్మకాలు బాగా పెరిగాయని సమాచారం. అమ్మకం దారులకు ఇది అనుకోని వ్యాపార వరంగా లాభాలు తెచ్చిపెడుతోందట.. తహసీల్దార్ విజయా రెడ్డి మరణం తో ఇప్పుడు ఈ పెప్పర్ స్ప్రే వ్యాపారులు తమ వ్యాపార అవకాశాన్ని పెంచుకుంటుండడం విశేషం.

తహసీల్దార్ విజయా రెడ్డి మరణం తర్వాత రెవెన్యూ ఉద్యోగులంతా విధులు బహిష్కరించి ఆందోళన చేశారు. ఇప్పుడిప్పుడే ఆఫీసుల బాటపడుతున్నారు. కానీ వారికి భద్రత పై ఇప్పటికీ భయం వెంటాడుతోంది. రెవెన్యూ శాఖలో చాలా మంది మహిళా అధికారులున్నారు.. వీరంతా భూములు, రాబడి, పెన్షన్లు సహా కీలక వ్యవహారాలను చక్కబెడుతున్నారు. దీంతో ప్రజల్లో అసంతృప్తికి, ఆగ్రహాలకు కూడా బాధ్యులవుతున్నారు. వారి అఘాయిత్యాలకు బలైపోతున్నారు.

అందుకే తాజాగా రెవెన్యూ అధికారులు, ముఖ్యంగా మహిళా అధికారులంతా పెప్పర్ స్ప్రేలు కొనడానికి ఎగబడుతున్నారు. మార్కెట్లో, ఆన్ లైన్లో తెలుగు రాష్ట్రాల్లో కొనుగోళ్లు బాగా పెరిగాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. చాలా మంది తమను తాము రక్షించుకోవడానికి ఈ పెప్పర్ స్ప్రేను ఆయుధంగా మలుచుకుంటున్నారు. పెప్పర్ స్ప్రే చల్లడం వల్ల దాడి చేసే వారికి కళ్లు, ఇతర అవయవాలు కొద్దినిమిషాల పాటు తీవ్రమైన బాధ, నొప్పికి గురి అవుతాయి. ఆ సమయంలో తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. తహసీల్దార్ పై దాడి తర్వాత పెప్పర్ స్ప్రే అమ్మకాలు ఆన్ లైన్ లో గణనీయంగా పెరిగాయని ఆన్ లైన్ మార్కెట్ సేల్స్ కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు.

ఇప్పటికే విదేశాల్లో పెప్పర్ స్ప్రేను మహిళా ఉద్యోగులు, బయటకు వెళ్లే మహిళలు ఖచ్చితంగా వెంట తీసుకెళుతారు. రేపిస్టులు, దుండగులు, సహోద్యోగుల ఆకృత్యాలు, దొంగల బారినుంచి కాపాడుకోవడానికి దీన్నే ఆయుధం గా వాడుతారు. ఇది చల్లడం వల్ల కళ్లలో మంట వస్తుంది. ఇంద్రియాలను కొద్దిసేపు బలహీనపరుస్తుంది. మహిళలకు ఎంతో భద్రత కల్పిస్తుంది. ఇప్పుడు విజయా రెడ్డి సంఘటనతో రెవెన్యూ శాఖలోని తహసీల్దార్, కింద ఉన్న మహిళా ఉద్యోగులంతా ఈ పెప్పర్ స్ప్రే కొనుగోళ్ల కు ఎగబడడం ఆ వ్యాపారుల పంట పండేలా చేస్తోంది.