Begin typing your search above and press return to search.

కొడుకు లైంగిక వేధింపులకు తట్టులేక చంపించిన తల్లి

By:  Tupaki Desk   |   15 Aug 2020 8:30 AM GMT
కొడుకు లైంగిక వేధింపులకు తట్టులేక చంపించిన తల్లి
X
మానవ సంబంధాలు అంతకంతకూ బలహీనమవుతున్నాయి. వినేందుకు ఇష్టపడని ఎన్నో దారుణాలు ఇటీవల బయటకు వస్తున్నాయి. ఇప్పుడు చెప్పే ఉదంతం కూడా ఈ కోవకు చెందిందే. విన్నంతనే ఉలిక్కిపడటమే కాదు.. చీదరగా ముఖం పెట్టేయటం ఖాయం. కానీ.. పూర్తిగా చదివితే మాత్రం అయ్యో అన్న భావనతో ఆ తల్లి పడిన కష్టం తలుచుకుంటే కంటి వెంట కన్నీళ్లు రావటం ఖాయం. కన్నకొడుకే లైంగికంగా వేధిస్తున్న వైనానికి తట్టుకోలేక.. సుపారీ ఇచ్చి కిరాయి గూండాలతో చంపించిన తల్లి ఉదంతం ఇది.

హత్య జరిగిన నాలుగేళ్ల తర్వాత బయటకు వచ్చిన ఈ ఉదంతం ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. రౌడీషీటర్ల మధ్య వచ్చిన తగదాతో బయటకు పొక్కిన సమాచారాన్ని అందుకున్న పోలీసులు.. తమదైన శైలిలో విచారించగా దారుణ హత్య ఒకటి బయటకు వచ్చింది. ప్రకాశం జిల్లా పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం..

ప్రకాశం జిల్లా కందుకూరు మండలం పొన్నలూరుకు చెందిన లక్ష్మమ్మ కొడుకు నరసింహరావు. 35 ఏళ్ల ఇతగాడికి పదిహేనేళ్ల క్రితం పెళ్లైంది. మద్యానికి బానిసైన అతగాడి చేష్టలకు తట్టుకోలేక.. పిల్లలతో కలిసి భార్య హైదరాబాద్ కు వెళ్లి కూలి పనులు చేసుకుంటోంది. ఇది జరిగిన ఆరేళ్లకు ఇతగాడిలో కామవాంఛ పెరిగింది. తన భార్యను తిరిగి తీసుకురావాల్సిందిగా కోరేవాడు. అక్కడితో ఆగకుండా భార్యను తీసుకురాకపోతే.. తన కోరికను తీర్చాలని తల్లితో దారుణంగా మాట్లాడేవాడు. ఏ తల్లితో కొడుకు మాట్లాడని రీతిలో అతడి చర్యలు ఉండేవి.

కొడుకు ప్రవర్తనతో మనస్తాపానికి గురైన ఆమె.. ఎవరితోనైనా చెబితే పరువు పోతుందని మౌనంగా భరించేది. అదే సమయంలో ఆమె పక్షవాతానికి గురై మంచానికే పరిమితమైంది. దీన్నితనకు అనుకూలంగా చేసుకొని తన వేధింపుల్ని మరింత పెంచసాగాడు. నిత్యం ఆ హింసను తట్టుకోలేక తీవ్ర వేదనకు గురయ్యేది. కొడుకు వికృత చేష్టలు పెరగడంతో తట్టుకోలేక ఆమె.. తన సోదరుడికి విషయం చెప్పింది.

దీంతో వారిద్దరు కలిసి నరసింహారావును హత్య చేసేందుకు పథకాన్ని సిద్ధం చేశారు. తమకు తెలిసిన వారితో మాట్లాడి మొత్తం రూ.1.70లక్షల మొత్తాన్ని సుపారీ కింద ఇచ్చి.. కొడుకుని హత్య చేయించారు. నాలుగు నెలల క్రితం బయటకు వెళ్లిన అతడ్ని కత్తితో పొడిచి చంపటమే కాదు.. అక్కడే గుంత తీసి డెడ్ బాడీని పూడ్చి పెట్టారు. అనంతరం హత్యకు పాల్పడిన గ్రూపులోని వారి మధ్య వచ్చిన విభేదాలతో హత్య ఉదంతం బయటకు పొక్కింది. జరిగిన విషయాల్ని తమ విచారణలో ఆధారాలు సేకరించిన ప్రకాశం జిల్లా పోలీసులు ఆ తల్లితో పాటు మొత్తం తొమ్మిది మందిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.ఏ తల్లికి రాకూడని ఈ పరిస్థితిపై కోర్టు ఏమని స్పందిస్తుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.