నిత్యం కంటికి కనిపిస్తూ కనువిందు చేసే చంద్రుడంటే మనిషికి ఎంతో అభిమానం. ఇక.. భారతీయులకైతే చెప్పాల్సిన అవసరమే లేదు. చంద్రుడ్ని.. చందమామను చేసేసి.. ఆయన పేరిట ఎన్ని కథలు అల్లుకున్నది తెలిసిందే. భూమి మీద ప్రభావం చూపించేది చంద్రుడేనని బలంగా నమ్మే వారు లేకపోలేదు. మన పంచాగాలు.. సిద్ధాంతాలు చంద్రుడి చుట్టూ బేస్ చేసుకొనే ఉంటాయన్నది మర్చిపోకూడదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. శాస్త్రీయంగా చంద్రుడి తీరుపై అమెరికా పరిశోధకులు కొత్త విషయాన్ని గుర్తించారు.
చంద్రుడు క్రమంగా ముడుచుకుపోతున్నాడన్న విషయాన్ని తేల్చారు. చంద్రుడిపై అంతర్గతంగా ఉన్న చల్లదనంతో పాటు ఇతర కారణాలు జాబిల్లిని చిక్కిపోయేలా చేస్తున్నాయని తేల్చారు. అయితే.. ఇది ఇప్పటికిప్పుడు చోటు చేసుకున్న పరిణామం కాదని.. కొన్ని వందల మిలియన్ ఏళ్ల నుంచికొనసాగుతున్నట్లుగా చెబుతున్నారు.
తమ పరిశోధనల ఫలితాల్ని విశ్లేషించినప్పుడు ఇప్పటివరకూ చంద్రుడు దాదాపు 150 అడుగులు కన్నా ఎక్కువ కుంచించుకుపోయినట్లుగా తేలిందని చెబుతున్నారు. ద్రాక్ష పండు ముడుచుకుపోతే ఎలాంటి ముడతలు ఏర్పడతాయో.. చంద్రుడి మీదా ఇలాంటివే చోటు చేసుకుంటున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు.
జాబిల్లి ముడుచుకుపోవటం ద్వారా.. ప్రకంపనలు సంభవించే అవకాశం ఉందని.. నాసాకు చెందిన లూనార్ రీకానిసెన్స్ ఆర్బిటార్ తీసిన 12వేల ఫోటోల్ని విశ్లేషించిన తర్వాత ఈ విషయాన్ని గుర్తించినట్లు చెబుతున్నారు. ఈ కారణంగా చంద్రుడి ఉపరితలంపై పగుళ్లు ఏర్పడే అవకాశం ఉందంటున్నారు. చంద్రుడు ఏర్పడిన 4.5 బిలియన్ సంవత్సరాల నుంచి జాబిల్లి లోపలి వేడి నెమ్మదిగా తగ్గుతుందని.. దీంతో టెక్నోటిక్ ప్రక్రియ మొదలైందని.. ఈ కారణంగా ప్రకంపనాలు ఎక్కువయ్యే అవకాశం ఉందంటున్నారు.