Begin typing your search above and press return to search.

రాష్ట్రాల వాటాను జమ్ముకశ్మీర్ కు ఇచ్చేస్తున్న మోడీ సర్కార్

By:  Tupaki Desk   |   2 April 2021 2:30 PM GMT
రాష్ట్రాల వాటాను జమ్ముకశ్మీర్ కు ఇచ్చేస్తున్న మోడీ సర్కార్
X
పుదుచ్చేరి ఎన్నికల నేపథ్యంలో.. ఆ రాష్ట్రానికి కేంద్రపాలిత హోదా ఇస్తామని..జమ్ముకశ్మీర్ మాదిరి నిధుల పంపిణీ చేస్తామన్న ఎన్నికల హామీ విమర్శలకు తెర తీసింది. ఈ హామీ గురించి విన్న తెలుగు వారంతా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. విభజన వేళ.. రాజధాని కూడా లేని ఏపీ డెవలప్ మెంట్ కోసం నిధుల కేటాయింపు.. పన్ను రాయితీలకు అవకాశం ఉండే ప్రత్యేక హోదా ఇచ్చేందుకు ససేమిరా అనే మోడీ సర్కారు.. తాజాగా పుదుచ్చేరిలో జరుగుతున్న ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకు ఇచ్చిన హామీపై పెద్ద ఎత్తున మండిపాటు వ్యక్తమవుతోంది.

ఈ సందర్భంగా మోడీ సర్కారు అనుసరించే విధానాలపై చర్చ మొదలైంది. కొన్ని రాష్ట్రాల విషయంలో అనుసరించే విధానాల్ని ఇప్పుడు వేలెత్తి చూపిస్తున్నారు. రాష్ట్రాలకు ఇవ్వాల్సిన వాటాలో కోత పెట్టి.. రాష్ట్ర హోదా లేని జమ్ముకశ్మీర్ కు నిధులు కట్టబెట్టే వైనం ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది. 15వ ఆర్థిక సంఘం ఇటీవల తన సిఫార్సులు సమర్పించే వేళకు.. జమ్ముకశ్మీర్ పూర్తిస్థాయిలో రాష్ట్ర హోదా ఉండేది. మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయంతో ఆ రాష్ట్రం.. రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా మారిపోవటం తెలిసిందే. అంటే.. దానికి ఉండాల్సిన రాష్ట్ర హోదా పోయింది.

జమ్ముకశ్మీర్ ను విభజిస్తూ ప్రవేశ పెట్టిన పునర్ వ్యవస్థీకరణ బిల్లులో రాష్ట్రాల మాదిరిగా.. కేంద్రపన్నుల్లో జమ్ముకశ్మీరు కేంద్రపాలిత ప్రాంతానికి కూడా వాటా వచ్చేలా 15వ ఆర్థిక సంఘానికి రాష్ట్రపతి సిఫార్సు చేయాలని ఉంది. అయితే.. ఆర్థిక సంఘం దీన్ని పట్టించుకోలేదు. యూటీగా మారినందున రాష్ట్రంగా పరిగణలోకి తీసుకోమని తేల్చి చెప్పారు. ఈ కారణంగా పన్నుల వాటా బదలాయింపు రాజ్యాంగ విరుద్ధమవుతుందని ఆర్థిక సంఘం ఛైర్మన్ వీకే సింగ్ విస్పష్టంగా వెల్లడించారు.

దీంతో.. జమ్ముకశ్మీర్ విషయంలోకేంద్రం ఒక సర్దుబాటు చేసింది. రాష్ట్రాలకు కేంద్ర పన్నుల్లో 42 శాతం వాటా ఇవ్వాలని ఆర్థిక సంఘం సిఫార్సు చేయగా.. ఆ వాటాను 41 శాతానికి కుదించి.. మిగిలిన ఒక్క శాతాన్ని జమ్ముకశ్మీర్ కు వ్యయం చేస్తామని ప్రకటించింది. అంటే.. ఇతర రాష్ట్రాల వాటాలో కోత పెట్టి ఆ రాష్ట్రానికి నిధులు కేటాయించిందన్నమాట. తాజాగా ఎన్నికల హామీగా పుదుచ్చేరికి ఇవ్వాల్సి ఉంటుంది. అంటే.. ఇతర రాష్ట్రాల వాటా నిధుల్ని కోత పెట్టేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ బాధించే అంశం ఏమంటే.. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు మోకాలడ్డు పెట్టే మోడీ సర్కారు.. తమకు రాజకీయ ప్రయోజనాల్ని కలిగించే వాటి విషయంలో అనురించే తీరు ఆగ్రహాన్ని తెప్పించకమానదు.