Begin typing your search above and press return to search.

ఏపీలో మారిన రూపురేఖలు: కార్పొరేట్ మాదిరిగా ప్రభుత్వ బడులు

By:  Tupaki Desk   |   28 Jun 2020 8:10 AM GMT
ఏపీలో మారిన రూపురేఖలు: కార్పొరేట్ మాదిరిగా ప్రభుత్వ బడులు
X
ఇన్నాళ్లు కూలిన.. పాడుబడిన భవంతులు.. సౌకర్యాల లేమితో ఉండేవి ప్రభుత్వ పాఠశాలలు. ఇప్పుడు వాటి రూపురేఖలు మారుతున్నాయి. అధునాతన సౌకర్యాలతో కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా పాఠశాలలు రూపుదిద్దుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ స్కూళ్లకు మహర్దశ పట్టనుంది. కార్పొరేట్ స్కూళ్ల మాదిరి కనిపిస్తున్నాయి.

విద్యా వ్యవస్థపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు మన బడి, నాడు - నేడు కార్యక్రమాలను ప్రారంభించారు. మొదట స్కూల్ ఎలా ఉంది.. తర్వాత తీసుకున్న చర్యలతో స్కూల్ ఎలా మారిందో ప్రజలకు తెలియచేసేందుకు నాడు నేడు కార్యక్రమం మొదలుపెట్టారు. అందులో భాగంగా పాఠశాలల ఫొటోలను ప్రదర్శిస్తున్నారు. ఆ ఫొటోలు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. ప్రభుత్వ పాఠశాలేనా అని ఆశ్చర్యానికి గురవుతున్నారు.

గపీలో మొత్తం 44,512 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో మొదటి దశలో భాగంగా 15,715 పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నారు. తొమ్మిది రకాల పనులను ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేస్తున్నారు. ప్రముఖ సంస్థల బ్రాండెడ్‌ రకాలను వినియోగిస్తున్నారు. విజయవాడలోని సర్వశిక్ష అభియాన్‌ కార్యాలయంలో ప్రత్యేక స్టాల్స్‌ను విద్యాశాఖ ఏర్పాటు చేసింది. ఇందులో కంపెనీల వివిధ పరికరాలు, వస్తువులున్నాయి.

వీటిని తాజాగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలల పునఃప్రారంభంలోపు పనులన్నీ పూర్తి చేస్తామని మంత్రి ప్రకటించారు. ఎక్కడ లేని విధంగా స్కూళ్ల భద్రత కోసం ప్రత్యేకంగా వాచ్ మెన్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. మనబడి, నాడు - నేడు ప్రత్యేక పోర్టల్ లో ఏ పనికి ఎంత ఖర్చు పెట్టామో లెక్కలు అప్ లోడ్ చేస్తామని చెప్పారు. పనులకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే ప్రభుత్వానికి తెలియచేయడానికి టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తామని మంత్రి ప్రకటించారు. స్కూల్స్ పేరెంట్స్ కమిటీలతోనే.. ఈ పనులన్నీ జరిపిస్తున్నామని తెలిపారు.