ఆంధ్ర-ఒడిస్సా బార్డర్ (ఏవోబీ)లో మావోయిస్టులు తుడిచిపెట్టుకుపోతున్నారు. తాజాగా విశాఖపట్నం జిల్లాలో జరిగిన భారీ ఎన్ కౌంటర్లో ఆరుమంది మావోయిస్టులు మరణించారు. ఇందులో ముగ్గురు కీలక నేతలుండటం సంచలనంగా మారింది. ఈ ముగ్గురు కూడా డివిజనల్ కమిటి మెంబర్ స్ధాయి నేతలు కావటం ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే డీసీఎం స్ధాయి మావోయిస్టు నేతలు పోలీసు కాల్పుల పరిధిలో ఉండరు.
డీసీఎం నేతలు పాల్గొనే సమావేశాలంటే మావోయిస్టు దళాలు చాలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాయి. అలాంటిది వీళ్ళ సమావేశమవటం, పోలీసుల కాల్పుల్లో ఇద్దరు డీసీఎంలు మరణించటమంటే మావోయిస్టులకు పెద్ద దెబ్బనే అనుకోవాలి. హోలు మొత్తంమీద ఏవోబీ ప్రాంతంలో మావోయిస్టులు బాగా బలహీనపడ్డారని అర్ధమైపోతోంది. ఇందుకు ప్రధానంగా మూడు కారణాలున్నాయి.
మొదటిదేమో రిక్రూట్మెంట్లు జరగకపోవటం, రెండోది మావోయిస్టుల్లో చేరటానికి యువత పెద్దగా ఆశక్తి చూపకపోవటం, మూడోది యాక్టివ్ గా ఉన్న మావోయిస్టు నేతలు, దళసభ్యులు లొంగిపోతుండటం. తాజా ఘటనలో మావోయిస్టుల అగ్రనేతలు అరుణ, ఉదయ్, జగన్ను రక్షించేందుకని కాల్పులు జరిపిన క్రమంలో డీసీఎంలు, దళసభ్యులు మరణించినట్లు సమాచారం.
ఏవోబీలో కీలక నేతలు మరణించటం, లొంగిపోయిన కారణంగా ఇక్కడ నాయకత్వ లోపం ఏర్పడింది. నాయకత్వాన్ని భర్తీ చేసేందుకని అగ్రనేతలు చత్తీస్ ఘడ్ కు చెందిన నేతలను, దళాలను ఏవోబీలో దింపారు. దాంతో రెండు వైపులా భాషా సమస్య రావటంతో సమస్యలు మొదలయ్యాయి. పైగా బయటనుండి వచ్చిన నేతలకు ఏవోబీ ప్రాంతంపై పట్టులేదు. లోకల్ జనాలు నమ్మలేదు. దాంతో మావోయిస్టులకు స్ధానిక ప్రాంతాలు, జనాలకు గ్యాప్ వచ్చేసింది.
ఇదే సమయంలో చత్తీస్ ఘడ్, ఒడిస్సా ప్రాంతాల్లో పోలీసుల నిర్బంధాలు, ఏరివేత పెరిగిపోవటంతో మావోయిస్టు నేతలు ఏవోబీ ప్రాంతంలోని విశాఖ, ఉభయగోదావరి జిల్లాల్లోనే తలదాచుకోవాల్సిన అవసరం వచ్చింది. దీనివల్లే పోలీసుల టార్గెట్ కు తేలిగ్గా దొరికిపోతున్నారు. ఒకపుడు మావోయిస్టులకు బలమైన రక్షణగా స్ధానిక గిరిజనులుండేవారు. తాజా పరిస్ధితుల్లో స్ధానికుల నుండి దళాలకు రక్షణ కూడా కరువైంది.
ఏవోబీలోని కలిమెల, నారాయణపట్నం, నందాపూర్, కాఫీదళం, గాలికొండ, పెదబయలు, గుమ్మా, బోయిపరిగూడ పేర్లలో ఉన్న 8 దళాలు మూడుకు పడిపోయాయి. రెండు కంపెనీల పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ తాజాగా 10 మంది ప్లటూన్ స్ధానికి పడిపోయింది. ఏవోబీలో 180 మంది ఉండే దళం సంఖ్య ఇపుడు 50కి పడిపోయింది. వీటన్నింటి మీద కీలక నేతలు, దళసభ్యులు లొంగిపోవటంతో మావోయిస్టులు తుడిచిపెట్టుకుపోతున్నారు.