Begin typing your search above and press return to search.

ఆవును కర్రతో మందలించాడని చంపేశాడే .. ఎక్కడ , ఏంజరిగిందంటే !

By:  Tupaki Desk   |   22 Dec 2020 5:03 PM IST
ఆవును కర్రతో మందలించాడని చంపేశాడే .. ఎక్కడ , ఏంజరిగిందంటే !
X
ఉత్తరప్రదేశ్ లోని కాన్ఫూర్ లో ఓ ఘోర సంఘటన చోటుచేసుకుంది. ఆవును కర్రతో మందలించాడన్న కారణంగా ఓ వ్యక్తిని నడిరోడ్డుపై.. అతని భార్యబిడ్డలు చూస్తుండగానే ఇష్టం వచ్చినట్టు కొట్టి చంపేశాడు. ఓ వ్యక్తిని నడిరోడ్డు పై కర్రతో కొడుతుంటే , పక్కన చూస్తున్న వారెవరూ కూడా కనీసం ఆపలేకపోవడం గమనార్హం. ఈ ఘటన పై పూర్తి వివరాల్లోకి వెళ్తే ..

కాన్పూర్ సిటీ లోని గోవింద్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మహదేవ్ నగర్ బస్తీలో రమణ్ గుప్తా అనే వ్యక్తి కుటుంబంతో సహా జీవిస్తున్నాడు. అతనికి భార్య మాయ, ముగ్గురు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. స్థానికంగా ఫ్యాక్టరీల్లో చిన్నా చితకా పనులు చేసేవాడు. లాక్ డౌన్ లో పని కోల్పోయి ఖాళీగా ఉంటున్నాడు. ఈ సమయంలో భార్య మాయా గుప్తా నాలుగైదు ఇండ్లలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నది. నిన్న సోమవారం పిల్లలంతా ఇంటి ముందు రోడ్డు మీద ఆడుకుంటుండగా, ఆ సందులోకి ఓ ఆవు దూసుకొచ్చింది. భయంతో పిల్లలు గావుకేక పెట్టగా, బయటికి ఉరికొచ్చిన రమణ్ గుప్తా, ఓ చిన్న కర్రను చేతబట్టుకుని, ఆవును మందలిస్తూ, దూరంగా తరిమేసే ప్రయత్నం చేశాడు. అప్పటికే వీధి చివర కూర్చొని ఉన్న ఆవు యజమాని ఆయుష్ యాదవ్ ఈ సంఘటనపై అనూహ్యంగా రియాక్ట్ అయ్యాడు. అతడు స్థానికంగా ఒక డైరీ ఫామ్ నడుపుతున్నాడు.

ఆవును కర్రతో మందలించావెందుకంటూ రమణ్ గుప్తాతో ఆయుష్ యాదవ్ గొడవకు దిగాడు. కొద్ది నిమిషాల వాగ్వాదం తర్వాత ఇంటికెళ్లి, ఓ దుడ్డుకర్రను తెచ్చుకున్న యాదవ్ గుప్తాను ఇంట్లో నుంచి బయటికి ఈడ్చుకొచ్చి చితకబాదడం మొదులుపెట్టాడు. గుప్తాను కొట్టొద్దని ఆయన భార్యాపిల్లలు యాదవ్ కాళ్లావేళ్లా పడినా కనికరించలేదు. ఆ సమయంలో పక్కనున్న వారు కూడా అడ్డుపడలేదు. కొట్టడం ఆపేసి, దర్జాగా అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లిపోయిన తర్వాత.. తీవ్రంగా గాయపడిన రమణ్ గుప్తాను అతని కుటుంబీకులు ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే అతను మృతి చెందాడని డాక్టర్లు నిర్ధారించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు అయుష్ యాదవ్ తన డైరీ ఫామ్ ను బంధువులకు అప్పగించి, కుటుంబంతో సహా పరారయ్యాడు.