Begin typing your search above and press return to search.

కడప : కూతుర్ని చంపిన తల్లిని చంపేసిన కొడుకు

By:  Tupaki Desk   |   22 Oct 2021 11:30 PM GMT
కడప : కూతుర్ని చంపిన తల్లిని చంపేసిన కొడుకు
X
కడపలో షాకింగ్ క్రైం.. సెల్ వివాదంలో కూమార్తెను చంపిన తల్లి.. చెల్లిని చంపిందని హత్య చేసిన అన్న
ఎక్కడికి పోతున్నాం? ఏమైపోతున్నాం? ఇలాంటి దారుణాల గురించి విన్నంతనే ఉలిక్కిపడటమే కాదు.. అసలేం జరుగుతుందన్న ఆందోళనతో మైండ్ బ్లాక్ అయ్యే పరిస్థితి. ఏపీలోని కడపలో చోటు చేసుకున్న జంట హత్యల ఉదంతం సంచలనంగానే కాదు.. ఇలా కూడా జరుగుతుందా? అన్నట్లుగా ఉండటం గమనార్హం. సెల్ ఫోన్ ఎక్కువగా చూస్తుందన్న ఆగ్రహంతో కుమార్తెను తల్లి చంపేస్తే.. చెల్లెల్ని చంపుతావా? అంటూ తల్లిని కొడుకు చంపేసిన దారుణ వైనం చోటు చేసుకుంది. అసలీ ఉదంతం ఎలా చోటు చేసుకుంది? పోలీసులు ఏం చెబుతున్నారన్న విషయంలోకి వెళితే..

కడప పట్టణంలోని రవీంద్రనగర్ కు చెందిన 45 ఏళ్ల షేక్ కుషీద.. మహమ్మద్ హుస్సేన్ దంపతులు ఉన్నారు. వారికి 17 ఏళ్ల కుమారుడు.. 14 ఏళ్ల కుమార్తె ఉన్నారు. బతుకుదెరువు కోసం కుషీద కువైట్ వెళ్లి కొంతకాలం ఉండి వచ్చింది. తొమ్మిదో తరగతి చదువుతున్న కుమార్తె తరచూ సెల్ ఫోన్ చూస్తుండంతో.. ఈ విషయం మీద పెద్ద ఎత్తున గొడవలు తరచూ జరుగుతుండేవి. మరోవైపు .. భార్యభర్తల మధ్య గొడవల కారణంగా వారు విడివిడిగా ఉంటున్నారు.

పిల్లల్ని కుషీదా తనతో పాటు ఉంచుకొని వారి అలనాపాలనా చూస్తుండేది. సెల్ ఫోన్ వివాదంలో భాగంగా తాజాగా కుమార్తె గొంతుకు చున్నీ వేసి బలంగా లాగటంతో ఆమె మరణించినట్లుగా పోలీసులు చెబుతున్నారు. దీంతో.. చెల్లెల్ని పొట్టన పెట్టుకుందన్న కోపంతో అన్న హత్యకు పాల్పడ్డారు. చెల్లెల్ని చున్నీతో మెడకు బిగించి చంపేసిన వైనంతో ఆవేశానికి గురైన కొడుకు.. చెల్లినే చంపేస్తావా? అంటూ కత్తితో తల్లి గొంతులో పొడవటంతో ఆమె అక్కడికక్కడే మరణించింది.

అయితే.. కుమార్తెను భయపెట్టేందుకు సరదాగా మెడకు చున్నీని బిగిస్తే.. అనూహ్యంగా మరణించినట్లుగా మరో వెర్షన్ వినిపిస్తోంది. వాస్తవం ఏమిటన్నది పోలీసుల దర్యాప్తులో తేలనుంది. ఏమైనా.. కుమార్తెను తల్లి చంపేస్తే.. ఆమెను కొడుకు చంపేసిన వైనం షాకింగ్ గా మారింది. ఈ జంట హత్యల సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పోస్టమర్టంకు తరలించారు. తల్లి హత్యకు కారణమైన కొడుకును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.