ఇంకా ఐదేళ్లు కూడా నిండలేదు.. అప్పుడే సమాజాన్ని కళ్లు తెరచి చూస్తున్న బాలికను ఓ లారీ డ్రైవర్ బలత్కారం చేశాడు. పసిపాపపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ముక్కుపచ్చలారని బాలికపై లైంగిక దాడి చేసి హత్య చేసిన నిందితుడిపై హైకోర్టు దయచూపింది. కింది కోర్టును వేసిన ఉరిశిక్షను కాకుండా జీవిత ఖైదు వేస్తూ తీర్పునిచ్చింది. గతేడాది చిత్తూరు జిల్లా చేనేత నగర్ లో ఐదేళ్ల బాలికపై లైంగికదాడికి పాల్పడి.. దారుణంగా హత్య చేసిన ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. దీనిపై ఫోక్సో యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడైన లారీ క్లీనర్ మహ్మద్ రఫీని అదుపులోకి తీసుకున్నారు.
ఆ కేసును విచారించి 110 రోజుల్లోనే నిందితుడుని దోషిగా తేల్చుతూ.. మరణశిక్ష విధించింది ఫోక్సో న్యాయస్థానం. ఫోక్సో కోర్టు ఇచ్చిన తీర్పును నిందితుడు రఫీ హైకోర్టులో సవాల్ చేశాడు. ఈ కేసును విచారించిన జస్టిస్ సి.ప్రవిణ్ కుమార్, జస్టిస్ కె.సురేష్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం…ఫోక్సో కోర్టు ఇచ్చిన మరణశిక్షను జీవితఖైదుగా మార్చుతూ తీర్పు వెలువరించింది. పోక్సో కేసుల విచారణ సందర్భంగా వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని గతంలో సుప్రీంకోర్టు పేర్కొన్న విషయాన్ని ధర్మాసనం పరిగణలోకి తీసుకుంది. దోషిలో మార్పు వచ్చే అవకాశం ఉండడంతో దిగువకోర్టు విధించిన మరణశిక్షను.. రెమిషన్ లేని జీవిత కారాగార శిక్షగా మార్చుతున్నట్లు న్యాయస్థానం ప్రకటించింది.