Begin typing your search above and press return to search.

అందిన కాడికి ఎడా పెడా ...రంకెలేస్తున్న అప్పుల అంకెలు

By:  Tupaki Desk   |   26 July 2022 12:30 PM GMT
అందిన కాడికి ఎడా పెడా ...రంకెలేస్తున్న  అప్పుల అంకెలు
X
ఏపీ సర్కార్ అప్పులలో మునిగి తేలుతోంది. ఇది విపక్షాలు చేసే ఆరోపణ కాదు. గిట్టని మీడియా చేస్తున్న విష ప్రచారం అంతకంటే కాదు. కేంద్రం దగ్గర ఉన్న ఏపీ పక్కా లెక్క ఇది. ఎక్కడ ఏ రూపేణా అప్పులు తెచ్చారో ఎలా ఖర్చు చేశారో బయటపెట్టేసింది. టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ఒక ప్రశ్నకు కేంద్ర కేంద్ర ఆర్ధిక శాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి ఇచ్చిన జవాబులో చాలా విషయాలు ఉన్నాయి.

ఏపీ సర్కార్ అప్పుల జాబితా చూస్తే మతి పోవాల్సిందే మరి. ఈ ఏడాది అంటే 2022-23 ఆర్ధిక సంవత్సరంలో ఏపీ సర్కార్ కి ఏపీకి నికర రుణ పరిమితి కింద 44574 వేల కోట్లు రుణం తీసుకునేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. అయితే ఈ మొత్తం నుంచి కేవలం మూడు నెలలు అంతే ఏప్రిల్, మే, జూన్ నెలలలోనే సగానికి సగం 21,890 వేల కోట్ల రూపాయలను ఏపీ బహిరంగ మార్కెట్ ద్వారా తీసుకుందని కేంద్రం చెప్పిన కరెక్ట్ లెక్కగా ఉంది.

ఇంకా తొమ్మిది నెలలు గడవాలి. అంటే కనీసంగా మరో అరవై వేల కోట్ల రూపాయలు అప్పుగా చేస్తారా అన్నదే ఇక్కడ ప్రశ్న. ఇక ఇది చాలదన్నట్లుగా 1373.47 కోట్లు రుణం వేరే సోర్సెస్ నుంచి ఏపీ సర్కార్ తీసుకున్నదని కేంద్రం తెలిపింది. అలాగే నాబార్డ్ నుంచి ఏపీ ప్రభుత్వం ఇంకో రూ.40.17 కోట్లు అప్పు పుచ్చేసుకుంది. ఈ విధంగా చూస్తే ఎవరు అప్పు ఇస్తారా అని చూసి మరీ రుణాన్ని ఎడా పెడా చేసేస్తోందని కేంద్రం వెల్లడించిన లెక్కలు తెలియచేస్తున్నాయి.

మరి ఇలా విచ్చలవిడిగా అప్పులు చేసుకుంటూ పోతే ఏపీ రుణాంధ్ర ప్రదేశ్ గా మాత్రమే ఉంటుంది అని అంటున్నారు. అప్పు తేవడం వరకూ ఓకే కానీ దాన్ని అనుత్పాదక రంగాలకు పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నారు. గోడకు కొట్టిన సున్నం మాదిరిగా ఆ ఖర్చులు ఎప్పటికీ వెనక్కి తిరిగిరావు.

మరో వైపు వడ్డీలు కూడా కుప్పలుగా పేరుకుపోతాయని అంటున్నారు. ఏది ఏమైనా గత రెండు రోజులుగా పార్లమెంట్ సాక్షిగా బయటపెడుతున్న అప్పుల చిట్టా ఏపీ భవిష్యత్తు మీద నీలి నీడలు పడేలా చేస్తోంది అంటున్నారు. జనాల్లో ఆందోళన కలిగిస్తోంది అని కూడా అంటున్నారు.