Begin typing your search above and press return to search.

కోజికోడ్ డేంజర్ మీద 9 ఏళ్ల క్రితమే వార్నింగ్ ఇచ్చాడా?

By:  Tupaki Desk   |   8 Aug 2020 2:00 PM GMT
కోజికోడ్ డేంజర్ మీద 9 ఏళ్ల క్రితమే వార్నింగ్ ఇచ్చాడా?
X
ఏదైనా ప్రమాదం జరిగిన వెంటనే ఉరుకులు పరుగులు తీయటం.. హడావుడి ప్రదర్శించటం.. ఆవేదనను వ్యక్తం చేయటం.. ముఖాన్ని బాధగా పెట్టేసి.. సంతాప సందేశాలు.. అవసరమైతే బాధితులకు ఆర్థిక సాయాన్ని ప్రకటించిన చేతులు దులుపుకునే వ్యవస్థ ఉన్నంత కాలం అనవసరంగా ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. తాజాగా ఇదెంత నిజమన్నది కేరళలోని కోజికోడ్ ఎయిర్ పోర్టు ఉదంతాన్ని చూస్తే.. ఇట్టే అర్థమవుతుంది.

కోజికోడ్ ఎయిర్ పోర్టులో ఇంత పెద్ద ఎత్తున ప్రమాదం జరుగుతుందన్న విషయాన్ని తాను తొమ్మిదేళ్ల క్రితమే హెచ్చరించినట్లుగా వైమానిక రంగ నిపుణులు వెల్లడించారు. వాయు భద్రతా నిపుణులు కెప్టెన్ మోహన్ రంగనాథన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు కలకలాన్ని రేపుతున్నాయి. కోజికోడ్ ఎయిర్ పోర్టు టేబుల్ టాప్ కావటం.. ఎయిర్ పోర్టు కొండల మీద ఉండటం.. రన్ వేకు రెండువైపులా లోయలు ఉండటంతో ఎక్కువ ప్రమాదానికి అవకాశం ఉంటుందని తాను తొమ్మిదేళ్ల క్రితమే చెప్పినా ఎవరూ పట్టించుకోలేదన్నారు.

రన్ వే దగ్గర సరైన చర్యలు తీసుకోకపోతే.. ఇవాళ కోజికోడ్ దగ్గర జరిగిన ప్రమాదం లాంటిదే భవిష్యత్తులో లేహ్.. పాట్నా ఎయిర్ పోర్టుల్లో జరిగే అవకాశం ఉందన్నారు. ‘‘నా అంచనాకు తగ్గట్లే ఈ ప్రమాదం జరిగింది. నేను చేసిన హెచ్చరికను పట్టించుకోలేదు. నా అభిప్రాయం ప్రకారం ఇది ప్రమాదం ఎంతమాత్రం కాదు. ఇది హత్య. తమ సొంత భద్రతా చర్యల్లోనే లోపాలు ఉన్నాయి. కోజీకోడ్ విమానాశ్రయం రన్ వే చివరలో 70 మీటర్ల డ్రాప్ ఉంది. మంగళూరులో ఇది 100 మీటర్లు ఉంది. ఒక విమానం అదుపు తప్పితే.. ప్రమాదం నుంచి తప్పించుకునే అవకాశం ఇక్కడ లేదు. ఇలాంటి ప్రమాదమే లేహ్ లోనూ.. పాట్నాలోనూ జరిగే అవకాశం ఉంది. రెండు చోట్ల సరైన భద్రతా చర్యలు లేవు’’ అని చెప్పారు.

కోజికోడ్ విమానాశ్రయంలో సరైన లైటింగ్ లేకపోవటం కూడా ప్రమాదానికి కారణంగా చెబుతారు. గతంలో ఇదే అంశాన్ని పలుమార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని చెబుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. విమానం రెండు ముక్కలైనా మంటలు రాకపోవటానికి కారణం పైలట్ సమయస్ఫూర్తిగా వ్యవహరించటమే అని చెబుతున్నారు. రెండుసార్లు ల్యాండ్ అవ్వటానికి ప్రయత్నించినా పరిస్థితి బాగున్నట్లు లేకపోవటంతో.. ఫ్యూయల్ అయిపోయే వరకు తిరిగి.. చివర్లోల్యాండ్ అయి ఉండొచ్చని భావిస్తున్నారు.

ఈ కారణంతోనే ప్రమాదం జరిగినా.. విమానం రెండు ముక్కలే అయ్యింది కానీ.. మంటలు చెలరేగలేదన్న అంచనా వినిపిస్తోంది. ఒకవిధంగా చూస్తే.. ప్రమాదం గురించి పైలట్ కు అవగాహన ఉందని.. తన ప్రాణాలు పోయినా.. ప్రయాణికుల ప్రాణాల్ని కాపాడేందుకు చివరి వరకు పైలట్ ప్రయత్నించి ఉండొచ్చని అంటున్నారు. ఏమైనా.. బ్లాక్ బాక్స్ లభ్యమైంది కాబట్టి.. విమాన ప్రమాద వేళలో ఏం జరిగిందన్న విషయం పై మరికొన్ని రోజుల్లో క్లారిటీ వస్తుందని చెప్పక తప్పదు.