Begin typing your search above and press return to search.

ముద్దు ఆమె ప్రాణాన్ని తీసిందట

By:  Tupaki Desk   |   19 Dec 2019 5:49 AM GMT
ముద్దు ఆమె ప్రాణాన్ని తీసిందట
X
రెండు అక్షరాల ప్రేమ ఎంత పవర్ ఫుల్ అయినా.. దాన్ని మరో స్థాయికి తీసుకెళ్లటంలో మాత్రం ముద్దు కీలకమని చెప్పాలి. కానీ.. అలాంటి ముద్దు ప్రేమను తర్వాతి లెవల్ కు తీసుకెళ్లటం తర్వాత ప్రాణాల్ని కూడా తీసేస్తుందన్న చేదునిజం తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే. ముద్దు చాలా మంచిదని.. ఆరోగ్యాన్ని పెంచుతుందని.. ఒత్తిడిని తగ్గిస్తుందని.. ముద్దు కారణంగా గుండె సంబంధిత వ్యాధులు దగ్గరకు కూడా రావని చెబుతారు.

అంతేనా.. ముద్దు కారణంగా బాడీలో 10 నుంచి 15 కేలరీలు కరుగుతాయన్న లెక్కలు చెప్పేటోళ్లు కనిపిస్తారు. అయితే.. ఇదంతా నాణెనికి ఒకవైపు మాత్రమే.రెండో వైపు భయంకరమైన నిజం ఒకటి దాగి ఉంది. తాజాగా చోటు చేసుకున్న విషాదంతో ఈ చేదు నిజం బయటకు వచ్చింది. ఫ్లోరిడాలోని 17 ఏళ్ల టీనేజర్ అరియానా అనారోగ్యానికి గురి కావటమే కాదు..ప్రాణాలు కోల్పోయింది.

అప్పటివరకూ ఫిట్ గా ఉన్న అరియానా అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైంది. గొంతు మంట.. తీవ్రమైన తలనొప్పితో బాధ పడింది. అయితే.. వైరల్ ఫీవర్ గా భావించి ఇంట్లోనే వైద్యం చేశారు. ఆ టీనేజర్ అథ్లెట్ కూడా కావటంతో ఈ అనారోగ్యాన్ని చిన్నదిగానే భావించారు. అదే ఆమె ప్రాణాల్ని తీసింది. వైరల్ ఫీవర్ అంతకంతకూ పెరిగిపోవటం.. కొత్త సమస్యలు తెర మీదకు రావటంతో ఆమెను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. తర్వాత ఆమెను ఎయిర్ అంబులెన్స్ లో మరో ఆసుపత్రికి తరలించారు.

జరగాల్సిన ఆలస్యం అప్పటికే జరిగిపోయింది. ఆమెకు అరుదైన కిస్సింగ్ వైరస్ సోకిందన్న విషయాన్ని ఆలస్యంగా గుర్తించారు. కాళ్లను కదల్చలేని పరిస్థితుల్లోకి వెళ్లిపోయింది. ఆమెకు వైద్య పరీక్షలు చేసిన వైద్యులు ఆమె కిస్సింగ్ డీసీజ్ బారిన పడిన వైనాన్ని గుర్తించారు. ఈ వ్యాధికి గురైన వారి మెదడు వాచిపోయి.. పని చేయటం మానేస్తుంది. ఈ వ్యాధి సోకిన వెంటనే గుర్తించి వైద్యం చేస్తే ఫర్లేదు. ఏ మాత్రం ఆలస్యం చేసినా ప్రాణాలకే ముప్పు.

చివరి క్షణాల్లో అరియానా పిచ్చి పిచ్చిగా మాట్లాడిన వైనాన్ని తల్లిదండ్రుల్ని విపరీతమైన ఆవేదనకు గురి చేసింది. వారం ముందు వరకూ ఎంతో చలాకీగా ఉన్న తమ కుమార్తె చూస్తుండగానే తమను విడిచి వెళ్లిపోవటం.. తిరిగి రాని లోకాలకుపయనం కావటాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. పిల్లలకు ఏదైనా వ్యాధి సోకిన వెంటనే వైద్యుల్ని సంప్రదించాలే కానీ నిర్లక్ష్యం చేయొద్దని.. అలా చేయటం వల్లే తమ కుమార్తెను కోల్పోయినట్లుగా వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

కిస్సింగ్ డిసీజ్ ను వైద్య పరిభాషలో మోనోన్యుక్లియోసిస్ పొట్టిగా చెప్పాలంటే మోనోగా వ్యవహరిస్తారు. ఎప్ట్సీన్ బార్ వైరస్ కారణంగా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఇది ఎక్కువగా మనుషుల లాలాజలం నుంచి వ్యాపిస్తుంది. ఈ వ్యాధితో బాధపడే వ్యక్తిని ముద్దాడినా.. వారుతిన్న ఆహారం తిన్నా.. వారు తాగిన గ్లాసుల్ని ఉపయోగించిన ఈ వ్యాధి బారినపడతారు. ముద్దులతో అయితే మరింత త్వరగా ఇది సోకుతుంది. ప్రాశ్చాత్య దేశాల్లో నచ్చిన వారితో వెంటనే అధర చుంబనం మామూలే కావటంతో అరియానా కేసులో ఆమెకు ముద్దుతోనే ఈ అనారోగ్యాన్నికొని తెచ్చుకునే అవకాశం ఉందంటున్నారు. పైగా ఆమె టీనేజర్ కావటంతో అలాంటి అవకాశాలు ఎక్కువన్న వాదన ఉంది. కిస్సింగ్ డిసీజ్ చాలా సాధారణమైన వ్యాధి. సకాలంలో గుర్తిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ.. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణాలకే ప్రమాదంగా మారుతుంది. ప్రాణాల్ని తీసేస్తుంది. అరియానా విషయంలో ఇదే జరిగింది. సో.. ముద్దు తప్పు కాదు. కానీ.. షరతులు వర్తిస్తాయన్నది మర్చిపోవద్దు సుమా.