Begin typing your search above and press return to search.

కీలక పరిణామం.. కశ్మీర్ పై వెనక్కి తగ్గిన లేబర్ పార్టీ

By:  Tupaki Desk   |   13 Nov 2019 10:54 AM GMT
కీలక పరిణామం.. కశ్మీర్ పై వెనక్కి తగ్గిన లేబర్ పార్టీ
X
ఆర్టికల్ 370 నిర్వీర్యం చేస్తూ మోడీ సర్కారు తీసుకున్న సంచలన నిర్ణయంపై బ్రిటన్ లోని ప్రధాన ప్రతిపక్షం లేబర్ పార్టీ గడిచిన కొంత కాలంగా వ్యతిరేకిస్తూనే ఉంది. తాజాగా ఈ ఇష్యూ పై ఆ పార్టీ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇంతకాలం తాను వినిపించిన వాదనకు భిన్నమైన వాదన ను వినిపించటమే కాదు.. ఇక ముందు తాము కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించమని తేల్చి చెప్పింది.

కశ్మీర్ అంశం ద్వైపాక్షిక అంశమని.. ఇతర దేశాల వ్యవహారాల్లో తాము ఇక పై జోక్యం చేసుకోమని స్పష్టం చేసింది. బ్రిటన్ ప్రతిపక్షం ఎందుకిలాంటి నిర్ణయం తీసుకుంది? అన్న విషయం లోకి వెళితే.. విపక్ష లేబర్ పార్టీ వాదన పై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం కావటం తో పాటు.. బ్రిటన్ లోని భారతీయ వర్గాల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ పరిణామం తమకు నష్టం వాటిల్లేలా చేస్తుందన్న విషయాన్ని గుర్తించిన పార్టీ.. తాజాగా తమ దిద్దబాటును స్పష్టం చేశారు.

తమ పార్టీ వైఖరి కారణంగా బ్రిటన్ లోని వివిధ వర్గాల మధ్య చీలికలు రావాలని తాము కోరుకోవటం లేదని లేబర్ పార్టీ ఛైర్మన్ ఇయాన లావెరీ చేసిన వ్యాఖ్యను చూస్తే.. ఇష్యూ ఎంత సీరియస్ గా ఉందన్న విషయం ఇట్టే అర్థం కాక మానదు.

కశ్మీర్ ఇష్యూ లో లేబర్ పార్టీ వాదన ను ఆ దేశానికి చెందిన వారు మాత్రమే కాదు.. భారత్ కూడా తీవ్రంగా తప్పు పట్టింది. ఓటు బ్యాంకు ప్రయోజనాల కోసమే లేబర్ పార్టీ ఈ చర్యకు దిగిందని భారత విదేశాంగ శాఖ వ్యాఖ్యానించటం.. వివిధ వర్గాల నుంచి పెల్లుబుకుతున్న నిరసన నేపథ్యంలో కశ్మీర్ విషయం లో తన స్టాండ్ మార్చుకోవాలని లేబర్ పార్టీ ఫిక్స్ అయ్యింది. తాజా పరిణామం మోడీ సర్కారుకు మరో తలనొప్పిని తగ్గించిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.