Begin typing your search above and press return to search.

సీఎం చెప్పాడు - నేను ఆచరించాను..నాకేం సంబంధం లేదు!

By:  Tupaki Desk   |   29 Jan 2020 8:56 AM GMT
సీఎం చెప్పాడు - నేను ఆచరించాను..నాకేం సంబంధం లేదు!
X
కేరళలో బుధవారం ఉదయం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. కానీ , ఆలా సమావేశాలు ప్రారంభం అయ్యాయో లేదో .. వెంటనే సభలో గందరగోళం మొదలైంది. దేశవ్యాప్తంగా అమలు చేయడానికి కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం - జాతీయ పౌర నమోదు కార్యక్రమాలపై గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ - ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ మధ్య నెలకొన్న విభేదాలు అసెంబ్లీ సాక్షిగా బహిర్గతం అయ్యాయి. దీనితో గవర్నర్ మధ్యలోనే తన ప్రసంగాన్ని ఆపాల్సి వచ్చింది. అసలు సీఎం - గవర్నర్ మధ్య ఏం జరిగింది ...గవర్నర్ ఎందుకు తన ప్రసంగాన్ని మధ్యలో ఆపేసారు అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం..

కేరళ బుధవారం అసెంబ్లీ సమావేశాలలో ఆనవాయితీ ప్రకారం గవర్నర్ తన ప్రసంగాన్ని ఆరంభించారు. నిజానికి గవర్నర్ ప్రసంగ పాఠం - అందులో పొందుపరిచే అంశాలను మంత్రివర్గం రూపొందిస్తుంటుంది. ఏ రాష్ట్రంలోనైనా ఇదే తంతు పినరయి విజయన్ సారథ్యంలోని మంత్రివర్గం రూపొందించిన ప్రసంగ పాఠాన్ని శాసనసభలో చదువుతూ.. గవర్నర్ ఒక్కసారిగా తన ప్రసంగాన్ని ఆపేసారు. కారణం- పౌరసత్వ సవరణ చట్టం - జాతీయ పౌర నమోదుకు వ్యతిరేకంగా ఉండటమే.

ప్రసంగ పాఠంలోని 18వ పేరా వద్దకు వచ్చిన తరువాత - చదవడాన్ని ఆపి వేశారు. సభను ఉద్దేశించి మాట్లారు. ఇప్పుడు తాను చదవబోయే అంశాలు తన వ్యక్తిగతమైన అభిప్రాయం కాదని - ముఖ్యమంత్రి చదవమంటేనే తాను చదువుతున్నానని ఒక్క ముక్కలో తాను చెప్పదలచుకున్నది కుండబద్దలు కొట్టినట్టు చెప్పేసారు. ఇందులో ప్రభుత్వం తన అభిప్రాయాలను వెల్లడించిందని - దాన్ని తన అభిప్రాయంగా తీసుకోకూడదని చెప్పారు.

తాను చెప్పదలచుకున్నది చెప్పేసిన తరువాత గవర్నర్.. తన ప్రసంగాన్ని కొనసాగించారు. మనదేశ పౌరసత్వం అన్ని మతాల మీద ఆధారపడి లేదని అన్నారు. పౌరసత్వ సవరణ చట్టం - జాతీయ పౌర నమోదు కార్యక్రమాలకు వ్యతిరేకంగా తన ప్రభుత్వం ఇదివరకే ఓ తీర్మానాన్ని రూపొందించిందని - దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించిందని చెప్పారు. ఈ రెండు కార్యక్రమాలను తన రాష్ట్రంలో అమలు చేయబోదని హామీ ఇస్తోందని అన్నారు.

గవర్నర్ తన సొంత అభిప్రాయాలను వెల్లడించిన తరువాత.. అసెంబ్లీలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డు పడ్డారు ప్రతిపక్ష యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) సభ్యులు. పోడియం వద్దకు దూసుకెళ్లారు. ప్లకార్డులను ప్రదర్శించారు. రీ కాల్ గవర్నర్ అంటూ నినదించారు. ఆ సమయంలో స్పీకర్ పీ శ్రీరామకృష్ణన్, ముఖ్యమంత్రి పినరయి విజయన్.. గవర్నర్ పక్కనే ఉన్నారు. ప్లకార్డులను ప్రదర్శిస్తోన్న యూడీఎఫ్ సభ్యులను శాంతింపజేయడానికి వారు ప్రయత్నించారు. గవర్నర్ ప్రసంగాన్ని కొనసాగిచడంతో.. వారు సభ నుండి వాకౌట్ చేశారు. ఆ తరువాత యూడీఎఫ్ సభా పక్ష నేత రమేష్ చెన్నితల మీడియా సమావేశంలో మాట్లాడుతూ ..గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్.. రాజ్యాంగానికి కాకుండా.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రతినిధిగా, ఆయన పంపించిన దూతగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అలాగే ఆయనను వెంటనే రీకాల్ చేయాలని రమేష్ చెన్నితల డిమాండ్ చేశారు.