Begin typing your search above and press return to search.

ఏక్షణమైనా అరెస్టు.. గజగజ వణుకుతున్న జేసీ సోదరులు

By:  Tupaki Desk   |   10 March 2020 6:14 AM GMT
ఏక్షణమైనా అరెస్టు.. గజగజ వణుకుతున్న జేసీ సోదరులు
X
అనంతపురము రాజకీయాల్లో జేసీ కుటుంబం కీలకమైన పాత్ర పోషిస్తుంటుంది. అలాంటి కుటుంబానికి ప్రస్తుతం గడ్డు రోజులు వచ్చాయి. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జేసీ సోదరులు అవినీతి, అక్రమాలపై బెరడు తీస్తోంది. దీంతో మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, ఆయన సోదరుడు ప్రభాకర్ రెడ్డికి కష్టాల మీద కష్టాలు వస్తున్నాయి. తాజాగా వారు మరో కేసులో త్వరలోనే జైలుకెళ్లే అవకాశం కనిపిస్తోంది. మరో ఉచ్చు వారికి బలంగా బిగుసుకుంటోంది. ఆయనకు చెందిన ట్రావెల్స్, మైనింగ్ కంపెనీల అనుమతుల రద్దు తదితర వారికి కష్టాల్లో పడేయగా తాజాగా వారు గతం కేసులో ఇఫ్పుడు కటకటాలు లెక్కించే స్థాయికి చేరింది.

అనంతపురం జిల్లా తాడిపత్రిలో ప్రబోధానంద ఆశ్రమంపై 2018 సెప్టెంబర్ లో జేసీ సోదరుల అనుచరులు దాడి చేశారు. ఆ ఘటనలో వెయ్యి మందికి పైగా గాయపడగా, 40 వాహనాలు దగ్ధమయ్యాయి. ఆ సందర్భంలోనే రచ్చరచ్చ జరిగింది. పోలీసులతో జేసీ వాగ్వాదం పడ్డాడు. ఆ క్రమంలోనే అప్పటి సీఐ గోరంట్ల మాధవ్ తో సవాళ్ల మీద సవాళ్లు విసురుకున్నారు. ఆ తర్వాత పరిణామాలు మారిపోయాయి. జేసీ మాజీ ఎంపీ కాగా.. ఆయనను ఎదురించిన సీఐ మాధవ్ ఎంపీగా గెలవడం ఆసక్తికరం. అయితే ఆ గొడవతో వారిద్దరూ వాగ్వాదం పడ్డారో.. ఇప్పుడు ఆ కేసులో జేసీ సోదరులు త్వరలోనే జైలుకెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఎందుకంటే ఆశ్రమానికి చెందిన స్థలాన్ని కబ్జా చేసేందుకు జేసీ వర్గీయులు దాడికి దిగారని ఆధ్యాత్మిక గురువు ప్రబోధానంద ఆరోపించారు. ఆ దాడికి సంబంధించి పలు కేసులు నమోదవడంతో వాటిపై ఇప్పుడు చర్యలు మొదలయ్యాయి. ప్రబోధానంద ఆశ్రమంపై దాడి కేసును పోలీసులు వెలికితీసి విచారణ చేపట్టనున్నారు. ఈ క్రమంలో ఆ దాడిలో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేయగా ప్రధాన నిందితులు జేసీ సోదరుల్ని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని అనంతపురములో తీవ్ర చర్చ సాగుతోంది. అయితే ఈ విషయమై తాను కూడా భయాందోళన చెందుతున్నట్లు మాజీ ఎంపీ దివాకర్ రెడ్డే స్వయంగా సోమవారం మీడియాతో వెల్లబోసుకున్నారు.

కొత్త చట్టాలు తెచ్చినందుకు జగన్ కు జనం జేజేలు కొడుతున్నారని చెప్పారు. అయితే ఆ చట్టం అందరికీ వర్తిస్తేనే మంచిదని పేర్కొన్నారు. జగన్ దూకుడుకు తాను భయపడ్డానని, అందుకే స్థానిక ఎన్నికల్లో తమ వర్గం వాళ్లను పోటీకి దింపట్లేదని సంచలన ప్రకటన చేశారు. నిజానికి రాష్ట్రంలో వాస్తవ పరిస్థితులు వేరు.. ఓట్లు వేసేసరికి పరిస్థితులు వేరు.. రాష్ట్రంలోని అన్ని పార్టీలూ ఒక్కటైనా ప్రస్తుతం వైఎస్సార్సీపీని ఓడించలేవని జోస్యం చెప్పారు. స్థానిక ఎన్నికల్లో మావాడే గెలుస్తాడు.. అందులో తిరుగులేదు అని జేసీ దివాకర్ రెడ్డి జగన్ గురించి పేర్కొన్నారు.