Begin typing your search above and press return to search.

నూరు త‌ప్పులు స‌హించాం.. ఇప్పుడేం చేద్దాం.. వైసీపీలో హాట్ టాపిక్‌!

By:  Tupaki Desk   |   3 May 2021 2:30 AM GMT
నూరు త‌ప్పులు స‌హించాం.. ఇప్పుడేం చేద్దాం.. వైసీపీలో హాట్ టాపిక్‌!
X
వైసీపీ నేత‌ల మ‌ధ్య మ‌ళ్లీ ఆ పార్టీ ఎంపీ, రెబ‌ల్ నాయ‌కుడు ర‌ఘురామ‌కృష్ణ‌రాజు విష‌యం హాట్ టాపిక్‌గా మారింది. ``ఇన్నాళ్లు స‌హించాం. ఇప్పుడు ఏం చేద్దాం. ఎన్నె త‌ప్పులు మాత్రం కాస్తాం.. నూరో త‌ప్పు కూడా చేసేశాడు!``- అని నేత‌ల మ‌ధ్య తీవ్ర చ‌ర్చే సాగుతోంది. నిజానికి ఇప్పుడు ర‌ఘురామ రాజు.. ఏపీలో ఉండి ఉంటే.. ప‌రిస్థితి వేరేగా ఉండేది అని అంటున్నవారు కూడా క‌నిపిస్తున్నారు. గ‌డిచిన ఏడాదిన్న‌ర‌గా ఆయ‌న ఢిల్లీలోనే సెటిల్ అయ్యారు. అక్క‌డ నుంచి కాలు బ‌య‌ట‌కు తీయ‌డం లేదు. కొన్ని రోజుల కింద‌ట త‌న నియోజ‌క‌వ‌ర్గం న‌ర‌సాపురంలో ప‌ర్య‌టించాల‌ని అనుకుంటున్న‌ట్టు.. అయితే.. వైసీపీ నేత‌లు త‌న‌ను అడ్డ‌గించేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని.. పెద్ద ఎత్తున యాగీ చేశారు.

ఈ క్ర‌మంలో ఏకంగా డీజీపీకి కూడా లేఖ రాశారు. అదే స‌మ‌యంలో త‌న‌పై కొంద‌రు కేసులు పెట్టార‌ని, వాటి ఆధారంగా పోలీసులు త‌నను అరెస్టు చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఢిల్లీలో ఉండే.. ఏపీ హైకోర్టులో కేసు వేశారు. దీనిపై విచార‌ణ కూడా సాగుతోంది. ఇంత‌లో.. త‌న‌పై సీబీఐ అధికారులు బ్యాంకుల‌ను మోసం చేసిన కేసు న‌మోదు చేయ‌డంతో.. ఏకంగా ఆయ‌న సీఎం జ‌గ‌న్ బెయిల్‌ను ర‌ద్దు చేయాల‌ని కోరుతూ.. సీబీఐ కోర్టులో పిటిష‌న్ వేశారు. ఇదే ఇప్పుడు వైసీపీలో చ‌ర్చ‌నీయాంశంగా మారిపోయింది. మొద‌ట్లో లైట్ తీసుకున్న వైసీపీ సీనియ‌ర్లు కూడా ఇప్పుడు దీనిని సీబీఐ కోర్టు విచార‌ణ‌కు స్వీక‌రించ‌డంతో విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు.

ఈ పిటిష‌న్ అస‌లు విచార‌ణ‌కు కూడా రాద‌ని అనుకున్న వైవీ సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాస‌రెడ్డి త‌దిత‌రులు కూడా తాజా ప‌రిణామాల‌పై ఆక్రోశం వెళ్ల‌గ‌క్కుతున్నార‌ని తెలిసింది. ఈ నేప‌థ్యంలో పార్టీలో అత్యంత మోస్ట్ సీనియ‌ర్లుగా ఉన్న‌వారు.. ఇప్పుడు జ‌గ‌న్‌పై ఒత్తిడి పెంచుతున్నారు. ``నూరు త‌ప్పులు కూడా చేసేశాక‌.. మ‌నం ఉపేక్షిస్తే.. అది మ‌న బ‌ల‌హీన‌త అవుతుంది. పైగా ఇంకా వార్నింగులు ఇస్తున్నాడు. నాలిక‌ను అదుపు లో పెట్టుకోక‌పోతే.. అంతు చూస్తాన‌ని బెదిరిస్తున్నాడు.

సో.. ఇప్పుడు ఏదో ఒక‌టి చేసి.. రాజుకు చెక్ పెట్టాలి. ఈ విష‌యంలో మ‌నం ఎంత దూర‌మైనా వెళ్లాలి. అధికారంలో ఉండి కూడా చ‌ర్య‌లు తీసుకోక‌పోతే.. మ‌న‌పై అనేక విమ‌ర్శ‌లు హ‌ల్ చ‌ల్ చేస్తాయి. ముఖ్యంగా ప్ర‌తిప‌క్షాలు దీనిని అలుసుగా తీసుకుని మ‌రింత రెచ్చిపోయే ప్ర‌మాదం ఉంది. సో.. ఇప్ప‌టికైనా చ‌ర్య‌లు తీసుకోవాల్సిందే`` అని ఒత్తిడి పెంచుతున్నారు. ఇక ర‌ఘును క‌ట్ట‌డి చేయ‌క‌పోతే పార్టీలో మ‌రిన్ని ధిక్కార స్వ‌రాలు వ‌స్తాయ‌న్న సందేహం కూడా పార్టీ నేత‌ల్లో ఉంది. దీంతో ఈ విషయం వైసీపీలో హాట్ టాపిక్‌గా మారింద‌ని అంటున్నారు సీనియ‌ర్లు. మ‌రి జ‌గ‌న్ ఏం చేస్తారో చూడాలి.