Begin typing your search above and press return to search.

దొంగ ఓట్ల వ్యవహారం.. ఆ ఎమ్మెల్యేకు ఊరట!

By:  Tupaki Desk   |   12 May 2023 4:00 PM GMT
దొంగ ఓట్ల వ్యవహారం.. ఆ ఎమ్మెల్యేకు ఊరట!
X
దొంగ ఓట్లతో గెలిచిన వ్యవహారంలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద రావు కు ఊరట లభించింది.

2019 ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లా రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరఫున రాపాక వరప్రసాద రావు గెలుపొందిన సంగతి తెలిసిందే. మొదట్లో తాను జనసేన పార్టీలోనే ఏకైక ఎమ్మెల్యేగా గుర్తింపుతో ఉంటానని చెప్పిన రాపాక ఆ తర్వాత ప్లేటు ఫిరాయించి వైసీపీ తో అంటకాగుతూ వస్తున్నారు. తన కుమారుడి ని కూడా వైసీపీలో చేర్పించారు. పలు సభలు, సమావేశాల్లోనూ మెడలో వైసీపీ జెండాలతో రాపాక కనిపించారు.

ఇలా ఒకసారి కార్యకర్తలతో ఒక సమావేశంలో మాట్లాడుతూ తాను దొంగ ఓట్లతోనే గెలిచానంటూ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో అప్పట్లో రాష్ట్రమంతా వైరల్‌ అయ్యింది. రాపాక చేసిన వ్యాఖ్యల పై రాజోలు నియోజకవర్గం కేశవదాసుపాలెం కు చెందిన ఎనుముల వెంకటపతి రాజు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే రాపాక పై చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ ఫిర్యాదు పై స్పందించిన ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌ కుమార్‌ మీనా.. రాపాక ఉదంతం పై సమగ్ర నివేదిక ఇవ్వాలని డాక్టర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా కలెక్టర్‌ కు ఆదేశాలు జారీ చేశారు. వారం రోజుల్లో ఈ నివేదిక సమర్పించాలని సూచించారు.

రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ అంతర్వేదిలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ తాను గతంలో సర్పంచ్‌ గా గెలిచినప్పుడు దొంగ ఓట్లతో గెలిచానని సంచలన వ్యాఖ్యలు చేశారు.

చింతలమోరి గ్రామంలో తన ఇంటి వద్ద పోలింగ్‌ బూత్‌ లో తనకు దొంగ ఓట్లు పడేవని తెలిపారు. తన అనుచరులు ఒక్కొక్కరు పదేసి దొంగ ఓట్లు వేసేసేవారన్నారు. దీంతో తనకు చింతలమోరి గ్రామంలో ఏడు నుంచి ఎనిమిది వందల వరకు మెజారిటీ వచ్చేదంటూ రాపాక వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో అప్పట్లో వైరల్‌ అయ్యింది.

ఈ నేపథ్యంలో రాపాక వరప్రసాద్‌ వ్యాఖ్యల పై రాష్ట్ర ఎన్నికల సంఘం విచారణ కు ఆదేశించడంతో ఆయన చిక్కుల్లో పడ్డారు. కాగా 2009లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున రాజోలులో గెలిచిన రాపాక 2014లో ఓటమి పాలయ్యారు. 2019లో వైసీపీ తరఫున సీటు దక్కకపోవడంతో జనసేన నుంచి గెలిచి ఎమ్మెల్యే అయ్యారు.

ఎమ్మెల్యే రాపాక ఎన్నిక పై ఫిర్యాదు పై రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కలెక్టర్‌ విచారణ పూర్తి చేశారు. రాపాక వరప్రసాద్‌ తో పాటుగా మరో ఎనిమిది మందిని విచారణ చేసి, వీరి నుంచి లిఖితపూర్వక వివరణ తీసుకున్నారు. విచారణలో గత ఎన్నికల్లో తాము అసలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ కు ఓట్లు వేయలేదని వైసీపీ కార్యకర్తలు తెలిపారు. తాము వైసీపీ కార్యకర్తలమని, అలాంటిది జనసేన తరపున పోటీ చేసిన రాపాకు ఏ విధంగా దొంగ ఓట్లు వేస్తామని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ వివాదంపై పూర్తిస్థాయి నివేదికను కలెక్టర్‌ ఎన్నికల కమీషన్‌ కు అందజేయనున్నారు.