Begin typing your search above and press return to search.

9 నెలల గర్భిణిపై సచివాలయ సిబ్బంది తీరుకు జగన్ సర్కారుకు కొత్త చిక్కు

By:  Tupaki Desk   |   24 Jan 2023 4:00 PM GMT
9 నెలల గర్భిణిపై సచివాలయ సిబ్బంది తీరుకు జగన్ సర్కారుకు కొత్త చిక్కు
X
రూల్ బుక్ ను ఫాలో కావటం తప్పేం కాదు. కానీ.. కొన్ని సందర్భాల్లో రూల్ బుక్ తో పాటు.. మెదడును కూడా వాడాల్సిన అవసరం. అలాంటివి మర్చిపోయే ఉద్యోగుల తీరుతో ప్రభుత్వానికి కొత్త కష్టాలు ఎదురవుతుంటాయి.

తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి ఏపీలో చోటు చేసుకుంది. ఎవరేం అనుకున్నా.. జగన్ ప్రభుత్వం చేపట్టిన బ్రహ్మాండమైన కార్యక్రమాల్లో ముఖ్యమైనది.. కీలకమైనది గ్రామాల వారీగా ఏర్పాటు చేసిన సచివాలయాలు. నిజానికి ఈ వ్యవస్థను సరైన తీరులో వినియోగించుకోవాలే కానీ.. పాలనా రథం పరుగులు తీయటంలో సచివాలయాలు కీలక భూమిక పోషిస్తుందని చెప్పక తప్పదు.

అలాంటి సచివాలయాలకు సంబంధించి కొందరు సిబ్బంది వ్యవహరించే తీరు కొత్త తలనొప్పులకు తావిస్తుంది. అలాంటి ఉదంతమే ఉమ్మడి కర్నూలు జిల్లా (ప్రస్తుతం నంద్యాల జిల్లా) డోన్ మండల పరిధిలో చోటు చేసుకుంది. ఆర్నెల్ల క్రితం భర్తను పోగొట్టుకున్న బాధితురాలు (లాల్ బీ) తొమ్మిది నెలల గర్భిణిగా గ్రామ సచివాలయానికి వెళ్లటం.. అక్కడి సిబ్బంది ఆమె సమస్యను సానుభూతితో వినే కన్నా.. యంత్రం మాదిరి వ్యవహరించిన వైనంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

డోన్ మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన లాల్ బీ అనే మహిళ భర్త అల్లాబాకష్. అతడు ఆర్నెల్ల క్రితం మరణించాడు. ఇప్పటికే ఆమెకు మూడేళ్ల కుమార్తెతో పాటు.. మరో బిడ్డ కడుపులోఉన్నారు. దీంతో.. వీరిని పెంచటం ఆమెకు భారంగా మారింది. దీంతో.. ఆమె ఉపాధిని వెతుక్కుంటూ డోన్ పట్టణానికి వెళ్లింది. అక్కడ అద్దెకు ఉంటూ కూతుర్ని పోషించుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వం అందించే వితంతు పింఛన్ వస్తే తనకున్న కష్టాలు కొంతమేర పరిష్కారం అవుతాయన్న ఆశతో సచివాలయం చుట్టూ తిరుగుతున్నారు. భర్త పోయిన తర్వాత నుంచి ఆమె నెలల తరబడి తిరుగుతున్నా పట్టించుకోవటం లేదు.

డోన్ సచివాలయానికి వెళితే కొత్తపల్లి వెళ్లాలని.. అక్కడికి వెళితే డోన్ కు వెళ్లాలంటూ గ్రామ సచివాలయ సిబ్బంది తిప్పుతున్నారే తప్పించి తన సమస్యను పరిష్కరించటం లేదన్న ఆవేదననను వ్యక్తం చేస్తుంది. ఆమె ఉదంతం మీడియాలోకి రావటంతో ఇప్పుడు గ్రామ సచివాలయ సిబ్బంది పని తీరు మీద చర్చ మొదలైంది.

జగన్ సర్కారును వేలెత్తి చూపించేందుకు వీలుగా తాజా ఉదంతం ఉంది. తొమ్మిది నెలల గర్భిణి వితంతు ఫించన్ సాయం కోసం వస్తే.. తిప్పుంచుకోవటమే తప్పించి తిప్పలు తప్పేలా సచివాలయ సిబ్బంది వ్యవహరించటం లేదన్న మాట ఇప్పుడు షాకింగ్ గా మారింది. ఇలాంటి విషయాల్లో ప్రభుత్వం స్పందించి బాధితురాలి పక్షాన నిలిస్తే కొంతలో కొంత డ్యామేజ్ కంట్రోల్ అయ్యే వీలుంది. మరి.. జగన్ సర్కారుకు ఇలాంటి అంశాలు వినిపిస్తాయా?