Begin typing your search above and press return to search.

అప్పుడేమో జ‌గ‌న్ ధ‌ర్నా.. మ‌రి ఇప్పుడు

By:  Tupaki Desk   |   2 Dec 2021 7:30 AM GMT
అప్పుడేమో జ‌గ‌న్ ధ‌ర్నా.. మ‌రి ఇప్పుడు
X
ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌పుడు అధికార పార్టీ వైఫ‌ల్యాల‌పై.. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై ప్ర‌త్య‌ర్థి పార్టీలు గొంతెత్తుతాయి. ప్ర‌జ‌ల ప‌క్షాల నిల‌బ‌డి పోరాటం చేస్తాయి. ఆందోళ‌న‌లు ధ‌ర్నాల‌తో అధికార ప‌క్షాన్ని ఇర‌కాటంలో పెట్టేందుకు ప్ర‌య‌త్నిస్తాయి. ప్ర‌భుత్వంలో ఉన్న పార్టీ స‌రిగ్గా ప‌నిచేసేలా ఇలా ప్ర‌త్య‌ర్థి పార్టీలు వ్య‌వ‌హ‌రించ‌డంలో త‌ప్పు లేదు. కానీ అప్పుడు ప్ర‌తిప‌క్షంలో ఉండి ఏ స‌మ‌స్య ప‌రిష్కారం కోస‌మైతే పోరాటం చేశారో.. ఇప్పుడు అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత దాన్ని ప‌ట్టించుకోక‌పోవ‌డం ఏ మాత్రం స‌రికాదు. ఇప్పుడు ఏపీలో జ‌గ‌న్ స‌ర్కారు అలాగే నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌నే విశ్లేష‌కులు అంటున్నారు.

2019 ఎన్నిక‌ల్లో విజ‌యం కోసం.. అధికారంలో ఉన్న చంద్ర‌బాబును గ‌ద్దె దించ‌డం కోసం.. వైసీపీ ఎన్ని ఎత్తులు వేసిందో తెలిసిందే. అందుబాటులో ఉన్న అన్ని ర‌కాల వ‌న‌రులు వాడుకుని టీడీపీ ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త‌ను క్యాష్ చేసుకుని జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయ్యారు. ప్ర‌కాశం, శ్రీకాకుళం జిల్లాలో ఫ్లోరైడ్ వాట‌ర్ స‌మస్య ఉంది. అది పెద్ద స‌మ‌స్య‌. దాని కోసం బాబు ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో జ‌గ‌న్ పెద్ద ఎత్తున పోరాటం చేశారు. ప్ర‌కాశం జిల్లా పీసీ ప‌ల్లీలో పెద్ద ఎత్తున ధ‌ర్నా కూడా చేశారు. కానీ అప్పుడు ఆ స‌ర్కారు దాన్ని ప‌ట్టించుకోలేదు. పోనీ బాబు ప‌ట్టించుకోక‌పోయినా గ‌తంలో ఆ స‌మ‌స్య కోసం పోట్లాడిన జ‌గ‌న్ సీఎం అయ్యాక దానిపై దృష్టి పెడ‌తార‌ని ప్ర‌జ‌లు అనుకున్నారు. కానీ వాళ్ల‌ను నిరాశే ఎదుర‌వుతోంది.

జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ ఆ స‌మ‌స్య గురించి ఒక్క‌సారి కూడా స‌మీక్షించ‌లేదు. ప్ర‌కాశం జిల్లా మంత్రులు కూడా దాని గురించి సీఎం ద‌గ్గ‌ర ప్ర‌స్తావించ‌డం లేదు. ఇక ఎమ్మెల్యేల‌కైతే ఆ విష‌యం మాట్లాడేందుకు అపాయింట్‌మెంట్ కూడా దొర‌క‌డం లేద‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అదే ఎమ్మెల్యేల పిల్ల‌ల పెళ్లిల్ల ఆహ్వాన ప‌త్రాలు ఇచ్చేందుకు మాత్రం స‌మ‌యం ఇస్తున్నారు. కానీ ఎంతో ముఖ్య‌మైన ప్ర‌జా స‌మ‌స్య కోసం చ‌ర్చించ‌డానికి మాత్రం అపాయింట్‌మెంట్ ఇవ్వ‌డం లేదని ఆ జిల్లా ప్ర‌జ‌లు మాట్లాడుకుంటున్నారు. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌పుడు త‌మ సమ‌స్య కోసం పోరాడ‌తాన‌నే న‌మ్మ‌కాన్ని క‌లిగించిన జ‌గ‌న్‌.. ఇప్పుడు అధికారంలో ఉన్న‌ప్ప‌టికీ ప‌ట్టించుకోక‌పోవ‌డంతో వాళ్లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రింత వ్య‌తిరేక‌త రాక‌ముందే జ‌గ‌న్ క‌ళ్లు తెరిచి ఈ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చూపిస్తే మేల‌నే రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు.