Begin typing your search above and press return to search.

వాగులో విగ్ర‌హం ప్ర‌త్య‌క్షం.. గంగ‌మ్మ త‌ల్లేన‌ని సంబ‌రాలు!

By:  Tupaki Desk   |   18 July 2021 8:46 AM GMT
వాగులో విగ్ర‌హం ప్ర‌త్య‌క్షం.. గంగ‌మ్మ త‌ల్లేన‌ని సంబ‌రాలు!
X
మ‌న దేశంలో దేవుడిపై ఉన్న న‌మ్మ‌కం ఏ స్థాయిలో ఉంటుందో తెలిసిందే. అరుదైన విష‌యం ఏది జ‌రిగినా.. దాని వెన‌క ఏదో ఒక అదృశ్య శ‌క్తి ఉంద‌ని న‌మ్ముతుంటారు. మ‌రికొంద‌రు ఒక అడుగు ముందుకు వేసి పూజ‌లు, పున‌స్కారాలు నిర్వ‌హిస్తుంటారు. నెల్లూరు జిల్లాలో ఇలాంటి ఘ‌ట‌నే ఒక‌టి వెలుగు చూసింది. ఆ జిల్లాలో కురుస్తున్న భారీ వ‌ర్షాల కార‌ణంగా వాగులు, వంక‌లు పొంగి పొర్లుతున్నాయి.

ఈ క్ర‌మంలో నెల్లూరు జిల్లాలోని కొడ‌వ‌లూరు మండ‌లం గండ‌వ‌రం గ్రామస‌మీపంలోని పైడేరు వాగులో ఓ విగ్ర‌హం ప్ర‌త్య‌క్ష‌మైంది. ఈ వ‌ర‌ద‌ల్లో ఎక్క‌డి నుంచి కొట్టుకొచ్చిందో తెలియ‌దుగానీ.. ఆ ప్రాంతంలోకి వ‌చ్చి ఆగిపోయింది. అది కూడా.. ఎవ‌రో ప్ర‌తిష్టించిన‌ట్టుగా ఉండ‌డంతో.. సాక్షాత్తూ గంగ‌మ్మ త‌ల్లే త‌మ గ్రామానికి వ‌చ్చిందంటూ సంబ‌రాలు చేసుకుంటున్నారు స్థానికులు.

తొలుత గ్రామానికి చెందిన పిల్ల‌లు కొంద‌రు ఈ విగ్ర‌హాన్ని చూసిన‌ట్టుగా చెబుతున్నారు. ఈ విష‌యం పెద్ద‌ల‌కు చెప్ప‌డంతో.. అది వెంట‌నే అంద‌రికీ పాకింది. దీంతో.. ఆ విగ్ర‌హాన్ని చూసేందుకు జ‌నాలంతా ఆ వాగు వ‌ద్ద‌కు వెళ్లి వ‌స్తున్నారు. కొంద‌రు ఈ విగ్ర‌హం సాక్షాత్తూ గంగ‌మ్మ త‌ల్లి మ‌హిమేన‌ని దండాలు పెడుతున్నారు. త‌మ గ్రామం మీద చ‌ల్ల‌ని చూపు చూసేందుకు వ‌చ్చింద‌ని ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. వ‌ర‌ద పొంగుతున్నా.. ఉన్న చోటు నుంచి క‌ద‌ల‌క‌పోవ‌డానికి కార‌ణం ఇదేన‌ని చెబుతున్నారు.

అయితే.. మ‌రికొంద‌రు మాత్రం ఇదంతా కొట్టిప‌డేస్తున్నారు. వ‌ర్సాలు భారీగా వ‌స్తున్నందున.. ఎక్క‌డి నుంచో ఈ విగ్ర‌హం కొట్టుకొచ్చి ఉంటుంద‌ని చెబుతున్నారు. గ్రామ‌స్తులు మాత్రం.. త‌మ‌ను క‌రుణించ‌డానికి వ‌చ్చిన గంగ‌మ్మ దేవ‌త‌గా ప్రార్థిస్తున్నారు.