Begin typing your search above and press return to search.

యోగి మాష్టారికి వచ్చే ఐడియాలు తెలుగు సీఎంలకు రావట్లేదా?

By:  Tupaki Desk   |   14 July 2021 3:09 AM GMT
యోగి మాష్టారికి వచ్చే ఐడియాలు తెలుగు సీఎంలకు రావట్లేదా?
X
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఏమైంది? గతంలో ఒకరికి మించి మరొకరు పోటీ పడ్డట్లుగా ప్రకటనలు చేసేవారు. సంక్షేమ పథకాల్ని.. ఊహకు అందని రీతిలో వినూత్న కార్యక్రమాల్ని ప్రకటించేవారు. అలాంటి ముఖ్యమంత్రులకు ఏమైందన్న అనుమానం కలిగే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత.. మిగిలిన రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల వైపు చూసేలా ప్రోగ్రాంలను ప్రకటించేవారు. బ్యాచుల వారీగా తెలుగు రాష్ట్రాలకు వచ్చి వివిధ అంశాల మీద అధ్యయనం చేసుకోవటంతో పాటు.. ముఖ్యమంత్రులు తీసుకుంటున్న నిర్ణయాలు.. వాటికి వస్తున్న సానుకూల ఫలితాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తుండే వారు. అంతే కాదు.. ఏదైనా ఈవెంట్ జరిగేటప్పుడు.. ప్రోత్సాహాకాల్ని ప్రకటించాలంటే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముందుండేవారు. అందుకు భిన్నమైన పరిస్థితి ఇప్పుడు చోటు చేసుకుంటోంది.

అక్కడెక్కడో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రులు స్పందిస్తున్న ఉదంతాలపై.. ఆలస్యంగా స్పందించే పరిస్థితి ఇటీవల కాలంలో ఏర్పడుతోంది. ఎందుకిలా? అనే ప్రశ్నకు ఎవరూ సమాధానం చెప్పలేకపోతున్నారు. తాజాగా ప్రకటించిన ఈ నిర్ణయాన్ని చూస్తే.. రెండు తెలుగు రాష్ట్రాల పాలకుల్లో వచ్చిన మార్పు కనిపిస్తుందన్న మాట వినిపిస్తోంది. తాజాగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ ఊహించని రీతిలో ప్రకటన చేసి.. అందరిని అవాక్కు అయ్యేలా చేశారు. ఎవరైతే మొదట స్పందించారో.. వారికి ఇవ్వవాల్సిన క్రెడిట్ ఇవ్వకుండా ఉండలేని పరిస్థితి.

ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టోక్యో 2020 ఒలంపిక్స్ లో పతకాలు సాధించే క్రీడాకారులకు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆసక్తికర ప్రకటన చేశారు. ఈ విశ్వ క్రీడల్లో వ్యక్తిగత ఈవెంట్లలో బంగారు పతకం సాధించిన వారికి రూ.6కోట్లు.. వెండి పతకం సాధించిన వారికి రూ.4 కోట్లు.. కాంస్య పతకం సాధించిన వారికి రూ.2 కోట్ల పారితోషికం ఇస్తామన్న ప్రకటన చేసి దేశీయ క్రీడాకారుల్లో కొత్త స్పూర్తిని నింపటానికి ఆయన ప్రకటన సాయం చేస్తుందని చప్పక తప్పదు. అంతేకాదు.. టీం ఈవెంట్లలో బంగారు పతకాన్ని సొంతం చేసుకుంటే రూ.3కోట్లు..సిల్వర్ మెడల్ సాధించేవారికి రూ.2 కోట్లు.. కాంస్యం సాధించే వారికి రూ.కోటి చొప్పున ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

అంతేకాదు.. టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొనే ప్రతి యూపీ క్రీడాకారుడికి రూ.10 లక్షలు చొప్పున నజరానాను ప్రకటించిన తనదైన మార్కును ప్రదర్శించారని చెప్పాలి. ఇప్పటికే ప్రకటించిన ఈ విధానంలో ఆటగాళ్లు పతకం తెచ్చినా.. తేకున్నా.. వారికి ఇవ్వాల్సిన నజరానాను యోగి సర్కారు ఇస్తుందని స్పష్టం చేశారు. వాస్తవానికి ఈ తరహా ప్రకటనల్ని కేంద్రం ఇస్తే బాగుండేది. అందుకు భిన్నంగా యూపీ సీఎం యోగి నాలుగు అడుగులు ముందుకేసి.. మిగిలిన వారికి అవకాశం ఇవ్వకుండా.. తానే మొత్తం క్రెడిట్ దోచేసేలా ఆయన నిర్ణయం ఉందన్న మాట వినిపిస్తోంది. ఇలాంటి ఐడియాలు మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఈ మధ్యన ఎందుకు రావట్లేదు చెప్మా?