Begin typing your search above and press return to search.

14 ఏళ్ల తర్వాత పాక్ లోకి అడుగు పెట్టిన దిగ్గజ క్రికెట్ జట్టు

By:  Tupaki Desk   |   17 Jan 2021 3:59 AM GMT
14 ఏళ్ల తర్వాత పాక్ లోకి అడుగు పెట్టిన దిగ్గజ క్రికెట్ జట్టు
X
ఆ రెండు దేశాల మధ్య ఎలాంటి పంచాయితీలు లేవు. ఆట ఆడేందుకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. కానీ.. సదరు జట్టు.. ఆ దేశంలో క్రికెట్ మ్యాచ్ ఆడేందుకు ఏకంగా పద్నాలుగు సంవత్సరాల సమయం తీసుకోవటం ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఆ జట్టు ఏదంటారా? అక్కడికే వస్తున్నాం. దక్షిణాఫ్రికా జట్టు.. సుదీర్ఘ విరామం తర్వాత పాకిస్తాన్ లోకి అడుగుపెట్టింది.

పాక్ తో రెండు టెస్టులు.. మూడు టీ20లు ఆడేందుకు క్వింటన్ డికాక్ నాయకత్వంలో సౌతాఫ్రికా జట్టు కరాచీలో అడుగు పెట్టింది. అప్పుడెప్పుడో 2007లో ఈ రెండు జట్లు పాక్ వేదికగా టెస్టు సిరీస్ ఆడగా.. దక్షిణాఫ్రికా 1-0 తో సిరీస్ ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత 2009లో శ్రీలంక జట్టు ప్రయాణిస్తున్న బస్సుపై తీవ్రవాదులు బాంబు దాడి చేయటంతో క్రికెట్ జట్లు.. ఆ దేశంలో మ్యాచులు ఆడేందుకు ఆసక్తిని చూపించలేదు. ఆ మాటకు వస్తే.. పాక్ జట్టుతో ఆడతాం కానీ.. పాకిస్తాన్ లో మాత్రం ఆడమని తేల్చేశాయి.

దీంతో.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సిరీస్ లు నిర్వహించాయి. అక్కడే పాక్ - సౌతాఫ్రియా జట్లు రెండు సార్లు టెస్టు సిరీస్ ఆడాయి. ప్రస్తుతం మాత్రం సౌతాఫ్రికా జట్టు పాకిస్తాన్ లో అడుగు పెట్టింది. ఈ నెల 26న టెస్టు మ్యాచ్ తో మొదలయ్యే సిరీస్.. ఫిబ్రవరి 14న జరిగే మూడో టీ20 మ్యాచ్ తో వారి పర్యటన ముగుస్తుంది. సుదీర్ఘ విరామం తర్వాత పాక్ లో ఆడుతున్న సౌతాఫ్రికా జట్టుకు ఎలాంటి అనుభవాలు ఎదురు కానున్నాయో చూడాలి.