Begin typing your search above and press return to search.

ఎక్కడైనా బావే కానీ అక్కడ మాత్రం కాదు!

By:  Tupaki Desk   |   19 Nov 2022 6:36 AM GMT
ఎక్కడైనా బావే కానీ అక్కడ మాత్రం కాదు!
X
ఎక్కడైనా బావ బావే కానీ వంగ తోట కాడ మాత్రం కాదనే సామెతను రుజువు చేస్తున్నాయి.. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు. ఎన్నికల్లో ఒకే కుటుంబానికి చెందినవారు పోటీ చేయడం కొత్తేమీ కాదు. అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు, తల్లీకొడుకులు, తల్లీకూతుళ్లు, తండ్రీకొడుకులు, భార్యాభర్తలు ఇలా చాలా రాష్ట్రాల్లో ఇప్పటివరకు పోటీ చేశారు.. చేస్తూనే ఉన్నారు.

తాజాగా బీజేపీ పాలిత గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. అక్కడ 182 స్థానాలకు డిసెంబర్‌ 1, 5 తేదీల్లో పోలింగ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అన్ని పార్టీలు ఉధృత ప్రచారం చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో భార్యాభర్తలు వేర్వేరు పార్టీల నుంచి ఒకే నియోజకవర్గంలో బరిలోకి దిగారు. దీంతో ఈ నియోజకవర్గం గుజరాత్‌ అంతా సంచలనంగా మారింది. అంతేకాకుండా భార్యాభర్తలిద్దరు బద్ద శత్రువుల్లా తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేసుకుంటూ ప్రచారం చేస్తుండటంతో మంచి రంజులో రాజకీయం నడుస్తోంది.

వివరాల్లోకెళ్తే.. గుజరాత్‌లోని కలోల్‌ స్థానం నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరఫున ప్రభాత్సింగ్‌ చౌహాన్‌ 1980, 85లో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1995 ఆయన బీజేపీలోకి ఫిరాయించి మూడు పర్యాయాలు ఆ పార్టీ తరఫున కలోల్‌ నుంచే విజయం సాధించారు. రెండుసార్లు ఎంపీగానూ గెలిచారు.

అయితే ఆయన ఎంపీగా కంటే ఎమ్మెల్యేగా పోటీ చేయడమే ఇష్టం. అయితే బీజేపీ టికెట్‌ను ప్రభాత్‌ సింగ్‌ భార్య రంగేశ్వరి బెన్‌ రత్తాకు ఇచ్చింది. దీంతో ప్రభాత్‌ సింగ్‌ తిరిగి తన సొంత గూడు కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీ టికెట్‌ను దక్కించుకున్నారు.

ఈ నేపథ్యంలో గుజరాత్‌లో రెండు ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌ తరఫున పోటీచేస్తున్న భార్యాభర్తలు రంగేశ్వరి బెన్‌ రత్తా, ప్రభాత్‌ సింగ్‌ తమ ప్రచారాన్ని ఉదృతంగా నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు.

రంగేశ్వరి బెన్‌ తన ప్రచారంలో తన భర్త, ఎన్నికల్లో తన ప్రత్యర్థి అయిన ప్రభాత్‌ సింగ్‌ను తిట్టిపోస్తోంది. తన భర్త తాగుబోతని.. అతడికి ఓటు వేయొద్దని, తనకు ఓట్లేసి గెలిపించాలని కోరుతోంది.

ఇక తన భార్య రంగేశ్వరి బెన్‌పై కాంగ్రెస్‌ తరఫున పోటీ చేస్తున్న ఆమె భర్త ప్రభాత సింగ్‌ సైతం తానేమీ తక్కువ తినలేదన్నట్టుగా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తన భార్య రంగేశ్వరి మంచిది కాదని.. ఆమెకు కూర వండటం కూడా చేత కాదని మండిపడుతున్నారు. కూర కూడా వండటం రాని తన భార్య రంగేశ్వరి ప్రజలకేం మేలు చేస్తుందో ఆలోచించాలని ఆయన ఓటర్లను కోరుతుండటం విశేషం.

ఇలా కలోల్‌ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం మంచి రంజుగా సాగుతోంది. భార్యాభర్తలు వేర్వేరు పార్టీల తరఫున పోటీ చేస్తూ వేర్వేరుగా ప్రచారం చేస్తూ తిట్టుకుంటూ ఉండటంతో ప్రజలు కూడా వీరి సభలకు పెద్ద ఎత్తున హాజరవుతున్నారు. రాజకీయం తెలిసినవాళ్లు మాత్రం ఎక్కడైనా బావ బావే కానీ వంగ తోట కాడ కాదని చెప్పుకుంటున్నారు.

అయితే ప్రచారం ముగిసి రాత్రి కాగానే మళ్లీ యథావిధిగా భార్యాభర్తలిద్దరూ పగలంతా తిట్టుకుని.. రాత్రికి కలిసిపోయే సాధారణ మొగుడు పెళ్లాంలా తమ ఇంటికి వెళ్లిపోయి ఇద్దరూ ఒకే కంచం, మంచం అనే రీతిలో వ్యవహరిస్తున్నారట. దీంతో ముక్కు మీద వేలేసుకోవడం ప్రజల వంతవుతోందని చెప్పుకుంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.