Begin typing your search above and press return to search.

ఏపీలో మంత్రి పదవి కోసం ఇప్పట్నుంచే వేట.. దక్కేది ఎవరికి?

By:  Tupaki Desk   |   14 March 2021 12:30 AM GMT
ఏపీలో మంత్రి పదవి కోసం ఇప్పట్నుంచే వేట.. దక్కేది ఎవరికి?
X
మంత్రిగా పిలిపించుకోవాల‌ని ఎవ‌రికి మాత్రం ఉండ‌దు చెప్పండి? అయితే.. కావాల‌ని కోరుకునేవారు రెండు ర‌కాలుగా ఉంటారు. ఇస్తే తీసుకునువారు ఒక‌ర‌క‌మైతే.. ఇప్పించుకునేవారు రెండో ర‌కం. స‌హ‌జంగా ఈ రెండోర‌క‌మే మెజారిటీగా ఉంటారు. దీనికోసం వారు చేయ‌ని ప్ర‌య‌త్నం ఉండ‌దు.. ఉప‌యోగించ‌ని అస్త్రం ఉండ‌దు.. సామాజిక వ‌ర్గం కార్డు నుంచి స‌న్నిహితులం అనే వైల్డ్ కార్డ్ వ‌ర‌కూ అన్నీ వాడేస్తారు. అయిన‌ప్ప‌టికీ.. ఆ ఛాన్స్ కొంద‌రికే ద‌క్కుతుంది. ప్ర‌య‌త్నాలు మాత్రం అంద‌రూ చేస్తారు. ఇప్పుడు ఏపీలో ఇదే త‌ర‌హా ట్ర‌య‌ల్స్ న‌డుస్తున్నాయ‌ని టాక్‌.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఈ ఏడాది చివ‌రి లోపే మంత్రివ‌ర్గ పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ ఉంటుంద‌నే ప్ర‌చారం కొన‌సాగుతోంది. వాస్త‌వానికి తొలిమంత్రి వ‌ర్గ‌విస్త‌ర‌ణ స‌మ‌యంలోనే ప‌దువులు ఇచ్చిన వారికి రెండున్న‌రేళ్లే అని చెప్పార‌ట ముఖ్య‌మంత్రి. ఈ మేర‌కు ఎప్ప‌టి నుంచో చ‌ర్చ‌ల్లో ఉంది. ఇక ఆ స‌మ‌యం రాబోతోంద‌ని, కాబ‌ట్టి త్వ‌ర‌లో మంత్రివ‌ర్గ ప్ర‌క్షాళ‌న చేస్తార‌నే డిస్క‌ష‌న్ రాజకీయ‌వ‌ర్గాల్లో సాగుతోంది.

అయితే.. కొన‌సాగుతున్న ప్ర‌చారం ప్ర‌కారం మంత్రివ‌ర్గ ప్ర‌క్షాళ‌న జ‌రిగితే దాదాపు తొంభై శాతం మందిని ప‌క్క‌న పెడ‌తార‌నే వార్త హ‌ల్ చ‌ల్ చేస్తోంది. కొత్త‌వారికి చోటు ఇవ్వాల‌నే ఆలోచ‌న‌తోపాటు.. ఉన్న‌వారి ప‌నితీరు, వారి వ్య‌వ‌హార‌శైలి కూడా ముఖ్య‌మంత్రి ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటార‌ని అంటున్నారు. ఇవ‌న్నీ బేరీజు వేసుకున్న త‌ర్వాత శాఖ‌ల కేటాయింపు ఉంటుంద‌ని చెబుతున్నారు.

కాగా.. ఇటీవ‌ల కొంద‌రు మంత్రులను ప‌రిశీలిస్తే వ‌రుస‌గా నెగెటివ్ అంశాల‌తో వార్త‌ల్లో నిలిచారు. గుమ్మునూరు జ‌య‌రాంపై భూముల విష‌య‌మై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. కొడాలి నాని పేకాట క్ల‌బ్బుల వివాదం వెంటాడింది. వెల్లంప‌ల్లి శ్రీనివాస్ పై దేవాదాయ శాఖ‌లో అవినీతి అనే ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఇలాంటి వారు ఆ తొంభై శాతం జాబితాలో ఉంటార‌ని కూడా అంటున్నారు కొంద‌రు.

ఇలాంటి వార్త‌ల నేప‌థ్యంలో మంత్రి సీటుపై ముందుగానే క‌ర్చీఫ్ వేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు కొంద‌రు ఆశావ‌హులు. వీరిలో రంప‌చోడ‌వ‌రం ఎమ్మెల్యే క‌ర‌ణం ధ‌ర్మ‌శ్రీ, మ‌రొక‌రు అన‌కాప‌ల్లి ఎమ్మెల్యే గుడివాడ అమ‌ర్నాథ్‌ ముందు వ‌ర‌స‌లో ఉన్నారు. క‌ర‌ణం ధ‌ర్మ‌శ్రీ వైఎస్ కాలం నుంచీ ఆయ‌న స‌న్నిహితుడిగా ఉన్నారు. ఆ త‌ర్వాత మొద‌టి నుంచీ జ‌గ‌న్ వెంట ఉన్నారు. కాబ‌ట్టి ఈ సారి త‌న‌కు మంత్రి ప‌ద‌వి ఖాయం అనే ధీమాలో ఉన్నార‌ట‌.

ఇక‌, గుడివాడ అమ‌ర్నాథ్ కూడా తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నా‌రు. ఈయ‌న కూడా జ‌గ‌న్ మిత్రుడిగా, స‌న్నిహితుడిగా ఉన్నారు. అంతేకాకుండా.. కాపు సామాజిక వ‌ర్గం కోటా ప్ర‌కారంగానూ త‌న‌కు ఛాన్స్ ఉంటుంద‌ని అనుకుంటున్నారు. ఇదేవిధంగా మిగిలిన జిల్లాల్లోనూ నేత‌లు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు. మ‌రి, పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ ఎప్పుడు జ‌రుగుతుందీ? ఎవ‌రెవ‌రికి ప‌దువులు ద‌క్కుతాయి? అన్న‌ది చూడాలి.