Begin typing your search above and press return to search.

నిమిషానికి 11 మందిని.. ఆక‌లి కొరికేస్తోంది..!

By:  Tupaki Desk   |   9 July 2021 3:30 PM GMT
నిమిషానికి 11 మందిని.. ఆక‌లి కొరికేస్తోంది..!
X
ఒక మ‌నిషి క‌నీస అవ‌స‌రాలు తిండి, బ‌ట్ట‌, నీడ. ఇందులో నీడ లేకున్నా చెట్టుకిందో పుట్ట‌కిందో కాలం వెళ్ల‌దీయొచ్చు. దౌర్భాగ్యానికి ప‌రాకాష్ట‌గా స‌రిపెట్టుకోవాల్సి వ‌స్తే.. స‌రైన బ‌ట్ట లేకుండా కూడా బ‌త‌కొచ్చు. కానీ.. తిండి లేక‌పోతే ఎలా? పౌష్టికాహారం ప‌ర‌మాన్నాలు తినేవాళ్ల‌కే ఏనాడో రిజ‌ర్వు చేయ‌బ‌డిన ఈ ప్ర‌పంచంలో.. గంజి మెతుకులు కూడా లేక మ‌నిషి చ‌చ్చిపోవ‌డానికి మించిన దారుణం ఉంటుందా? కానీ.. ఇప్పుడు అదే దారుణం ప్ర‌పంచాన్ని చుట్టు ముట్టింది. గ‌తంలో కూడా ఉన్న ఈ ప‌రిస్థితి క‌రోనా త‌ర్వాత మ‌రింత దారుణంగా విస్త‌రించింది. ఈ ప‌రిస్థితిని లోతుగా త‌ర‌చి చూస్తే.. గుండెలు నీరైపోవ‌డం ఖాయం!

ప్ర‌పంచంపై క‌రోనా ప్ర‌భావం ఏవిధంగా ఉందో అంద‌రికీ తెలిసిందే. అయితే.. అంద‌రూ మ‌ర‌ణాలు, కేసుల లెక్క‌ల వ‌ర‌కే ప‌రిమితం అవుతున్నారు. ఇంకాస్త లోతుగా ఆలోచించే వారు కోల్పోయిన ఉద్యోగాలు, దూర‌మైన ఉపాధి వ‌ర‌కూ వెళ్తున్నారు. కానీ.. అన్నం దొర‌క్క కూడా చ‌చ్చిపోతున్నారు అభాగ్యులు! ప్ర‌పంచ వ్యాప్తంగా పెరుగుతున్న పేద‌రికం, ఆక‌లి చావుల‌పై ‘ఆక్స్ ఫామ్‌’ అనే సంస్థ ‘the hunger virus multiplies’ పేరుతో నివేదికను విడుదల చేసింది. ఇందులోని వాస్త‌వాల‌ను ప‌రిశీలిస్తే.. క్షేత్ర‌స్థాయిలో పేద‌ల ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థ‌మ‌వుతుంది.

ప్ర‌పంచంలో పేద‌రిక నిర్మూల‌న కోసం ఈ సంస్థ ప‌నిచేస్తోంది. ఈ నేప‌థ్యంలో క‌రోనా త‌ర్వాత జ‌నాల కొనుగోలు శ‌క్తి ఏ మేర‌కు ప‌డిపోయింది? పేదరికం ఎలా ఉంది? దీనికి గల కారణాలను పరిశీలించి, విశ్లేషించింది. ఈ సంస్థ విడుద‌ల చేసిన‌ నివేదిక ప్ర‌కారం.. ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా 155 మిలియ‌న్ల మంది అత్యంత దారుణ‌మైన ఆహార సంక్షోభంలో చిక్కుకున్నార‌ని వెల్ల‌డించింది. గ‌త సంవ‌త్స‌రంతో పోలిస్తే.. దాదాపు 2 కోట్ల మంది అధికంగా ఆక‌లి జాబితాలో చేరిపోయిన‌ట్టు ప్ర‌క‌టించింది.

ఇప్ప‌టికే.. ప్ర‌కృతి విప‌త్తులు, గ్లోబ‌ల్ వార్మింగ్ వంటి అంశాల‌తో ఆహార ధాన్యాల ఉత్ప‌త్తి త‌గ్గిపోవ‌డం.. ఫ‌లితంగా వాటి ధ‌ర‌లు పెర‌గ‌డం.. తుద‌కు నిరుపేద‌లు వాటిని కొనుగోలు చేయ‌లేక‌పోవ‌డం జ‌రుగుతోంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో క‌రోనా వ‌చ్చి మ‌రింత దారుణ ప‌రిస్థితులు సృష్టించింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది ఆక్స్ ఫామ్ సంస్థ‌. క‌రోనాతో ఉపాధి కోల్పోవ‌డం.. కొనుగోలు శ‌క్తి మ‌రింత దారుణంగా ప‌డిపోవ‌డం వంటి కార‌ణాల‌తో.. దారిద్ర‌రేఖ దిగువ‌నుంచి మ‌రింత కింద‌కు జారిపోయార‌ని వెల్ల‌డించింది. దీంతో.. తిన‌డానికి తిండి దొర‌క‌క ఒక్క నిమిషానికి స‌గ‌టున 11 మంది ప్రాణాలు కోల్పోతున్నార‌నే దారుణ స‌త్యాన్ని తెలిపింది.

ఇది క‌రోనా వైర‌స్ తో చ‌నిపోతున్న‌వారి క‌న్నా చాలా ఎక్కువ‌. కొవిడ్ తో నిమిషానికి స‌గ‌టున ఏడుగురు చ‌నిపోతున్న‌ట్టుగా లెక్క‌గ‌ట్టిన ఆక్స్ ఫామ్‌.. ఆక‌లితో 11 మంది చ‌నిపోతున్నార‌న్న చేదు నిజం వెల్ల‌డించింది. ప్ర‌ధానంగా సిరియా, యెమెన్‌, ద‌క్షిన సూడాన్‌, ఇథియోపియా, ఆఫ్గ‌నిస్తాన్ దేశాల్లో ఆక‌లి చావులు అధికంగా ఉన్న‌ట్టు ప్ర‌క‌టించింది.

ఇలాంటి స‌మ‌యంలోనే ప్ర‌పంచ దేశాల అధినేత‌లు చేస్తున్న దారుణాల‌ను కూడా వివ‌రించింది. క‌రోనా దారుణ ప‌రిస్థితుల్లో దేశాల ఆర్థిక వ్య‌వ‌స్థ‌లు క్షీణించి, పేద‌లు ఆక‌లితో చ‌స్తున్న ఈ కాలంలో కూడా.. సైనిక‌ ఖ‌ర్చును 51 బిలియ‌న్ డాల‌ర్ల మేర ప్ర‌పంచ దేశాలు పెంచేశాయ‌నే క‌ఠిన వాస్త‌వాన్ని కూడా త‌న నివేదిక‌లో పొందు ప‌రిచింది. కొన్ని దేశాల్లో సాగుతున్న అంత‌ర్గ‌త‌ యుద్ధం కూడా ఆక‌లి చావులు పెర‌గ‌డానికి కార‌ణ‌మైంద‌ని ఆక్స్ ఫామ్ వెల్ల‌డించింది. దేశాలు వాస్త‌వాన్ని గుర్తించి, సంప‌ద స‌మాన పంపిణీపై దృష్టిసారించ‌క‌పోతే.. మ‌రిన్ని దారుణాలు చోటు చేసుకుంటాయ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేసింది ఆక్స్ ఫామ్ సంస్థ‌.