Begin typing your search above and press return to search.

రూ.5.50 గొడవ కోర్టుకు వెళ్లటంతో హోటల్ కు భారీ ఫైన్

By:  Tupaki Desk   |   4 March 2022 4:37 AM GMT
రూ.5.50 గొడవ కోర్టుకు వెళ్లటంతో హోటల్ కు భారీ ఫైన్
X
అవును.. మీరు చదివింది నిజమే. కేవలం ఐదున్నర రూపాయిల (రూ.5.50)కు సంబంధించి ఒక హోటల్ కు ఒక వినియోగదారుడికి మధ్య జరిగిన మాట తేడా.. చివరకు కోర్టు మెట్లు ఎక్కే వరకు వెళ్లింది. తన వాదనలు వినిపించిన వినియోగదారుడి వాదనలో న్యాయం ఉందని భావించిన వినియోగదారుల కోర్టు.. సదరు హోటల్ కు భారీ ఫైన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇంతకీ రూ.5.50 గొడవేంటి? దీనికి కోర్టు ఏమన్నది చూస్తే..

వంశీ అనే వ్యక్తి ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని గౌతమి హాస్టల్ లో ఉండేవాడు. తన నలుగురు స్నేహితులతో కలిసి దగ్గర్లోని తిలక్ నగర్ లో ఉన్న లక్కీ బిర్యానీ హౌస్ కు వెళ్లాడు. వారి బిల్లు రూ.1075.. జీఎస్టీతో కలిపి రూ.1127.50 అయ్యింది. ఈ బిల్లులో మినరల్ వాటర్ బాటిల్ కు అదనంగా రూ.5 వసూలు చేసినట్లుగా గుర్తించాడు. ఎందుకిలా చేశారని హోటల్ సిబ్బందిని ప్రశ్నించగా.. బిర్యానీ హౌజ్ సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు.

తమ మాటలతో హోటల్ సిబ్బంది తనను మానసిక క్షోభకు గురి చేయటాన్ని తీవ్రంగా పరిగణలోకి తీసుకున్న వంశీ.. తన నుంచి అదనంగా వసూలు చేసిన రూ.5.50నువసూలు చేసుకునేందుకు హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్ 2ను ఆశ్రయించారు. కేసును విచారించిన వినియోగదారుల కమిషన్ బెంచ్ 2 తన తీర్పును వెలువరించింది. దీని ప్రకారం అదనంగా వసూలు చేసిన రూ.5.5కి పది శాతం వడ్డీతో చెల్లించటంతో పాటు ఫిర్యాదీకి రూ.5వేల పరిహారం ఇవ్వాలని ఆదేశించింది.

అదే సమయంలో జిల్లా వినియోగదారుల సంరక్షణ మండళ్ల సంక్షేమం కోసం రూ.50వేలు.. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో చెల్లించాలని ఆదేశించింది. దీంతో.. అనుచితంగా ప్రవర్తించి.. రూ.5.50 కోసం కస్టమర్ తో గొడవ పడిన లక్కీ రెస్టారెంట్ కు ఏకంగా రూ.55వేలకు మించిన ఫైన్ పడినట్లుగా తేల్చారు. గోటితో పోయే దానికి గొడ్డలి వరకు తెచ్చుకోవటం అంటే ఇదేనేమో కదూ?