Begin typing your search above and press return to search.

అయోధ్య శంకుస్థాపనలో హైలెట్ అదేనట

By:  Tupaki Desk   |   21 July 2020 10:15 AM IST
అయోధ్య శంకుస్థాపనలో హైలెట్ అదేనట
X
ఏళ్లకు ఏళ్లుగా అయోధ్యలో రామాలయాన్ని నిర్మించాలన్న హిందూ సంస్థల కోరిక ఫలించనుంది. ఆ మధ్యన సుప్రీంకోర్టు వెలువరించిన చారిత్రక తీర్పుతో రామాలయ నిర్మానానికి పచ్చజెండా ఊపినట్లైంది. కోర్టు తీర్పు అనంతరం చోటు చేసుకున్న పరిణామాలతో వచ్చే నెల ఐదున రామాలయ నిర్మాణానికి భూమిపూజ చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీకి ఆహ్వానం పంపటం.. ఆయన నుంచి సానుకూలత వ్యక్తమైనట్లు చెబుతున్నారు.

ఈ కార్యక్రమానికి 250 మంది ప్రముఖులు హాజరవుతున్నట్లు చెబుతున్నా.. అతిధుల సంఖ్యను బాగా కుదించనున్నట్లు చెబుతున్నారు. ఐదున జరిగే భూమిపూజ కార్యక్రమానికి ప్రధాని మోడీతో పాటు.. మహారాష్ట్ర.. బిహార్ ముఖ్యమంత్రులతో పాటు దాదాపు యాభై మంది వీవీఐపీలను ఆహ్వానించనున్నారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం గురించి ఎంతగానో కలలు కన్న బీజేపీ కురువృద్ధ నేతలు అద్వానీ.. జోషీలను కూడా పిలుస్తుననారు.

ఆలయ ట్రస్టు అధ్యక్షుడు గోపాల్ దాస్ తాజాగా ఒక ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు. భూమిపూజ కార్యక్రమంలో హైలెట్ అంశం గురించి చెబుతూ. శంకుస్థాపన రోజున 40 కేజీల బరువైన వెండి ఇటుకను ప్రధాని మోడీ చేతలు మీదుగా పవిత్ర స్థలంలో ఉంచనున్నట్లు వెల్లడించారు. భూమిపూజ ఆగస్టు ఐదున నిర్వహిస్తున్నా.. అందుకు రెండు రోజుల ముందు నుంచే వేదోక్తంగా కార్యక్రమాలు మొదలు కానున్నాయి.

ఆగస్టు ఐదో తేదీ మధ్యాహ్నం 12.15 గంటలకు భూమిపూజను నిర్వహించనున్నారు. కోవిడ్ 19 పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకొని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ ట్రస్టు అధ్యక్షులు స్పష్టం చేశారు. భూమిపూజ కార్యక్రమాన్ని ఆయోద్య ప్రజలతో పాటు.. మిగిలిన దేశవాసులు చూసేందుకు వీలుగా లైవ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నారు. అయోధ్య వీధుల్లో పెద్ద ఎత్తున తెరల్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నారు.