Begin typing your search above and press return to search.

కేసీఆర్ డిఫెన్సులో పడే వ్యాఖ్య చేసిన హైకోర్టు

By:  Tupaki Desk   |   15 Aug 2020 9:30 AM GMT
కేసీఆర్ డిఫెన్సులో పడే వ్యాఖ్య చేసిన హైకోర్టు
X
మాటలు చెప్పటానికి.. చేతల్లో వాటిని చేసి చూపించటానికి చాలానే తేడా ఉంటుంది. అలాంటి విషయాల్ని విపక్షాలు ఎత్తి చూపితే రాజకీయంగా అధికారపక్షం కొట్టి పారేసే అవకాశం ఉంటుంది. అదే సామాన్యులో.. పాత్రికేయులో ప్రశ్నిస్తే.. ఏదో ఒక రంగులు అద్దే అవకాశం ఉంటుంది. కానీ.. న్యాయస్థానాలు అదే పని చేస్తే.. ప్రభుత్వం ఆత్మరక్షణలో పడటం తప్పించి.. మరింకేమీ చేయలేని పరిస్థితి ఉంది. తాజాగా తెలంగాణ రాష్ట్ర సర్కారుకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది.

దాదాపు పదేళ్ల క్రితం కేంద్రం తీసుకొచ్చిన ఉచిత నిర్బంధ విద్యాహక్కుచట్టం తెలంగాణ రాష్ట్రంలో అమలు కాకపోవటంపై తెలంగాణ హైకోర్టు విస్మయాన్నివ్యక్తం చేసింది. చట్టం వచ్చి పదేళ్ల అవుతున్నా.. ఇప్పటివరకు అమలు కాకపోవటం ఏమిటి? అని ప్రశ్నించింది. దీనికి సంబంధించిన విచారణలో కౌంటర్ దాఖలు చేస్తామని పలుమార్లు సమయాన్ని తీసుకున్నా.. ఇప్పటికి దాఖలు చేయటం లేదని ప్రశ్నించారు. ఇదే చివరి అవకాశమని.. సెప్టెంబరు నాలుగున జరిగే విచారణ సమయానికి పూర్తిస్థాయి కౌంటర్ దాఖలు చేయాలని పేర్కొంది.

కేంద్రం చేసిన చట్టం ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లను పేద విద్యార్థులకు కేటాయించాల్సి ఉంటుంది. ఈ చట్టాన్ని అమలు చేయటానికి అవసరమైన ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. అందులో 60 శాతం మొత్తాన్ని కేంద్రం నుంచి వెనక్కి తీసుకునే వెసులుబాటు ఉంది. ఈ చట్టానికి సంబంధించి దాఖలైన పది పిటిషన్లకు కలిపి సమగ్ర కౌంటర్ దాఖలు చేస్తామని అందుకు ఎనిమిది వారాల టైం కావాలని కోరారు. అంత సమయం ఇవ్వలేమన్న కోర్టు.. వచ్చే నెల నాలుగు నాటికి కౌంటర్ దాఖలు చేయాలని కోరారు.

ఇదిలా ఉంటే.. విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్య చేసింది. కేంద్రం అమలు చేసిన ఈ చట్టం ఉమ్మడి రాష్ట్రంలో అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి ఈ చట్టం అమలై ఉంటే.. రెండు రాష్ట్రాల్లోనూ పది లక్షల మంది నిరుపేదలకు మేలు జరిగి ఉండేదని పేర్కొంది. ఈ చట్టాన్ని దేశంలోని 16 రాష్ట్రాలు అమలు చేయటం ద్వారా 29.25లక్షల మందికి మేలు జరిగిందని పేర్కొంది.

అయితే.. ఈ చట్టాన్ని అమలు చేయటం ద్వారా రాష్ట్రం మీద అదనపు భారం పడుతుందని తెలంగాణ రాష్ట్రం తరపు వాదనలు వినిపించటాన్ని హైకోర్టు తప్పు పట్టింది. ప్రభుత్వం చెల్లించే మొత్తంలో 60 శాతాన్ని కేంద్రం వెంటనే చెల్లిస్తోందన్న వ్యాఖ్య చేసింది. ఇదంతా విన్న తర్వాత ఇంత మంచి చట్టం తెలంగాణలో ఎందుకు అమలు కావట్లేదన్న సందేహం కలుగక మానదు. తాజాగా కేసీఆర్ సర్కారు చేసిన తప్పు కళ్లకు కట్టినట్లుగా కనిపించేలా ఉన్న హైకోర్టు తాజా వ్యాఖ్యలు ఇబ్బందికి గురి చేయక మానదు.