Begin typing your search above and press return to search.

పెళ్లి మండపం నుంచి వరుడ్ జంప్.. అతిథితో వధువు వివాహం!

By:  Tupaki Desk   |   20 May 2021 2:30 AM GMT
పెళ్లి మండపం నుంచి వరుడ్ జంప్.. అతిథితో వధువు వివాహం!
X
చాలా సినిమాల్లో పీటల దాకా వచ్చిన పెళ్లి ఆగిపోతుంది. తర్వాత పెళ్లికి వచ్చిన హీరో లేదా హీరోయిన్ వివాహం జరిపిస్తారు. కథ సుఖాంతం అవుతుంది. చాలా సినిమాల్లో ఇలాంటి సన్నివేశాలు కనిపించాయి. కాగా పెళ్లి రోజు, పెళ్లికి ముందు రోజు వధువు లేక వరుడు పారిపోవడం అక్కడక్కడా వింటుంటాం. కానీ వరుడు పారిపోయినా ఆ వధువు పెళ్లి ఏ ఆటంకం లేకుండా జరగడం అంటే కాస్త ఆశ్చర్యం కలిగించే విషయమే. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లో జరిగింది.

కాన్పూర్ జిల్లాలోని మహారాజ్పూర్ పట్టణంలో ఓ వివాహం జరగాల్సి ఉంది. వధూవరులకు పెళ్లికి ముందు జరపాల్సిన తతంగాలన్నీ పూర్తి చేశారు. జైమాల కార్యక్రమం అనగా దండలు మార్చుకోవడం కూడా జరిగింది. చివరకు పెళ్లి ఘట్ట్టం ఒకటే మిగిలిపోయింది. ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి వరుడిని పిలిచారు. కాగా మండపంలో వరుడు అదృశ్యమయ్యాడు. స్థానికంగా గాలించినా ఫలితం లేకుండా పోయింది.

వరుడు కావాలనే పెళ్లి మండపం నుంచి పారిపోయాడని వధువు తరఫు కుటుంబ సభ్యులు ఓ నిర్ధారణకు వచ్చారు. పీటల దాకా వచ్చిన పెళ్లి ఆగిపోతుందని ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు పెట్టుకున్నారు. పట్టుబట్టలు, బంగారు నగలతో ఉన్న వధువు మొహం వెలవెలబోయింది. కాగా ఈ పెళ్లిని ఎలాగైనా జరిపించాల్సిందేనని ఆమె కుటుంబం సభ్యులు భావించారు. వేడుకకు వచ్చిన అతిథుల్లో వరుడి కోసం ఆరా తీశారు. కాగా ఓ యువకుడు పెళ్లికి సముఖత వ్యక్తం చేశాడు.

ఆ యువకుడి తల్లిదండ్రులతో యువతి తల్లిదండ్రులు మాట్లాడారు. క్షణాల్లో సంబంధం కలుపుకోవడం పూర్తయింది. అతిథిగా వచ్చిన ఆ యువకుడే వరుడిగా తయారయ్యాడు. ఇక పెళ్లికి వచ్చిన అతిథితో మూడు ముళ్లు వేయించుకోవడానికి ఆ యువతి అంగీకరించింది. ఇక్కడ వరుడు ఒక్కడే మారాడు. మిగతా కార్యక్రమాలన్నీ అనుకున్నట్లుగానే జరిగాయి. మొత్తానికి అలా వరుడు జంప్ అయినా... అతిథితో వైభవంగా పెళ్లి తంతును పూర్తి చేశారు.