Begin typing your search above and press return to search.

ఎన్నికల వేళ అమెరికాలో కలకలం..

By:  Tupaki Desk   |   10 Oct 2020 6:00 AM GMT
ఎన్నికల వేళ అమెరికాలో కలకలం..
X
అమెరికాలో ఎన్నికల సందడి జోరుగా సాగుతుండగా తాజాగా వెలుగులోకి వచ్చిన సంఘటన ఆ కలకలం రేపింది. భారీ స్థాయిలో ప్రజాప్రతినిధులు, అధికారుల కిడ్నాప్ కు మిలిటెంట్లు పథకం వేయగా ఫెడరల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్(ఎఫ్‌బీఐ) ముందుగానే కుట్రను పసిగట్టి అడ్డుకుంది. లేకపోతే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. దీనికి సంబంధించి 13 మంది నిందితులను అదుపు లోకి తీసుకుంది. ఈ సంఘటన పై ప్రస్తుతం అమెరికాలో రచ్చ రచ్చగా మారింది. ట్రంప్ ప్రభుత్వ తీరువల్లే ఇదంతా జరిగిందని డెమోక్రటిక్ పార్టీ విమర్శలు చేస్తుండగా..కుట్రను పసిగట్టి కాపాడినందుకు తమపైనే ఆరోపణలు చేయడం ఏంటని ట్రంప్ బదులిస్తున్నారు. కిడ్నాప్ కు సంబంధించి ఎఫ్‌బీఐ, న్యాయ విభాగం అధికారులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.

అమెరికా పశ్చిమభాగంలోని మిచిగన్ రాష్ట్రానికి గ్రెచెన్ విట్మర్ గవర్నర్ గా వ్యవహరిస్తున్నారు. ఆమె డెమోక్రటిక్ పార్టీకి చెందిన నాయకురాలు. కరోనా విషయంలో ట్రంప్ వ్యవహరిస్తున్న తీరుపై ఆమె ఇతర రాష్ట్రాల గవర్నర్లను కలుపుకుని ఉద్యమం నిర్వహించారు. నిత్యం ఏదో ఒక విషయంలో ట్రంప్ ను విమర్శిస్తుంటారు. దీంతో ట్రంప్ మద్దతు దారులకు ఆమె అంటే అక్కసే. విట్మర్ కు వ్యతిరేకంగా తుపాకులతో రోడ్లపైకి వచ్చి నిరసన ప్రదర్శనలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వోల్వరిన్ వాచ్ మెన్ పేరుతో ఏర్పాటైన ప్రభుత్వ వ్యతిరేక మిలిటెంట్ గ్రూపు మిచిగన్ గవర్నర్ గ్రెచెన్ విట్మర్ కిడ్నాప్ కు కుట్ర పన్నిందని ఆ రాష్ట్ర అటార్నీ జనరల్ డానా నాస్సెల్ తెలిపారు. రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన క్యాపిటల్ భవనంలో ఉన్న ప్రజాప్రతినిధులు, అధికారుల అపహరణకు ప్రయత్నించారు. తర్వాత ప్లాన్ మార్చి గెస్ట్ హౌజ్ భవనంలో ఉన్న గవర్నర్ విట్మర్ ను మాత్రమే కిడ్నాప్ చేయాలని చూశారు. ఇందు కోసం పలుమార్లు రెక్కీ కూడా నిర్వహించారు. ఎఫ్‌బీఐ దీనిని పసిగట్టి మిలిటెంట్ల చర్యకు బ్రేకులు వేశారు. గవర్నర్ ను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన 13 మందిని అరెస్టు చేసినట్లు ఎఫ్‌బీఐ అధికారులు వెల్లడించారు.

దీనిపై విట్మర్ మాట్లాడుతూ డొనాల్డ్ ట్రంప్ ప్రవర్తన, ఆయన మాటలు మిలిటెంట్ లకు మద్దతు ఇచ్చేలా ఉన్నాయని,ఇటీవల జరిగిన డిబేట్లలోనూ ట్రంప్ మిలిటెంట్ల పట్ల సానుకూల ధోరణి ప్రదర్శించారని విమర్శించారు. విట్మర్ చేసిన వ్యాఖ్యలను ట్రంప్ ఖండించారు. పరిపాలనలో ఆమె అవలంబించిన విధానాలే..ఆమెకు ఈ పరిస్థితి తెచ్చి పెట్టాయని విమర్శించారు. మిలిటెంట్ల కుట్రను పసిగట్టి రక్షించినందుకు తనకు కృతజ్ఞతలు చెప్పాల్సింది పోయి విమర్శలు చేయడం ఏంటని ట్రంప్ ట్వీట్ చేశారు. మొత్తానికి ఎన్నికల సమీపంలో అక్కడికి రాజకీయాలు రసవత్తరంగా మారాయి.