Begin typing your search above and press return to search.

పోలీసుల‌కు ఎస్కేప్ స్కెచ్ ఇచ్చిన డేరాబాబా

By:  Tupaki Desk   |   31 Aug 2017 6:20 AM GMT
పోలీసుల‌కు ఎస్కేప్ స్కెచ్ ఇచ్చిన డేరాబాబా
X

లైంగిక దాడి కేసుల్లో 20 ఏళ్ల‌ జైలు శిక్షపడిన డేరా సచ్చా సౌదా అధిపతి గుర్మీత్ రాం రహీం సింగ్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు విఫ‌ల‌య‌త్నం చేశాడు. శిక్ష ఖ‌రారుకు ముందే ఈ కుట్ర చేయ‌డం ఆస‌క్తిక‌రం. కుట్ర అమలుకు ఆయన అనుచరులు విఫలయత్నం చేసి, అరెస్టయ్యారు. హర్యానా పోలీసులు కేసు నమోదు చేయడంతో ఈ కుట్ర సంగతి బయటపడింది. తనను దోషి అని జడ్జి ప్రకటించగానే గుర్మీత్ ఎర్రటి బ్యాగు తెమ్మని కోరడంతో కుట్ర అమలుకు సంకేతం ఇచ్చాడని పోలీస్ ఉన్న‌తాధికారులు వివ‌రించారు.

ఇద్దరు మహిళలపై లైంగిక దాడి కేసుల్లో తమ అధినేతకు వ్యతిరేకంగా వస్తే ఆయనను తప్పించాలని డేరా గార్డులు బయలు దేరారు. వారు ఊహించినట్లే గుర్మీత్‌ ను కోర్టు దోషిగా తేల్చింది. గుర్మీత్‌ ను ఒక స్కార్పియో కారులో ఎక్కించి, ఆయనకు రెండు పక్కలా పొలీసు అధికారులే సెక్యూరిటీగా కూర్చుని జైలుకు బయలు దేరారు. ``స‌రిగ్గా ఈ స‌మ‌యంలోనే కుట్ర అమలుకు గుర్మీత్ అనుచరులు ఆయనను తీసుకువెళ్తున్న సార్పియో కారు కోర్టు ప్రాంగణంలోని పోలీసు బారియర్‌ ను చేరుకునే లోగా తెల్లటి ఎండీవర్ కారులో (డేరా వాహనాల్లో ఇదొకటి) అడ్డుకున్నారు. మా పితాజీ(గుర్మీత్)ని విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. అడ్డుపడిన పోలీసు అధికారులపై నుంచి కారును నడిపించాలని తమ డేరా డ్రైవర్‌ తో చెప్పారు. దీంతో ప్రమాదం ముంచుకొస్తున్న సంగతి గ్రహించిన పోలీసులు మరింత మంది అక్కడికి చేరుకుని డేరా గార్డులను చుట్టుముట్టి నిర్బంధించారు. పట్టుబడిన ఏడుగురు డేరా గార్డుల్లో ఐదుగురు హర్యానా పోలీసు సిబ్బంది కావడం విశేషం. డేరా గార్డుల వద్ద ఆటోమేటిక్ తుపాకులూ ఉన్నాయి. గుర్మీత్ ఇలా తప్పించుకునే కుట్ర చేశాడు`` అని హర్యానా ఐజీ కేకే రావు తెలిపారు.

మ‌రోవైపు డేరా సచ్చా సౌదా బాధ్యతలను ఇకపై గుర్మీత్‌సింగ్ కుమారుడు జస్మీత్ ఇన్సాన్(33) నిర్వహించనున్నారు. జస్మీత్ డేరా కార్యనిర్వాహక మేనేజర్‌ గా వ్యవహరిస్తారని సిర్సాలోని డేరా కేంద్రం ప్రకటించింది. రేప్ కేసుల్లో 20 ఏళ్ల‌ శిక్షపడిన గుర్మీత్‌ కు వారసుడిగా జస్మీత్‌ ను 45 మంది సభ్యుల డేరా కోర్ కమిటీ సోమవారం ఎంపిక చేసింది. 2007లో తనపై సీబీఐ రేప్ కేసులు పెట్టినపుడే గుర్మీత్ తన వారసునిగా జస్మీత్‌ ను నిర్ణయించినట్లు తెలిసింది. జస్మీత్ డేరా నిర్వహణ చూస్తారని, డేరా అధిపతిగా గుర్మీత్ సింగే కొనసాగుతారని గుర్మీత్ కోడలు హసన్ ప్రీత్ తెలిపారు. గురువారం గుర్మీత్ తల్లి, భార్య ఇతర కుటుంబీకులు జైల్లో ఉన్న గుర్మీత్‌ను కలుసుకొని జస్మీత్ నియామకానికి ఆయన ఆమోదం తీసుకుంటారని తెలిసింది. గ్రాడ్యుయేట్ అయిన 33 ఏళ్ల‌ జస్మీత్ వ్యాపారం చేస్తున్నారు. పంజాబ్ కాంగ్రెస్ నేత హర్మీందర్‌సింగ్ జస్సీ కుమార్తెను ఆయన వివాహం చేసుకున్నారు.