Begin typing your search above and press return to search.

గవర్నర్ కు షాకిచ్చిన సీఎం

By:  Tupaki Desk   |   11 Feb 2021 2:30 PM GMT
గవర్నర్ కు షాకిచ్చిన సీఎం
X
ప్రభుత్వానికి చెందిన వీవీఐపీ విమానం ఉపయోగించేందుకు గవర్నర్ కు అనుమతి నిరాకరిస్తూ సీఎం షాకిచ్చారు. దీంతో మరోసారి మహారాష్ట్ర గవర్నర్, సీఎం ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వం మధ్య విభేదాలు బయటపడ్డాయి.గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ మహారాష్ట్ర ప్రభుత్వ విమానంలో ప్రయాణించేందుకు ఠాక్రే సర్కార్ అనుమతి నిరాకరించింది. దీంతో గవర్నర్ రెండు గంటల పాటు విమానాశ్రయంలోనే ఉండాల్సి వచ్చింది.మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యార్ గురువారం ఉత్తరాఖండ్ పర్యటనకు వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన విమానాన్ని బుక్ చేసుకున్ానరు. ఉదయం 10 గంటలకు ఆయన ముంబై నుంచి డెహ్రాడూన్ వెళ్లాల్సి ఉంది.

ఈ ఉదయం ఆయన ఎయిర్ పోర్టుకు వెళ్లి నేరుగా విమానంలో కూర్చున్నారు. అయితే 15 నిమిషాల తర్వాత వచ్చిన పైలట్ ఈ విమానంలో ప్రయాణానికి ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదని చెప్పినట్లు సమాచారం. దీంతో విమానం దిగిన గవర్నర్.. మరో విమానం కోసం రెండు గంటల పాటు వేచి ఉన్నారు. మధ్యాహ్నం 12.15 గంటల ప్రాంతంలో ప్రైవేటు ఎయిర్ క్రాఫ్ట్ బుక్ చేసుకొని గవర్నర్ డెహ్రాడూన్ వెళ్లినట్లు సమాచారం.

ఈ పరిణామాలపై డిప్యూటీ సీఎం అజిత్ పవార్ స్పందించారు. తన వద్ద ఎటువంటి సమాచారం లేదన్నారు. ఇక గవర్నర్ వారం ముందు సమాచారం ఇచ్చినప్పటికీ ప్రభుత్వం కావాలనే అనుమతి ఇవ్వలేదని మహారాష్ట్ర బీజేపీ ఆరోపించింది. గవర్నర్ ను అవమానించినందుకు గాను సీఎం ఉద్దవ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.కొంతకాలంగా ఠాక్రే, గవర్నర్ కోశ్యారీ మధ్య విభేదాలు నెలకొన్నాయి. ఈ మధ్య ఆలయాలు, ప్రార్థనమందిరాలను తెరిచే అంశంపై సీఎం ఠాక్రే వాడివేడి లేఖలు రాసుకున్నారు. ఇదే ఈ వివాదానికి కారణంగా భావిస్తున్నారు.