Begin typing your search above and press return to search.

జగన్ సర్కారుకు బూస్టు గా మారిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్

By:  Tupaki Desk   |   5 March 2023 8:00 AM GMT
జగన్ సర్కారుకు బూస్టు గా మారిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్
X
కొన్నిసార్లు అంతే.. కాలం అలా కలిసి వస్తుంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విషయంలోనూ సుడి మా గొప్పగా పని చేస్తూ ఉంటుంది. తన చేతికి అధికారం వచ్చిన నాలుగేళ్లలో.. నిత్యం ఏదో ఒక నెగిటివిటీనే తప్పించి.. ఒక్క పాజిటివిటీ కూడా లేని ప్రభుత్వంగా జగన్ సర్కారు మూటకట్టుకున్న పేరుప్రఖ్యాతులు అన్ని ఇన్ని కావు. రాష్ట్రంలో ఒక నెల పాటు ప్రశాంతంగా పాలన చేసింది లేదన్న విమర్శ తరచూ అందరి నోట వచ్చేస్తున్న పరిస్థితి. చివరకు ఏపీకి మరోసారి జగన్ ముఖ్యమంత్రి అయితే.. తెలంగాణ ఎక్కడికో వెళ్లిపోతుందన్న మాట తెలంగాణలోని ప్రతి ఒక్కరు అనుకుంటున్న పరిస్థితి.

2019లో జగన్ ఏపీకి ముఖ్యమంత్రి కాకుంటే.. ఈ రోజున తెలంగాణలోని భూములకు వచ్చిన ధరలు మళ్లీ ఎప్పటికో కానీ వచ్చేవి కావన్న మాట వినిపిస్తూ ఉంటుంది. ఇలా సొంత రాష్ట్రానికి నష్టాన్ని.. పక్క రాష్ట్రానికి లాభంగా మార్చిన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పేరును చెబుతున్న పరిస్థితి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. ప్రతిపక్ష నేతల విషయంలో జగన్ సర్కారు వ్యవహరించే ధోరణి మరో ఎత్తుగా చెప్పాలి.
సోషల్ మీడియాలో పోస్టు పెట్టే సందులో సుబ్బారావు మొదలు.. రాష్ట్రస్థాయి నేతల వరకు ఎవరినీ విడిచి పెట్టకుండా ఉక్కిరిబిక్కిరి అయ్యేలా చేయటం.. కేసులు పెట్టటం.. కాస్త నోరు జాస్తి అయిన వారికి రూళ్ల కర్రల దెబ్బలు ఎలా ఉంటాయన్న విషయాన్ని పరిచయం చేసి.. తామంటే భయాన్ని చూపిస్తున్నారన్న ఆరోపణలు తరచూ వినిపిస్తూ.. ఏపీ అంటే పంచాయితీలు తప్పించి.. ఒక్క మంచి కూడా ఉండదా? అని విసుక్కునే పరిస్థితి.

చేతిలో ఉన్న అధికారం ఏడాదికి తగ్గిపోయిన వేళ.. రాష్ట్రంలోని 175 స్థానాలకు 175 స్థానాల్లో గెలుపు ఖాయమన్న ముఖ్యమంత్రి మాటలకు నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితులు నెలకొన్న వేళ.. విశాఖలో నిర్వహించిన గ్లోబల్ ఇన్విస్టర్స్ సమ్మిట్ సీన్ ను మార్చిందని మాత్రం చెప్పాలి. సీఎం జగన్ హయాంలోని గడిచిన నాలుగేళ్లు ఒక ఎత్తు అయితే.. ఈ రెండు రోజులు ఒక ఎత్తుగా చెప్పక తప్పదు. నిజంగానే చెప్పినట్లుగా ఏపీలో పెట్టుబడులు పెడతారా? లేదా? అన్నది పక్కన పెడితే.. తన పలుకుబడి మొత్తాన్ని ప్రదర్శించి.. తన సత్తా చాటేలా సమ్మిట్ ను సక్సెస్ చేయటంతో జగన్ సర్కారుకు మంచి మార్కులే పడ్డాయని చెప్పాలి.

ఇక్కడే ఒక విషయాన్ని ప్రస్తావించాలి. ఇంతకాలం ఏపీ అంటే నెగిటివిటీ తప్పించి.. పాజిటివిటీ అన్నది లేనట్లుగా ఉన్న పరిస్థితుల్లో అందుకు భిన్నంగా పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో.. సీఎం జగన్ పాలనా తీరు మారితే మంచిదన్న మాట వినిపిస్తోంది. ఇప్పటికైనా ఆవేశాలు.. ఆగ్రహాలు.. బురద జల్లటాలు.. కేసులు పెట్టటం లాంటివి పక్కన పెట్టి.. పాలన మీద ఫోకస్ చేసి.. ఇలాంటివి సమ్మిట్ల మీద ద్రష్టి పెడితే మంచిదన్న మాట వినిపిస్తోంది. మరి.. ఇలాంటి విషయాల్ని సీఎం జగన్ తన బుర్రలోకి రానిస్తారంటారా?

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.